బ్రాండ్‌ తెలంగాణ | KCR Focus On Expansion Of Food Processing Unit In Telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 1 2019 4:11 AM | Last Updated on Tue, Jan 1 2019 5:29 AM

KCR Focus On Expansion Of Food Processing Unit In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఏ రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్‌ చేస్తే ధర పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతీది కల్తీ అవుతోంది. మార్కెట్లో ఒక బ్రాండ్‌ పేరుతో మన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను విక్రయించాలి. ప్రభుత్వ పరంగా తయారైన వస్తువులని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. మన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రారంభించాలి. మన ఆలోచనలకు కార్యరూపమిచ్చి అమలు చేయాలి. ఏ ప్రాంతంలో ఎన్ని, ఏ రకమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండాలో నిర్ణయించాలి. మన రాష్ట్ర అవసరాలకు సరిపోగా.. మిగిలిన ఉత్పత్తులను పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలి.

ఈ ప్రక్రియలో ఐకేపీ–మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు అధ్యయనం చేయాలి. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్‌. ఏ రాష్ట్రంలో ఏ పంట పండదో విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ వాటిని పండించి, వాటితో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను తయారు చేయాలి. దేశ, విదేశాల్లో అత్యుత్తమ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే అంశంపై అధ్యయనం చేయాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు.

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ అభివృద్ధిపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాటు పలువురిని భాగస్వాములను చేయాలన్నారు. తొలుత ఆరేడు మండలాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాలన్నారు. తర్వాత భారీ స్థాయిలో విస్తరించవచ్చన్నారు. అధికారులు వివిధ స్థాయిల్లో మేధోమథన కార్యక్రమాలను, వర్క్‌ షాపులను నిర్వహించాలని సూచించారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. 4 లక్షలకు పైగా ఉన్న ఐకేపీ మహిళా సంఘాల్లో ఉన్న 45 లక్షల మంది సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు అందుబాటులో ఉంచాలన్నారు. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు. 

పంట మార్పిడిపై అవగాహన రావాలి.. 
‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలియాలి. మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణంగా పరిశోధనలు జరగాలి. అంతర్జాతీయ విపణిలో మన దేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోలేని పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించాలి. ప్రతి గ్రామం అక్కడి ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలి. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు సరఫరా చేయాలి’అని సీఎం అన్నారు. ‘రైతులందరూ ఒకే రకమైన పంటలేస్తే సమస్యలొస్తాయి.

వారికి పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్ధ అలవాట్లలో కొంత వరకు మార్పు రావాలి. ముల్కనూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడంతో గొప్ప ఫలితాలొచ్చాయి. ఇలా చేస్తే లాభం కలుగుతుందని అధికారులు నమ్మకం కలిగిస్తే బ్రహ్మాండమైన ఫలితాలొస్తాయి. రాష్ట్రంలో ఈ అంశాలపై వర్క్‌షాప్‌ నిర్వహించాలని ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్‌ గులాటిని ఆహ్వానించాను. త్వరలో ఆయన రాష్ట్రానికి వస్తారు’అని కేసీఆర్‌ తెలిపారు.  

పంట కాలనీలుగా విభజించాలి... 
‘రాష్ట్రాన్ని పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్‌ ఉండాలి. రాష్ట్ర ఆహార అవసరాలను తెసుకొని, ఆ మేరకు పంటలు వేసే దిశగా రైతుల్లో అవగాహన పెంచాలి. రైతులపై ఒకేసారి అభిప్రాయాలను రుద్దకుండా క్రమపద్ధతిలో జరగాలి. గ్రామీణ, పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తులుండాలి. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర వంటి వాటిని దిగుమతి చేసుకోవడం దురదృష్టకరం. నగరాల, పట్టణాల సమీపంలో కూరగాయల ఉత్పత్తి జరగాలి. వచ్చే వానాకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. వచ్చే రెండేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తై కోటి ఎకరాలకుపైగా సాగు నీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి.

ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటలకు సంబంధించి చాలా విషయాల్లో కచ్చితమైన గణాంకాలు లేక సరైన నిర్ణయానికి రావడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగేళ్లలో సగటున 17.17 శాతం వృద్ధిరేటును సాధించామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్ధిరేటు వుందని, స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్నీ విధాలుగా రాష్ట్రాభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. మూస పద్ధతిలో ఆలోచించకుండా కొత్త ఒరవడికి సిద్ధం కావాలన్నారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్‌ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్‌ రావు, భూపాల్‌ రెడ్డి, స్మితా సభర్వాల్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్‌ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్‌ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement