విద్యుత్ 'ఆదా'యం! | The government launched a broader program for power saving | Sakshi
Sakshi News home page

విద్యుత్ 'ఆదా'యం!

Published Sun, Jan 10 2016 3:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

విద్యుత్ 'ఆదా'యం! - Sakshi

విద్యుత్ 'ఆదా'యం!

♦ విద్యుత్ పొదుపు కోసం బృహత్ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం
♦ సాంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ దీపాలు
 ♦ ఇళ్లకూ సబ్సిడీ ధరపై అందజేత.. వాయిదాల్లో డబ్బు చెల్లించే చాన్స్
♦ కోటి మంది రైతులకు ఉచితంగా నాణ్యమైన పంపుసెట్లు
♦ రూ. 4,800 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిన సర్కారు
♦ ఏటా 5,212 మిలియన్ యూనిట్ల విద్యుత్, రూ. 2,500 కోట్లు ఆదా
♦ రెండేళ్లలోనే తిరిగి రానున్న పెట్టుబడి వ్యయం
♦ నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు, పరికరాల వినియోగానికి ప్రోత్సాహం
 
 సాక్షి, హైదరాబాద్
 రోజు రోజుకూ సరికొత్త సాంకేతికతలు ఎన్నో ప్రజల ముంగిటకు వస్తున్నాయి. ఆ కొత్త పరిజ్ఞానానికి తగినట్లుగా ప్రజల అభిరుచులూ మారిపోతున్నాయి. కానీ వెలుతురు కోసం మాత్రం ఎప్పుడో 120 ఏళ్ల కింద 1879లో థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్న రకం బల్బులనే ఇంకా ఎక్కువ మంది జనాభా వినియోగిస్తున్నారు. ఈ ఫిలమెంట్ బల్బులు విద్యుత్‌ను విపరీతంగా వినియోగిస్తాయి. అందులో 95 శాతం ఉష్ణం (వేడి) రూపంలోనే వృథా అవుతుంది. 60 వాట్ల సాధారణ బల్బు ఇచ్చే వెలుగును 7 వాట్ల ఎల్‌ఈడీ విద్యుద్దీపాలు ఇవ్వగలవు. దీంతో భారీగా విద్యుత్ పొదుపు అయ్యే అవకాశమున్నా... ప్రజలు వాటిపై మక్కువ చూపడం లేదు.

కారణం ఎల్‌ఈడీల ధర చాలా ఎక్కువగా ఉండడమే. దీంతో విద్యుత్ పొదుపు కోసం రాష్ట్రమంతటా నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు, పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. వచ్చే ఐదేళ్లలో రూ. 4,800 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 69 నగరాలు, పట్టణాల్లో సాంప్రదాయ వీధిదీపాల స్థానంలో ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయనుంది. గృహాలకూ సబ్సిడీ ధరపై వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించేలా ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతోపాటు నాసిరకం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను ఉచితంగా సరఫరా చేయడం, 80 వేల సోలార్ పంపు సెట్లను మంజూరు చేయడం వంటి చర్యలూ చేపట్టనుంది. ఇవన్నీ అమల్లోకి వస్తే ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఏటా 5,212 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా కానుంది. అంటే ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వ్యయం తగ్గుతుంది. విద్యుత్ పొదుపు రూపంలో పెట్టుబడి వ్యయం సైతం రెండేళ్లలో తిరిగి రానుంది.
 
  ఇంటింటికీ ఎల్‌ఈడీ దీపం
  ఏటా రాష్ట్రవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం తొమ్మిది బిలియన్ యూనిట్లుకాగా... అందులో 20 శాతం వాటా విద్యుత్ దీపాలదే. సాధారణ ఫిలమెంట్ బల్బులు కేవలం రూ. 10-రూ. 15 మధ్య లభిస్తాయి. అదే ఎల్‌ఈడీ బల్బు ధర రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. దీంతో వినియోగదారులు సాధారణ బల్బుల వైపే మొగ్గు చూపుతున్నారు. 60 వాట్ల సామర్థ్యం గల సాధారణ బల్బు ఇచ్చే వెలుతురును కేవలం 7 వాట్ల ఎల్‌ఈడీ దీపం ఇస్తుంది. అసలు సాధారణ బల్బులు కాల్చే విద్యుత్‌లో 95 శాతం కేవలం ఉష్ణం రూపంలోనే వృథా అవుతుంది. అలా ఎల్‌ఈడీ బల్బు విద్యుత్‌ను వృథా చేయదు.

ఒక సాధారణ బల్బు స్థానంలో ఎల్‌ఈడీని వినియోగిస్తే ఏటా రూ.160 నుంచి రూ.400 వరకు పొదుపు చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఎల్‌ఈడీల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 100 నగరాల్లో ‘డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం(డీఈఎల్పీ)’ను అమలు చేస్తోంది. రూ.200 నుంచి రూ.350 విలువ చేసే ఎల్‌ఈడీలను ఈ కార్యక్రమం కింద రూ. 95 నుంచి రూ. 105కే వినియోగదారులకు అందజేస్తున్నారు. అందులోనూ తొలుత రూ.10 చెల్లించగానే ఒక ఎల్‌ఈడీ బల్బును అందజేసి... మిగతా సొమ్మును పలు వాయిదాల్లో విద్యుత్ బిల్లులతో కలిపి వసూలు చేస్తారు. ఈ తరహాలో నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా గృహాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీలను అమర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
 
 పంపు.. నాణ్యత పెంపు!
 రాష్ట్ర వ్యవసాయ రంగం 2014-15లో 12,000 మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వినియోగించగా... ప్రభుత్వం, డిస్కంలపై రూ. 3,664 కోట్ల సబ్సిడీ భారం పడింది. అయితే రైతులు వినియోగిస్తున్న నాసిరకం పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను అమర్చితే 25 నుంచి 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 19.4 లక్షల నాసిరకం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను ఏర్పాటు చేసేందుకు ఇంధన పొదుపు సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్) ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ. 3,880 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ పంపుసెట్ల మార్పిడితో ఏటా 3,841 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఆదా కానుంది. ప్రభుత్వానికి ఏటా రూ. 1,488 కోట్ల సబ్సిడీ భారం తగ్గనుంది.

 సాగుకు సౌర పంపు సెట్లు
 రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 80 వేల సోలార్ పంపు సెట్లను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నారు. 2015-16 నుంచి 2018-19 వరకు ప్రతి ఏటా 20 వేల పంపు సెట్ల చొప్పున మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
 
 వీధుల్లో ఎల్‌ఈడీ వెలుగులు
 రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని వీధి దీపాలకు ఏటా 1,001 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. దీనికి ఏటా రూ. 309 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తుండగా... ఆ వీధిదీపాల నిర్వహణ కోసం మరో రూ.363 కోట్లదాకా వెచ్చించాల్సి వస్తోంది. ఈ సాంప్రదాయ వీధిదీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చితే.. 50-55 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. వచ్చే ఐదేళ్లలో వీధిదీపాలన్నింటినీ ఎల్‌ఈడీలను అమర్చేందుకు ఈఈఎస్‌ఎల్ సంస్థ రూ.720 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం అమలు తీరు ఇలా ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement