సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతులకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (పీఏసీఎస్) సంఘాల వారికి రావాల్సిన కమీషన్ నిలిచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే కమీషన్‌తో తమ తలరాత మార్చుకుందామనుకుంటే..సీజన్లవారీగా శ్రమించిన వీరికి మాత్రం డబ్బులు ముట్టక తిప్పలు మామూలే అన్నట్లుగా పరిస్థితి మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతో కష్టపడి ధాన్యం సేకరించి, కాంటాలు, తరలింపు, రికార్డుల నిర్వహణ ప్రక్రియ చేసిన వీరికి ఆర్థిక చేయూత లేక అవస్థలు పడుతున్నారు.
మూడు వ్యవసాయ సీజన్లకు సంబంధించిన సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఎంతో కష్టపడ్డామని, రైతులను చైతన్యవంతం చేసి ధాన్యం తీసుకొచ్చేలా చూశామని, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే అధిక సమయం వెచ్చించి..ధాన్యం సేకరణను విజయవంతం చేశామని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల బాధ్యులు, సొసైటీల వారు డబ్బులు అందక తమ విధిరాత మారట్లేదని ఆవేదనగా చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 2017–18లో ఖరీఫ్, రబీతోపాటు 2018–19 ఖరీఫ్‌లో వడ్ల కొనుగోళ్లు నిర్వహించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నందుకు క్వింటాకు రూ.32, సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.31.25 కమీషన్ కింద చెల్లించాలి. మొత్తం మూడు సీజన్‌లకు సంబంధించిన కమీషన్ రూ.10,82,53,703 రావాల్సి ఉంది.
2017–18 నుంచి 2018–19 సీజన్లలో ఇలా..
2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి రూ.5,67,37,911 కమీషన్ రావాల్సి ఉంది. 2017–18 ఖరీఫ్‌లో ఐకేసీ, పీఏసీఎస్ సిబ్బంది కలిపి 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు 4,296 మంది రైతుల వద్ద నుంచి 39,360మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు నగదు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.1,02,33,088, కామన్ రకానికి సంబంధించి రూ.23,06,963 ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి కమీషన్ చెల్లించాలని తేలింది. మొత్తం 1,25,40,051 కమీషన్ రావాలి. రబీ సీజన్‌కు సంబంధించి 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాల్లో 16,566 మంది రైతుల నుంచి 1,38,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,37,12,204, కామన్ రకానికి సంబంధించి రూ.4,85,656 చొప్పున మొత్తం రూ.4,41,97,860 కమీషన్ రూపంలో రావాల్సి ఉంది. 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కూడా పీఏసీఎస్, ఐకేపీ సిబ్బందికి కమీషన్ పెండింగ్‌లో ఉంది. ఈ ఖరీఫ్‌లో 86 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి..20,327 మంది రైతుల నుంచి 1,61,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,24,70,742, కామన్ రకానికి సంబంధించి రూ.90,45,050 మొత్తం కలిపి రూ.5,15,15,792 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 98 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 76 కేంద్రాలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. తమకు పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను చెల్లించకుండానే మళ్లీ పని చేయించుకుంటున్నారని వీరంతా బాధ పడుతున్నారు. ఇకనైనా నిధులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ చెల్లింపు అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. మాకు ఫండ్స్ రాగానే నిర్వాహకులకు అందిస్తాం. ఎవరూ కంగారు పడొద్దని కోరుతున్నాం. – వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, ఖమ్మం
కష్టపడ్డందుకు లాభమేది?
కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీవాణి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులమంతా కలిసి ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం 10,551 క్వింటాల వడ్లు కొన్నాం. క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వాలి. ఇలా మాకు రూ.3.50లక్షల కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇయ్యలే. మళ్లీ కొత్తగా రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇలా ఆపుజేస్తే.. మేం కష్టపడ్డందుకు ఏం లాభం ఉంటదండి. అధికారులు మా గోస తీర్చాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment