సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న మూడు చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీకి పోయాక కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. నియంత్రిత సాగు విషయంలో కేసీఆర్ మొదటి నుంచి మొండిగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సన్నాలు వేయాలని చెప్పారని, దాని వల్ల పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోయారన్నారు. సన్నాలు పండించిన రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. (చదవండి: పీసీసీ చీఫ్ ఎంపికపై తొందరపాటు నిర్ణయం వద్దు..)
జగ్గారెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామంటున్నారు. రూ.7500 కోట్లు నష్టమంటున్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. రైతుల దగ్గర 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొని కోళ్ల రైతులకు ఇచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరలు, ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతో కాలంగా ఉన్న ఫుడ్ కార్పొరేషన్‌ను లేకుండా చేయాలని చూస్తున్నారు. 2017లో రెవెన్యూ రికార్డుల పరిశీలన చేశారు. కానీ ఇంకా 12 లక్షల మందికి పాస్ పుస్తకాలు అందలేదు" అని పేర్కొన్నారు. (చదవండి: ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి )
"ఢిల్లీలో మూడు రోజులు ఉన్న కేసీఆర్ అక్కడ తీవ్రమైన చలిలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదు? రాష్ట్రంలో శాంతి భద్రతల బాగున్నాయని చెవుతున్న కేసీఆర్ అమిత్ షా ను ఎందుకు కలిశారు? ఢిల్లీ నుంచి రాగానే 13 రోజుల పాటు ఫామ్ హౌస్‌లో గడిపి వచ్చి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం అనడానికి కారణం ఏంటో రైతులు ఆలోచించుకోవాలి. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. రైతుల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ ఎల్లపుడు అండగా ఉంటుంది" అని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment