సాక్షి, ముంబై: సీసీటీవీ కెమెరాల పనితీరుపై వీధిదీపాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో వాటిని మార్చివేయాలని బీఎంసీ నిర్ణయించింది. నగర రహదారులపై ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఏకంగా వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) మార్చాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై బీఎంసీ మహాసభలో చర్చలు జరిగాయి. అన్ని పార్టీల కార్పొరేటర్ల నుంచి ఆమోదం లభించడంతో వీధి దీపాల తొలగింపునకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం రహదారులపై పసుపు రంగులో వె లిగే వీధి దీపాలు ఉన్నాయి. ఈ వెలుగులో సీసీ కెమెరాల ద్వారా రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో వీటి స్థానంలో తెల్లగా వెలుగునిచ్చే ఎల్‌ఈడీ బల్బులు బిగించాలని బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2008 నవంబర్ 26న ఉగ్రవాదుల దాడుల సంఘటన అనంతరం నగర రహదారులపై, జంక్షన్ల వద్ద ఆరు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాని ఐదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు వేలకు బదులుగా కేవలం రెండున్నర వేల కె మెరాలు కీలకమైన జంక్షన్లు, రహదారులపై ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కాని అందులో రికార్డయిన వీడియో ఫుటేజ్‌లో పసుపు రంగు వెలుగునిచ్చే స్ట్రీట్ లైట్ల కారణంగా ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదని తేలింది. రాత్రి వేళల్లో దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి సంఘటనల్లో నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఎల్‌ఈడీ దీపాలు అమర్చాలని నిర్ణయించారు. అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. త్వరలో టెండర్లను ఆహ్వానించి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు శివసేన నాయకురాలు శీతల్ మాత్రే చెప్పారు.
వీధిదీపాలుగా ఎల్‌ఈడీ బల్బులు!
Published Thu, Jan 2 2014 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement