పాత బల్బుకు కొత్త షోకులు!
♦ మరింత సమర్థమైన ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బు తయారీ
♦ కరెంట్ ఖర్చు పిసరంతే
ఎంఐటీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
ఒకప్పటి ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బుల కంటే తక్కువ కరెంటు ఖర్చయ్యే సీఎఫ్‌ఎల్ బల్బులను వాడటం మొదలుపెట్టామోలేదో వాటికంటే మెరుగైన ఎల్‌ఈడీ బల్బులొచ్చాయి. తాజాగా పాతతరం ఇన్‌కాండిసెంట్ బల్బులకు మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెరుగులు దిద్ది అత్యాధునిక బల్బును తయారుచేసింది. దీంతో ఎల్‌ఈడీకంటే దాదాపు పదిరెట్లు తక్కువ విద్యుత్‌తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టి వందేళ్లు దాటింది. టంగ్‌స్టన్ ఫిలమెంట్ వేడి నుంచి పుట్టే వెలుగులను పంచే ఈ బల్బు సామర్థ్యం చాలా తక్కువ. వాడే విద్యుత్‌లో 5 శాతం మాత్రమే వెలుతురుగా మారి ఉపయోగపడుతుంది. మిగతా 95శాతం వేడి రూపంలో వృథాగా పోతుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బులు వృథా చేసే కరెంటు దాదాపు 86 శాతమని అంచనా.
రీసైకిల్ చేస్తే...
విద్యుత్ బల్బులు మరింత సమర్థంగా పనిచేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని అవలంబించారు. వేడి రూపంలో వృథాగా గాల్లో కలుస్తున్న శక్తిని తిరిగి కాంతి రూపంలోకి మార్చారు. దీంతో టంగ్‌స్టన్ ఫిలమెంట్ బల్బు 40 శాతం సామర్థ్యంతో పనిచేసింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫిలమెంట్ చుట్టూ స్ఫటిక ఆకారపు గాజు తొడుగు ఏర్పాటు చేశారు. ఇది వెలుతురును ప్రసారం చేస్తూనే... వెలువడిన శక్తిని మళ్లీ దానిపైకే ప్రసారం చేసింది. అంటే.. ఫిలమెంట్ నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ఉండేందుకు తక్కువ కరెంట్ సరిపోతుందన్నమాట. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ఎల్‌ఈడీల కంటే మూడు రెట్లు ఎక్కువగా అంటే దాదాపు 40 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. సంప్రదాయ 60 కాండిళ్ల బల్బు ఏడాదిపాటు రూ.100 విద్యుత్ ఖర్చు చేస్తే ఇది కేవలం రూ.10 ఖర్చు చేస్తుంది. సీఎఫ్‌ఎల్ బల్బులైతే రూ.20, ఎల్‌ఈడీ బల్బులైతే రూ.18 వరకూ ఖర్చు చేస్తాయని యూకేలోని ఎనర్జీ సేవింగ్ ట్రస్ట్ తెలిపింది.
- సాక్షి, హైదరాబాద్
లాభాలెన్నో...
కొత్తరకం ఫిలమెంట్ బల్బుతో కరెంటు ఆదాతోపాటు మరెన్నో లాభాలున్నాయి. ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ బల్బుల తయారీలో పర్యావరణహానికారక పదార్థాలను వాడతారు. కొత్త బల్బులకు ఈ అవసరం లేదు. అంతేకాకుండా ఫిలమెంట్ బల్బు వెలువరించే వెలుతురు సూర్యకాంతిని పోలి ఉంటుంది. కంటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీల నుంచి వచ్చే నీలం రంగు కాంతి మన నిద్రను చెడగొడుతుందని శాస్త్రవేత్తల అంచనా. కొత్త బల్బులతో ఈ సమస్య ఉండదు.