అటు పని..ఇటు మనీ! | Siddipet Mittapally Dwcra Members Food Processing Business | Sakshi
Sakshi News home page

అటు పని..ఇటు మనీ!

Published Wed, Jan 20 2021 8:17 AM | Last Updated on Wed, Jan 20 2021 10:37 AM

Siddipet Mittapally Dwcra Members Food Processing Business - Sakshi

సాక్షి, సిద్దిపేట: ఒక ఐడియా.. రైతులకు మనీ, మహిళలకు పని కల్పించింది. పంటను అమ్ముకోవడానికి పడిన కష్టం.. డబ్బులు చేతికొచ్చే సమయంలో కొర్రీలను చూసిన సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి రైతుల కుటుంబాల్లోని మహిళలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆలోచనకు వచ్చారు. పప్పుమిల్లులు కొనుగోలు చేసి ముందుగా తమ ఇళ్లలో ఉన్న కందులను పప్పుగా మార్చి విక్రయాలు మొదలుపెట్టారు. మిట్టపల్లి ఇప్పుడు రెడ్‌గ్రామ్‌కు చిరునామాగా మారింది. 

ఆలోచన పుట్టిందిలా..  
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని ఓ రోజు మహిళాసంఘాల సభ్యులు మిట్టపల్లి గ్రామపెద్దలను కోరారు. కందులు అమ్ముడు పోవట్లేదని, కావాలంటే వాటిని పప్పుగా మార్చి అమ్ముకోవాలని పలువురు రైతులు సూచించారు. ఈ సలహాలనే ఆచరణ రూపం దాల్చింది. వెంటనే మహిళా సంఘం సభ్యులు 20 మంది రూ.2 లక్షలు జమ చేశారు. సర్పంచ్‌ వంగ లక్ష్మి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లతో మాట్లాడి రూ.10 లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తం రూ.13 లక్షల్లో ముందుగా రూ.3 లక్షలు పెట్టి కందులను పప్పుగా మార్చే మిషన్లు, ప్యాకింగ్‌ కవర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బుతో గ్రామంలోని రైతుల వద్ద కందులను క్వింటాల్‌కు రూ.5,800 చెల్లించి కొనుగోలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కందులు కొనుగోలు చేయడం ప్రారంభించారు.

మంత్రి హరీశ్‌ మార్క్‌ఫెడ్‌ వారితో మాట్లాడి క్వింటాల్‌కు రూ.4,100 చొప్పున సబ్సిడీపై కందులు ఇప్పించారు. ఇలా గతేడాదిలో మొత్తం రూ.21 లక్షల విలువ చేసే 40 మెట్రిక్‌ టన్నుల కందులు కొనుగోలు చేశారు. ఈ కందులను మిల్లింగ్‌ చేయగా 28 టన్నుల పప్పు వచ్చింది. ఈ పప్పును ముందుగా కిలో రూ.80కి విక్రయించగా.. తర్వాత డిమాండ్‌ పెరగడంతో రూ.100కు పెంచారు. ఇలా మొత్తం రూ.26 లక్షల మేర డబ్బు వచ్చిందని మహిళలు తెలిపారు. ఈ ఏడాది 50 మెట్రిక్‌ టన్నుల కందులు అధికంగా కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

వీళ్ల పప్పులకు.. వాళ్ల చిరుధాన్యాలు 
మిట్లపల్లి శ్రీవల్లి మహిళా సమాఖ్య తయారు చేసిన పప్పులకు రోజు రోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. కల్తీ లేని పప్పు తక్కువ ధరకు అమ్మడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, నాచారం ప్రాంతాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి చిరుధాన్యాలు తెచ్చి సిద్దిపేటలో అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లాలో 17 వేల మహిళాసంఘాలు ఉండగా.. వాటిలో 1.8 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రతి ఒక్కరికీ నెలకు ఒక కిలో చొప్పున కంది పప్పు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నారు.

మెచ్చుకున్న సీఎం కేసీఆర్‌.. 
డిసెంబర్‌ 10న మిట్టపల్లిలో రైతు వేదిక సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మహిళలు కందులను పప్పుగా మార్చి అమ్మకాలు చేస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్‌ సీఎంకు తెలపగా వారిని మెచ్చుకున్నారు. కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులను పిలిచి రూ.3 కోట్లతో పప్పుతోపాటు పసుపు, కారం, వెల్లుల్లి మిశ్రమం, చిరుధాన్యాలు, నూనెల తయారీని ప్రోత్సహించాలని ఆదేశించారు.

చేతి నిండా పని దొరికింది 
‘మా గ్రామంలో వ్యవసాయం చేసుకుని బతికేవారు ఎక్కువ. కందులను పప్పుగా మార్చి అమ్మా లనే ఆలోచన కలిగింది. మంత్రి హరీశ్‌రావు సహకారంతో పనిమొదలు పెట్టాం. చేతి నిండా పని దొరికింది’. – లక్ష్మి, శ్రీవల్లి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు 

సమష్టిగా పని చేసుకుంటున్నారు 
‘రైతులు పండించిన కందులను మార్కెట్‌కు తీసుకెళ్లకుండా మా గ్రామంలోనే మహిళలు పప్పుగా తయారు చేసి అమ్ముతున్నారు. సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రాంతాల వారు కూడా ఈ పప్పులను కొంటున్నారు. మార్కెట్‌లో దొరికే పప్పుకన్నా రుచిగా ఉంటోంది.’ – వంగ లక్ష్మి, సర్పంచ్, మిట్టపల్లి 

మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది 
చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు ప్రోత్సాహమిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని మిట్టపల్లి మహిళలు రుజువు చేశారు. పొదుపు డబ్బులతో నా దగ్గరకు వచ్చినప్పుడే వారిలో పట్టు దల కనిపించింది. ఇలా ప్రతి సం ఘం స్వయం సమృద్ధి సాధించాలి.’ – హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement