మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
నంగునూరు(సిద్దిపేట): కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎప్పుడో తీర్మానం చేసి పంపితే ఇప్పటి వరకూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మరింత ఇబ్బందులు పెట్టేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే అడ్వాన్స్ చెల్లించాలని కొర్రీలు పెడుతూ సీఎం కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
బీజేపీ పాలనలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలని, కేంద్రం ఉచితాలు వద్దంటోందని, దేశానికి అన్నం పెట్టే రైతుకు సబ్సిడీలు ఇవ్వడం ఉచితాల కిందికి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం మంత్రి.. సిద్దిపేట జిల్లా పాలమాకులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరి నదికి చరిత్రలో కనీ, వినీ ఎరగని రీతిలో వరద వచ్చి తెలంగాణకు నష్టం జరిగితే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాధపడకుండా సంతోషంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని 21 పంపులకుగాను రెండు పంపులకు వరద వల్ల నష్టం జరిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత సంవత్సరం మండుటెండలో కాళేశ్వరం నీటితో మత్తడి దూకిన చెరువుల గురించి తెలుకోవాలని, ప్రస్తుతం రంగనాయకసాగర్ వద్ద నడుస్తున్న పంపులు చూసి మాట్లాడాలని అన్నారు. నెల రోజుల్లో కాళేశ్వరం మోటార్లు మరమ్మతు చేసి నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వ్యవసాయ బావులవద్ద మోటార్లకు మీటర్లు పెడితే రూ రూ.6,500 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆశ చూపితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ వినకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment