రూ.75కే ఎల్‌ఈడీ బల్బు
♦ ప్రత్యేక స్టాళ్ల ద్వారా విక్రయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
♦ రెండు రాయితీ బల్బులు పేదలకు అందించే ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో కనీసం రూ.150కు తగ్గకుండా లభిస్తున్న ఎల్‌ఈడీ బల్బులను రాష్ట్రంలో రూ.75కే విక్రయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ బల్బులను విక్రయించనుంది. బహిరంగ మార్కెట్లో ఒక్క ఎల్‌ఈడీ బల్బు ధర రూ.150 వరకు ఉండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు అధికంగా సాంప్రదాయ బల్బులనే వినియోగిస్తున్నారు.
ఎల్‌ఈడీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ సైడ్ ఎఫిషియంట్ లైటింగ్ ప్రోగ్రాం(డీఈఎల్పీ)ను అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలుకు గాను ఎల్‌ఈడీ బల్బుల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించగా ఉత్పత్తిదారులు పోటీ పడి కేవలం రూ.74.65లకే విక్రయించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద 9వాట్ల సామర్థ్యం గల రెండు ఎల్‌ఈడీ దీపాలను రాయితీపై రాష్ట్రంలో ఇంటింటికీ అందజేస్తారు. ఒక్కో బల్బుకు రూ.75 వ్యయం అవుతుండగా..వినియోగదారుల నుంచి రూ.10 వసూలు చేసి, మిగిలిన రూ.65ను డిస్కంలు భరించనున్నాయి.
ఈ పంపిణీ దశల వారీగా జరగనుంది. వంద రోజుల ప్రణాళిక కింద పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 25 నగర పంచాయతీల పరిధిలోని గృహాలకు ఏప్రిల్ నుంచి పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద నల్లగొండ, మెదక్, నిజామాబాద్‌లను ఎంపిక చేశారు. దీనికి తోడు తెలంగాణ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.75కే ఎల్‌ఈడీ బల్బులను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాయితీ కింద సరఫరా చేసినా, వినియోగదారుల అవసరాల మేరకు అదనపు బల్బులను తక్కువ ధరలకు అందించాలని భావిస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు జిల్లాల పరిధిలో 25లక్షల ఎల్‌ఈడీలను, మరో 25 నగర పంచాయతీల్లో 4.66లక్షల ఎల్‌ఈడీలను పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఈఈఎస్‌ఎల్ నుంచి బల్బులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 96లక్షల కుటుంబాలకు పంపిణీ చేసేందుకు 1.92లక్షల ఎల్‌ఈడీలు అవసరం కానున్నాయని అధికారులు తెలిపారు.