ధాన్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బియ్యం సమకూర్చుకునే విషయంలో జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ.. ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విధానంతో మిల్లర్లకు కేటాయించి.. మిల్లింగ్ చేయించే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరించిన అధికారులు.. అంచనాలకు మించి కొనుగోలు కేంద్రాలకు రావడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో జిల్లాలో సంక్షేమ పథకాలకు వినియోగించే బియ్యానికి ఇబ్బంది లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అధికారులు సేకరించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకుని వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించనున్నారు.
ప్రధానంగా జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం జిల్లా నుంచి సేకరించిందే కావడం విశేషం. జిల్లా అవసరాలకు మించి ధాన్యం సేకరించిన అధికారులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 7వేల మెట్రిక్ టన్నులు పంపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో పంట దిగుబడులు లేకపోవడం.. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాకపోవడంతో ధాన్యాన్ని అక్కడికి తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఆయా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం దామాషా ప్రకారం మిల్లింగ్ చేసి.. బియ్యంగా చేసి.. మార్చి చివరి నాటికి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం మిల్లింగ్ జరుగుతున్న తీరును పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని రేషన్ షాపులతోపాటు ఐసీడీఎస్ కేంద్రాలకు, పలు సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు. అయితే ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిస్థాయిలో సన్న రకాలుగా ఉండే బియ్యాన్ని సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ ద్వారా 14, పీఏసీఎస్‌ల ద్వారా 72 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. లక్ష్యానికి మించి ధాన్యం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 7,349.480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీనికి సంబంధించి మిల్లర్లు అందించిన బియ్యాన్ని ఆ జిల్లాకే ఉపయోగించనున్నారు.
ఇలా కేటాయించారు..
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అందించింది. వీటిలో 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించిన 7,349.480 ధాన్యం పోను.. ఖమ్మం జిల్లాలో 1,43,201 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అందజేశారు. అందులో మిల్లర్లు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 40,635.420 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారు. కాగా.. ఇంకా రావాల్సిన 54,817.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చి 31వ తేదీలోగా పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది.
జిల్లాలో 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం..
జిల్లాలోని రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. ఈసారి అత్యధికంగా కొనుగోళ్లు జరగడంతో ఈ అవసరాలు తీరిపోగా.. ఇంకా కొద్దిమొత్తంలో బియ్యం మిగిలే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేషన్ దుకాణాల కోసం నెలకు 6,228.096 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. అంగన్‌వాడీ కేంద్రాలకు 90 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అంటే నెలకు 6,318.096 మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది.
ఏడాదికి 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. మిల్లర్ల నుంచి దాదాపు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుండడంతో ఈ అవసరాలకు పోను.. కొంత మేరకు మిగిలే అవకాశం ఉంది. అయితే వచ్చే ఈ బియ్యంలో 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఇక్కడ ఎవరూ ఉపయోగించకపోవడంతో బియ్యాన్ని ఎఫ్‌సీఐకి విక్రయించనున్నారు. అయితే పూర్తిస్థాయిలో రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలకు పోను.. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిగిలే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మద్దతు ధర పెరగడంతో..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశారు. 2017–18లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. కేవలం 39,360 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాది గ్రేడ్–‘ఏ’ ధాన్యం క్వింటా ధర రూ.1,590 ఉండగా.. కామన్‌కు రూ.1,550 నిర్ణయించారు. ఈ ఏడాది గ్రేడ్–‘ఏ’ క్వింటా ధాన్యం రూ.1,770, కామన్ రకం రూ.1,750 నిర్ణయించారు. దీంతోపాటు పంట దిగుబడి కూడా కొద్దిమేర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు.
అవగాహనతోనే సాధ్యం..
ఈ ఏడాది లక్ష్యానికి మించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో కంటే మద్దతు ధర పెరగడంతోపాటు నీటి సౌకర్యంతో ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. దీంతో అనుకున్న లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేయగలిగాం. క్షేత్రస్థాయి అధికారులు కూడా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment