సాక్షిప్రతినిధి, కరీంనగర్: 2017–18 సీజన్‌లో అనుకూలం కాదని తెలిసినా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లెలోని మెస్సర్స్ వాణి ఇండస్ట్రీస్‌కు పౌరసరఫరాల శాఖ 2,619 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వడం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. 1,781 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉండగా గడువు తీరినా ప్రభుత్వానికి చేరలేదు. ఈ వ్యవహారం మీడియాకెక్కడంతో పౌరసరఫరాల శాఖ ఒత్తిడి మేరకు ఇతర మిల్లుల్లో మరాడించి మమ అనిపించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో ఓంసాయి ఇండస్ట్రీస్‌కు అదే ఏడాది కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 2010–11 నుంచి 2014–15 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.134 కోట్ల విలువ చేసే సీఎంఆర్ బియ్యాన్ని 115 మంది మిల్లర్లు ఎగవేశారు. ఈ జాబితాలో కమలాపూర్ మిల్లు కూడా ఉండగా.. అదే మిల్లుకు మళ్లీ ధాన్యం ఇవ్వడం వివాదం కాగా.. అప్పటి ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌పై చర్యలతో మూసేశారు.
ఇలా అన్నదాతలకు మేలు చేయడానికి లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతుల నుంచి ధాన్యం సేకరించి కస్టమ్ మిల్లింగ్ «రైస్ (సీఎంఆర్) కింద ఇస్తుండగా.. కొందరు మిల్లర్లు సర్కారు సొమ్ముతో వ్యాపారం చేస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చేందుకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి మిల్లర్లకు కేటాయిస్తున్నా పక్కదారి పడుతోంది. వచ్చిన ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్నిసరఫరా చేయాల్సిన మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలాచోట్ల కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి బదులు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ప్రభుత్వానికి చెల్లించి.. సీఎంఆర్‌ను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలిలకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో సీఎంఆర్ సేకరణపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నా.. అధికారుల నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 51.67 శాతం మాత్రమే బియ్యాన్ని రాబట్టారు. ఫిబ్రవరి 2 నాటికి నూటికి నూరుశాతం సీఎంఆర్ చెల్లించడం ఎలా సాధ్యమన్న చర్చ జరుగుతోంది.
ఖరీఫ్ సీఎంఆర్ కేటాయింపు లెక్క ఇదీ...
2018–19 ఖరీఫ్ సీజన్‌కు సంబం«ధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,46,298.169 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద సుమారు వందకు పైగా రైసుమిల్లులకు ఇచ్చారు. ఇందులో జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం 2,79,665.129 మెట్రిక్ టన్నులు కాగా, 66,633.040 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇతర జిల్లాల నుంచి సేకరించారు. రైసుమిల్లర్లకు సీఎంఆర్ కింద ఇచ్చిన 3,46,298.169 మెట్రిక్ టన్నుల ధాన్యం పై ప్రతి క్వింటా ధాన్యానికి 68 కిలోల బియ్యం చొప్పన ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఈ లెక్కన మరాడించి 2,79,665.129 మెట్రిక్ టన్నుల బియాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), పౌరసరఫరాల శాఖ (సీఎస్‌సీ)కి అప్పగించాల్సి ఉంది.
వాస్తవానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీఎంఆర్ ధాన్యం కేటాయించిన 15 రోజుల్లోనే బియ్యం చెల్లించాల్సి ఉండగా, ఫిబ్రవరి 2 ఆఖరు తేదీగా మిల్లర్లకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు రైసుమిల్లర్ల నుంచి 1,19,895.231 (51.67 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించే విషయంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు (టాస్క్‌ఫోర్స్) మొదలు తహసీల్దారు, ఫుడ్ ఇన్స్‌పెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి వరకు మిల్లర్లు పైరవీలు చేస్తున్నారు. పైరవీలను ‘మామూలు’గా తీసుకునే కొందరు అధికారులు చాలా మందికి నిబంధనలు తుంగలో తొక్కి రైసుమిల్లర్లకు ధాన్యం కేటాయిస్తుండగా.. బియ్యం రాబట్టంలో ఇబ్బందులు తప్పడం లేదు. 70 శాతం మంది మిల్లర్లు నిజాయతీగా బియ్యం చెల్లిస్తున్నా.. 30 శాతం మంది అత్యధికంగా బకాయి పడుతుండటం వివాదాస్పదం అవుతోంది.
సివిల్ సప్లైలో లొసుగులే మిల్లర్లకు వరం...
రాష్ట్రంలో ప్రధాన పంట వరి. ధాన్యం పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం సేకరిస్తుంది. ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తాయి. అనంతరం ఈ ధాన్యాన్ని రైసుమిల్లర్లకు కేటాయిస్తారు. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇస్తారు. మిల్లరుకు ఒక క్వింటాల్ ధాన్యం ఇస్తే మిల్లింగ్ చేసి 67–68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం చార్జీలు చెల్లిస్తుంది. ఇలా వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వం ఎఫ్‌సీఐకి విక్రయించడం లేదా రేషన్ షాపుల ద్వారా పేదలకు సబ్సిడీకి సరఫరా చేయడం జరుగుతుంది.
ఈ నిబంధనలను అసరాగా చేసుకుని స్వలాభం కోసమే సీఎంఆర్ అందించడంలో కొందరు రైసుమిల్లర్లు ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది రబీ 2017–18లోగాను గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో జిల్లాలో ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని జిల్లావ్యాప్తంగా ఉన్న 122 రైసుమిల్లులకు అధికారులు సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించారు. కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన 22 మంది మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించుకునేందుకే తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపించా యి. కొందరు ఇతర చోట్ల కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు సరఫరా చేసిన బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేసి వాటినే తిరిగి ఎఫ్‌సీఐ కి అప్పగిస్తున్నారనే ఆరోపణలపై విచారణలు కూడా జరిగాయి.
తాజాగా ఈ సీజన్‌లో కేటాయించిన ధాన్యంపై ముందుగానే అధికారులు ఆంక్షలు విధిం చినా కొందరు మిల్లర్లు పాత పద్ధతులను వీడటం లేదు. జాయింట్ కలెక్టర్ సీఎంఆర్‌పై ఇటీవలే సమీక్ష నిర్వహించి అధికారులు, రైసుమిల్లర్లను హెచ్చరించారు. అయినా ఆశించిన మేరకు సీఎంఆర్‌లో వేగం లేకపోగా, ఫిబ్రవరి 2 నాటికి నూరు శాతం లక్ష్యం కష్టంగా కనిపిస్తుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment