ముంబయి: బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో నాయకులను కట్టడి చేయనుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇందుకోసం ఎన్నికలు జరిగే ప్రాంతాల నిండా నిఘా నేత్రాలు(సీసీటీవీ కెమెరాలు) ఏర్పాటు చేస్తుంది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13,000 సీసీటీవీ కెమెరాలు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకుల హడావుడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, కానుకలు ఇవ్వడం, బోగస్ ఓటింగ్‌కు పాల్పడే ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటి.
సమస్యాత్మక నియోజకవర్గాల్లో మత ఘర్షణలకు కూడా వారు పరోక్షంగా కారణం అవుతుంటారు. వీటికి తాజాగా బీఎంసీ పరిపాలనా విభాగం చెక్ పెట్టనుంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులపై దృష్టి సారించేందుకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ముంబైతో పాటు పశ్చిమ, తూర్పు ఉప నగరాల్లో 13,020 సీసీటీవీ కెమారాలు అద్దెకు తీసుకుంది. దానికోసం రూ.6.37 కోట్లు అద్దె చెల్లించనుంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, రాజకీయ బహిరంగ సభల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు బీఎంసీ తెలిపింది.
గత బీఎంసీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు 50శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ సారి మరో 10శాతం పెంచాలని బీఎంసీ ప్రయత్నాలకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా సహకరిస్తుందని భావిస్తోంది. అందులో భాగంగా ప్రజలు ఓటు వేసేలా జనజాగృతి కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. అందుకు ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) నిర్మించిన స్కై వాక్‌లపై సుమారు రూ.3.45 లక్షలతో ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయనుంది. బస్సుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు రూ.11.38 లక్షలు, లోకల్ రైళ్లలో ప్రకటనల కోసం రూ.8.73 లక్షలు ఖర్చు చేయనుంది.
నాయకుల కట్టడికి 13వేల సీసీటీవీలు
Published Tue, Jan 10 2017 6:56 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement