సేఫ్ అండ్ హ్యాపీ!
గ్రేటర్‌లో ఇక ఇంటింటికీ ఎల్‌ఈడీ వెలుగులు!
►విద్యుత్ ఆదా... పర్యావరణ హితమే లక్ష్యం
►కార్యాచరణకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
►ఎస్‌హెచ్‌జీల సహకారంతో సబ్సిడీపై విక్రయాలు
సిటీబ్యూరో: విద్యుత్ ఆదా...పర్యావరణ హితమే లక్ష్యంగా గ్రేటర్ పరిధిలో ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల కుటుంబాలకు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు విక్రయించిన జీహెచ్‌ఎంసీ..ఇక నుంచి స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా సబ్సిడీపై ఎల్‌ఈడీ బల్బుల విక్రయాలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా భారీగా విద్యుత్ ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగం వల్ల 20 నుంచి 75 శాతం వరకు విద్యుత్ ఆదా అయి...బిల్లులు భారీగా తగ్గుతాయని చెబుతున్నారు. సాధారణ బల్బులు, ట్యూబ్‌లైట్ల కంటే ఎల్‌ఈడీలు ఎంతో మేలని పేర్కొన్నారు.
ఉజాలా పథకం కింద...
గ్రేటర్ నగరంలోని అన్ని నివాస గృహాల్లో ఎల్‌ఈడీ బల్బులను వినియోగించేందుకు స్వయం సహాయక మహిళాసంఘాల (ఎస్‌హెచ్‌జీ) సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నగరంలోని 22 లక్షలకుపైగా గృహాలన్నింటికీ వీటిని విక్రయించేందుకు ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉజాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈఈఎస్‌ఎల్ నుండి సబ్సిడీ రేట్లకు కొనుగోలు చేసి, ప్రతి ఇంటికి వీటిని విక్రయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. నగరంలో జీహెచ్‌ఎంసీ సహకారంతో ఈఈఎస్‌ఎల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్‌ఈడీ విక్రయ కేంద్రాల ద్వారా ఇప్పటికే 9 వాట్ల సామర్ధ్యం గల 2,17,000 ఎల్‌ఈడీ బల్బులు, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ట్యూబ్ లైట్లు 50 వేలు, 8750 ఫ్యాన్లు విక్రయించారు. దాదాపు రెండు లక్షల గృహాల వారు వీటిని కొనుగోలు చేశారు. మిగతా 20 లక్షల గృహాలకు కూడా వీటిని విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకుగాను ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవలు వినియోగించుకోనున్నారు.
విద్యుత్ ఆదా..పర్యావరణ హితం ఇలా..
ఉదాహరణకు ప్రస్తుతం ఒక్కో ఇంటికి మూడు ఫ్లొరోసెంట్ ట్యూబ్ లైట్లు ఉపయోగించడం ద్వారా దాదాపు 23.33 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. వీటి స్థానంలో ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తే కేవలం 9.72 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది. అంటే దాదాపు 13.61 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఎల్‌ఈడీ బల్బుల వినియోగం ద్వారా నెలకు 12 నుంచి 20 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా విద్యుత్ చార్జీల స్లాబ్‌రేట్లు గణనీయంగా తగ్గుతాయి. ప్లోరోసెంట్, సాంప్రదాయక విద్యుత్ బల్బులతో పోల్చిచూస్తే ఎల్‌ఈడీలు వాటికన్నా ఐదురెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో పాటు కార్బన్‌డయాక్సైడ్‌ను అతి తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. కాగా ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల ద్వారా రెండు లక్షలకు పైగా బల్బులు విక్రయించారు.
ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపిస్తుండటంతో దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్‌హెచ్‌జీల్లోని సామాజిక కార్యకర్తల సేవల్ని వినియోగించుకోనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక ఉజాల కార్యక్రమంలో భాగంగా ఒక్కో ఎల్‌ఈడీ బల్బు 70 రూపాయలు, ట్యూబ్ లైట్ 230 రూపాయలు, ఫ్యాన్ 1,150 రూపాయలకు విక్రయిస్తున్నారు.