IKP centers
-
కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న మూడు చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీకి పోయాక కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. నియంత్రిత సాగు విషయంలో కేసీఆర్ మొదటి నుంచి మొండిగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సన్నాలు వేయాలని చెప్పారని, దాని వల్ల పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోయారన్నారు. సన్నాలు పండించిన రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి: పీసీసీ చీఫ్ ఎంపికపై తొందరపాటు నిర్ణయం వద్దు..) జగ్గారెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారు. రూ.7500 కోట్లు నష్టమంటున్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. రైతుల దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొని కోళ్ల రైతులకు ఇచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరలు, ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతో కాలంగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్‌ను లేకుండా చేయాలని చూస్తున్నారు. 2017లో రెవెన్యూ రికార్డుల పరిశీలన చేశారు. కానీ ఇంకా 12 లక్షల మందికి పాస్ పుస్తకాలు అందలేదు" అని పేర్కొన్నారు. (చదవండి: ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి ) "ఢిల్లీలో మూడు రోజులు ఉన్న కేసీఆర్ అక్కడ తీవ్రమైన చలిలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు? రాష్ట్రంలో శాంతి భద్రతల బాగున్నాయని చెవుతున్న కేసీఆర్ అమిత్ షా ను ఎందుకు కలిశారు? ఢిల్లీ నుంచి రాగానే 13 రోజుల పాటు ఫామ్ హౌస్‌లో గడిపి వచ్చి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం అనడానికి కారణం ఏంటో రైతులు ఆలోచించుకోవాలి. బీజేపీ, టీఆర్ఎస్లు రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. రైతుల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ ఎల్లపుడు అండగా ఉంటుంది" అని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు. -
‘ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ కష్టాలు’
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవైపు తెలంగాణలో అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాలపాలవుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాటం సిగ్గుచేటుని అన్నారు. సోమవారం ఎంపీ మాట్లాడుతూ.. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలల పంటను నీటిపాలు చేశారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని, వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. (‘లూడో’లొ ఓడించిందని భార్యను.. ) 15 రోజులుగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడని, ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చినందుకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరు, నాంపల్లి, పోచంపల్లి, చింతపల్లి, పలు మండలాల్లో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాన్వాయిలతో ప్రచారం చేయటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని విమర్శించారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం ) టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం తప్ప సేవ చేసే తత్వం లేదని, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి సంబరాలు జరుపుకోవడం విడ్డురంగా ఉందన్నారు. జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. బత్తాయి కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతు దగ్గర కూడా బత్తాయిలను కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదవాళ్లకు పంచాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్రాల ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా పండ్లను కొనుగోలు చేయటానికి ఎవరు ముందుకు రావడం లేదని, కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల మామిడి,నిమ్మ,బత్తాయి పంట ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, మే 7 లాక్ డౌన్ తరువాత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. (సామాజిక దూరం.. స్టంట్ అదిరింది గురూ! ) -
‘నిధి’వంచితులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతులకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (పీఏసీఎస్) సంఘాల వారికి రావాల్సిన కమీషన్ నిలిచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే కమీషన్‌తో తమ తలరాత మార్చుకుందామనుకుంటే..సీజన్లవారీగా శ్రమించిన వీరికి మాత్రం డబ్బులు ముట్టక తిప్పలు మామూలే అన్నట్లుగా పరిస్థితి మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంతో కష్టపడి ధాన్యం సేకరించి, కాంటాలు, తరలింపు, రికార్డుల నిర్వహణ ప్రక్రియ చేసిన వీరికి ఆర్థిక చేయూత లేక అవస్థలు పడుతున్నారు. మూడు వ్యవసాయ సీజన్లకు సంబంధించిన సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఎంతో కష్టపడ్డామని, రైతులను చైతన్యవంతం చేసి ధాన్యం తీసుకొచ్చేలా చూశామని, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే అధిక సమయం వెచ్చించి..ధాన్యం సేకరణను విజయవంతం చేశామని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల బాధ్యులు, సొసైటీల వారు డబ్బులు అందక తమ విధిరాత మారట్లేదని ఆవేదనగా చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 2017–18లో ఖరీఫ్, రబీతోపాటు 2018–19 ఖరీఫ్‌లో వడ్ల కొనుగోళ్లు నిర్వహించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నందుకు క్వింటాకు రూ.32, సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.31.25 కమీషన్ కింద చెల్లించాలి. మొత్తం మూడు సీజన్లకు సంబంధించిన కమీషన్ రూ.10,82,53,703 రావాల్సి ఉంది. 2017–18 నుంచి 2018–19 సీజన్లలో ఇలా.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్లకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి రూ.5,67,37,911 కమీషన్ రావాల్సి ఉంది. 2017–18 ఖరీఫ్‌లో ఐకేసీ, పీఏసీఎస్ సిబ్బంది కలిపి 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు 4,296 మంది రైతుల వద్ద నుంచి 39,360మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు నగదు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.1,02,33,088, కామన్ రకానికి సంబంధించి రూ.23,06,963 ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి కమీషన్ చెల్లించాలని తేలింది. మొత్తం 1,25,40,051 కమీషన్ రావాలి. రబీ సీజన్‌కు సంబంధించి 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 16,566 మంది రైతుల నుంచి 1,38,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,37,12,204, కామన్ రకానికి సంబంధించి రూ.4,85,656 చొప్పున మొత్తం రూ.4,41,97,860 కమీషన్ రూపంలో రావాల్సి ఉంది. 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కూడా పీఏసీఎస్, ఐకేపీ సిబ్బందికి కమీషన్ పెండింగ్‌లో ఉంది. ఈ ఖరీఫ్‌లో 86 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి..20,327 మంది రైతుల నుంచి 1,61,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,24,70,742, కామన్ రకానికి సంబంధించి రూ.90,45,050 మొత్తం కలిపి రూ.5,15,15,792 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 98 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 76 కేంద్రాలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. తమకు పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను చెల్లించకుండానే మళ్లీ పని చేయించుకుంటున్నారని వీరంతా బాధ పడుతున్నారు. ఇకనైనా నిధులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ చెల్లింపు అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. మాకు ఫండ్స్ రాగానే నిర్వాహకులకు అందిస్తాం. ఎవరూ కంగారు పడొద్దని కోరుతున్నాం. – వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, ఖమ్మం కష్టపడ్డందుకు లాభమేది? కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీవాణి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులమంతా కలిసి ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం 10,551 క్వింటాల వడ్లు కొన్నాం. క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వాలి. ఇలా మాకు రూ.3.50లక్షల కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇయ్యలే. మళ్లీ కొత్తగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న డబ్బులు ఇలా ఆపుజేస్తే.. మేం కష్టపడ్డందుకు ఏం లాభం ఉంటదండి. అధికారులు మా గోస తీర్చాలని కోరుతున్నాం. -
మరాడిస్తారో.. మాయం చేస్తారో?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: 2017–18 సీజన్లో అనుకూలం కాదని తెలిసినా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లెలోని మెస్సర్స్ వాణి ఇండస్ట్రీస్‌కు పౌరసరఫరాల శాఖ 2,619 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. 1,781 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉండగా గడువు తీరినా ప్రభుత్వానికి చేరలేదు. ఈ వ్యవహారం మీడియాకెక్కడంతో పౌరసరఫరాల శాఖ ఒత్తిడి మేరకు ఇతర మిల్లుల్లో మరాడించి మమ అనిపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో ఓంసాయి ఇండస్ట్రీస్‌కు అదే ఏడాది కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 2010–11 నుంచి 2014–15 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.134 కోట్ల విలువ చేసే సీఎంఆర్ బియ్యాన్ని 115 మంది మిల్లర్లు ఎగవేశారు. ఈ జాబితాలో కమలాపూర్ మిల్లు కూడా ఉండగా.. అదే మిల్లుకు మళ్లీ ధాన్యం ఇవ్వడం వివాదం కాగా.. అప్పటి ఫుడ్ ఇన్స్పెక్టర్పై చర్యలతో మూసేశారు. ఇలా అన్నదాతలకు మేలు చేయడానికి లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతుల నుంచి ధాన్యం సేకరించి కస్టమ్ మిల్లింగ్ «రైస్ (సీఎంఆర్) కింద ఇస్తుండగా.. కొందరు మిల్లర్లు సర్కారు సొమ్ముతో వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చేందుకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి మిల్లర్లకు కేటాయిస్తున్నా పక్కదారి పడుతోంది. వచ్చిన ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్నిసరఫరా చేయాల్సిన మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలాచోట్ల కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి బదులు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ప్రభుత్వానికి చెల్లించి.. సీఎంఆర్‌ను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలిలకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో సీఎంఆర్ సేకరణపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నా.. అధికారుల నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 51.67 శాతం మాత్రమే బియ్యాన్ని రాబట్టారు. ఫిబ్రవరి 2 నాటికి నూటికి నూరుశాతం సీఎంఆర్ చెల్లించడం ఎలా సాధ్యమన్న చర్చ జరుగుతోంది. ఖరీఫ్ సీఎంఆర్ కేటాయింపు లెక్క ఇదీ... 2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబం«ధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,46,298.169 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద సుమారు వందకు పైగా రైసుమిల్లులకు ఇచ్చారు. ఇందులో జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం 2,79,665.129 మెట్రిక్ టన్నులు కాగా, 66,633.040 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇతర జిల్లాల నుంచి సేకరించారు. రైసుమిల్లర్లకు సీఎంఆర్ కింద ఇచ్చిన 3,46,298.169 మెట్రిక్ టన్నుల ధాన్యం పై ప్రతి క్వింటా ధాన్యానికి 68 కిలోల బియ్యం చొప్పన ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఈ లెక్కన మరాడించి 2,79,665.129 మెట్రిక్ టన్నుల బియాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖ (సీఎస్సీ)కి అప్పగించాల్సి ఉంది. వాస్తవానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీఎంఆర్ ధాన్యం కేటాయించిన 15 రోజుల్లోనే బియ్యం చెల్లించాల్సి ఉండగా, ఫిబ్రవరి 2 ఆఖరు తేదీగా మిల్లర్లకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు రైసుమిల్లర్ల నుంచి 1,19,895.231 (51.67 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించే విషయంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు (టాస్క్‌ఫోర్స్) మొదలు తహసీల్దారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి వరకు మిల్లర్లు పైరవీలు చేస్తున్నారు. పైరవీలను ‘మామూలు’గా తీసుకునే కొందరు అధికారులు చాలా మందికి నిబంధనలు తుంగలో తొక్కి రైసుమిల్లర్లకు ధాన్యం కేటాయిస్తుండగా.. బియ్యం రాబట్టంలో ఇబ్బందులు తప్పడం లేదు. 70 శాతం మంది మిల్లర్లు నిజాయతీగా బియ్యం చెల్లిస్తున్నా.. 30 శాతం మంది అత్యధికంగా బకాయి పడుతుండటం వివాదాస్పదం అవుతోంది. సివిల్ సప్లైలో లొసుగులే మిల్లర్లకు వరం... రాష్ట్రంలో ప్రధాన పంట వరి. ధాన్యం పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం సేకరిస్తుంది. ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తాయి. అనంతరం ఈ ధాన్యాన్ని రైసుమిల్లర్లకు కేటాయిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇస్తారు. మిల్లరుకు ఒక క్వింటాల్ ధాన్యం ఇస్తే మిల్లింగ్ చేసి 67–68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుంది. ఇలా వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వం ఎఫ్‌సీఐకి విక్రయించడం లేదా రేషన్ షాపుల ద్వారా పేదలకు సబ్సిడీకి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ నిబంధనలను అసరాగా చేసుకుని స్వలాభం కోసమే సీఎంఆర్ అందించడంలో కొందరు రైసుమిల్లర్లు ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది రబీ 2017–18లోగాను గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న 122 రైసుమిల్లులకు అధికారులు సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించారు. కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన 22 మంది మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించుకునేందుకే తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపించా యి. కొందరు ఇతర చోట్ల కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు సరఫరా చేసిన బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేసి వాటినే తిరిగి ఎఫ్‌సీఐ కి అప్పగిస్తున్నారనే ఆరోపణలపై విచారణలు కూడా జరిగాయి. తాజాగా ఈ సీజన్లో కేటాయించిన ధాన్యంపై ముందుగానే అధికారులు ఆంక్షలు విధిం చినా కొందరు మిల్లర్లు పాత పద్ధతులను వీడటం లేదు. జాయింట్ కలెక్టర్ సీఎంఆర్‌పై ఇటీవలే సమీక్ష నిర్వహించి అధికారులు, రైసుమిల్లర్లను హెచ్చరించారు. అయినా ఆశించిన మేరకు సీఎంఆర్‌లో వేగం లేకపోగా, ఫిబ్రవరి 2 నాటికి నూరు శాతం లక్ష్యం కష్టంగా కనిపిస్తుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. -
బ్రాండ్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : ‘ఏ రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్ చేస్తే ధర పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతీది కల్తీ అవుతోంది. మార్కెట్లో ఒక బ్రాండ్ పేరుతో మన ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను విక్రయించాలి. ప్రభుత్వ పరంగా తయారైన వస్తువులని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించాలి. మన ఆలోచనలకు కార్యరూపమిచ్చి అమలు చేయాలి. ఏ ప్రాంతంలో ఎన్ని, ఏ రకమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలో నిర్ణయించాలి. మన రాష్ట్ర అవసరాలకు సరిపోగా.. మిగిలిన ఉత్పత్తులను పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలి. ఈ ప్రక్రియలో ఐకేపీ–మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు అధ్యయనం చేయాలి. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్. ఏ రాష్ట్రంలో ఏ పంట పండదో విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ వాటిని పండించి, వాటితో ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను తయారు చేయాలి. దేశ, విదేశాల్లో అత్యుత్తమ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే అంశంపై అధ్యయనం చేయాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధిపై సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాటు పలువురిని భాగస్వాములను చేయాలన్నారు. తొలుత ఆరేడు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. తర్వాత భారీ స్థాయిలో విస్తరించవచ్చన్నారు. అధికారులు వివిధ స్థాయిల్లో మేధోమథన కార్యక్రమాలను, వర్క్ షాపులను నిర్వహించాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. 4 లక్షలకు పైగా ఉన్న ఐకేపీ మహిళా సంఘాల్లో ఉన్న 45 లక్షల మంది సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు అందుబాటులో ఉంచాలన్నారు. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు. పంట మార్పిడిపై అవగాహన రావాలి.. ‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలియాలి. మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణంగా పరిశోధనలు జరగాలి. అంతర్జాతీయ విపణిలో మన దేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించాలి. ప్రతి గ్రామం అక్కడి ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలి. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు సరఫరా చేయాలి’అని సీఎం అన్నారు. ‘రైతులందరూ ఒకే రకమైన పంటలేస్తే సమస్యలొస్తాయి. వారికి పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్ధ అలవాట్లలో కొంత వరకు మార్పు రావాలి. ముల్కనూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడంతో గొప్ప ఫలితాలొచ్చాయి. ఇలా చేస్తే లాభం కలుగుతుందని అధికారులు నమ్మకం కలిగిస్తే బ్రహ్మాండమైన ఫలితాలొస్తాయి. రాష్ట్రంలో ఈ అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించాలని ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాటిని ఆహ్వానించాను. త్వరలో ఆయన రాష్ట్రానికి వస్తారు’అని కేసీఆర్ తెలిపారు. పంట కాలనీలుగా విభజించాలి... ‘రాష్ట్రాన్ని పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్ ఉండాలి. రాష్ట్ర ఆహార అవసరాలను తెసుకొని, ఆ మేరకు పంటలు వేసే దిశగా రైతుల్లో అవగాహన పెంచాలి. రైతులపై ఒకేసారి అభిప్రాయాలను రుద్దకుండా క్రమపద్ధతిలో జరగాలి. గ్రామీణ, పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులుండాలి. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర వంటి వాటిని దిగుమతి చేసుకోవడం దురదృష్టకరం. నగరాల, పట్టణాల సమీపంలో కూరగాయల ఉత్పత్తి జరగాలి. వచ్చే వానాకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. వచ్చే రెండేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తై కోటి ఎకరాలకుపైగా సాగు నీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటలకు సంబంధించి చాలా విషయాల్లో కచ్చితమైన గణాంకాలు లేక సరైన నిర్ణయానికి రావడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగేళ్లలో సగటున 17.17 శాతం వృద్ధిరేటును సాధించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్ధిరేటు వుందని, స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాలుగా రాష్ట్రాభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. మూస పద్ధతిలో ఆలోచించకుండా కొత్త ఒరవడికి సిద్ధం కావాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. తూకంవేసిన బస్తాలతోపాటు రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు నీటమునిగాయి. ధాన్యం కుప్పలు పక్కపక్కనే ఉండడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక అక్కడి నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలు ఉన్న భూమి తడిగా మారడంతో అందులోకి లారీలు రాలేకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం 4వేలు క్వింటాళ్లు ఉండగా.. నేరుగా రైస్‌మిల్లులకు తరలించారు. ధాన్యాన్ని ఆరబెడితే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆ పనిలో పడ్డారు. సగం ధాన్యం కేంద్రాల్లోనే ! జిల్లాలోని 146 ఐకేపీ కేంద్రాల్లో, 144 సింగిల్‌విండో కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాల ద్వారా 7.87లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 7లక్షలు క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. సింగిల్‌విండో కేంద్రాల ద్వారా 8లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 6 లక్షలు క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెస్తున్న ధాన్యానికి సరిపోయే స్థాయిలో కవర్లు లేకపోవడంతో వర్షం పడిన ప్రతీసారి తడిసిపోతుంది. హమాలీలతోనే అసలు సమస్య మహారాష్ట్ర, బిహార్ నుంచి వేల సంఖ్యలో హమాలీలు వచ్చినప్పటికీ సరిపోవడం లేదు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పగటిపూట 43 డిగ్రీలు వరకు ఉంటుండడంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడం లేదు. దీంతో తూకం, లోడింగ్ పూర్తవడం లేదు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెట్పల్లి, చల్గల్లో తడిసిన ధాన్యాన్ని జాయింట్ కలెక్టర్ రాజేశంతోపాటు ఐకేపీ, సింగిల్‌విండో అధికారులు పరిశీలించారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్‌కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కథలాపూర్/మెట్పల్లి/ఇబ్రహీంపట్నం : మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ రాజేశం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం రావడంతో కొనుగోళ్లలో జాప్యమవుతుందన్నారు. కేంద్రాల్లో బార్దాన్లు, లారీల కొరత లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనుగోలు చేసిన ధాన్యం 5,500 క్వింటాళ్లు, కొనుగోలు చేయని ధాన్యం 10 వేలు క్వింటాళ్లు నిల్వ ఉంది. మార్కెట్ చైర్మన్ బాల్క సురేష్, సింగిల్‌విండో చైర్మన్ మారు మురళీధర్‌రెడ్డి, తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ ధాన్యాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 500 బస్తాలు స్వల్పంగా తడిసిపోయాయి. -
రబీ కొనుగోళ్లకు 161 కేంద్రాలు
సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం 161 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం డీఆర్డీవో, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను మార్చి మూడో వారంలో ప్రారంభించాలని, అందుకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజే ట్యాబ్‌ల్లో నమోదు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీటివసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా, హమాలీల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పుటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్డీవో బి.రవీందర్, డీఎస్వో పద్మ, జిల్లా వ్యవసాయాధికారి ఆర్.అనిల్‌కుమార్, మార్కెటింగ్‌శాఖ జిల్లా మేనేజర్ షాహబొద్దీన్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, వ్యవసాయాధికారి కె.తిరుపతి, ఐకేపీ ఏపీఎం పర్శరాం తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు నిబంధనాలు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనేవారు లేక ఇప్పటికే దిక్కులు చూస్తున్న రైతులకు ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలతో తిప్పలు తప్పేలాలేవు. ఐకేపీ కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు) పరిశీలించి ఓకే అంటేనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొనుగోళ్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వలిగొండ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఈ ఏడాది గతంలో లేని కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ధాన్యం కొనేవారు లేక దిక్కులు చూస్తున్న రైతులకు కొత్త నిబంధనలతో తిప్పలు తప్పేలా లేవు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా సహకార శాఖ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అని పేర్కొంటూ ఈ నెల 16న జీఓ నంబర్ 1719ను జారీ చేశారు. ఈ జీఓ ప్రకారం వ్యవసాయశాఖకు సం బంధించిన విస్తరణ అధికారులు(ఏఈఓ) ధాన్యం పరిశీలించి కొనుగోలు చేయవచ్చునని ధ్రువీకరిస్తే తప్ప ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. కానీ కొనుగోలు కేంద్రంలోని సంబంధిత అధికారులు ధాన్యం పరిశీలించి కొనుగోలు చేసేవారు. కొనుగోళ్లు మరింత ఆలస్యం.. మారిన నిబంధనలతో కొనుగోళ్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కని పిస్తోంది. ఏఈఓలు మండలానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నా రు. వీరు ప్రతి రోజు మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం పరిశీలించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏఈఓలు వచ్చి ధాన్యం పరిశీలించే వరకు ఆగాల్సి వస్తే రోజుకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేయగలుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.