
రూ.6 కోట్ల వ్యయంతోఈ చేపలు పెంచేందుకు నాలుగు జిల్లాల ఎంపిక
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి చెక్ పెట్టనున్న మత్స్యశాఖ
సాక్షి, హైదరాబాద్: చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళలాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని ఎక్కువగా పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. కరీంనగర్ కేంద్రంగా జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలిసి క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఇక్కడే కొరమీను చేపలను పెంచాలని భావిస్తోంది. మత్స్య శాఖ ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదిస్తే కొరమీనుకు మన దగ్గర కొదువే ఉండదు.
ధరల భారం లేకుండా
వాస్తవానికి తెలంగాణలో డిమాండ్‌కు సరిపోను కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతోపాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెచ్చి మన మార్కెట్లలో అమ్ముతుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ప్యాకింగ్, లోడింగ్, అన్‌లోడింగ్, సరిహద్దు ట్యాక్స్‌లతో పాటు కమీషన్లు కలిపి ఎక్కువ ధరకు వీటి విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తు తం చేపల మార్కెట్‌లో కొరమీను కిలో రూ.300–500 వరకు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కొరమీనులను చేప ప్రియులకు అందుబాటులోకి తెచ్చేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది.
నీటి వనరులే కీలకం
కొరమీను చేపల పెంపకానికి నీటి వనరులు ఎక్కువ అవసరం. ముఖ్యంగా నీటి చలన, ప్రవాహం ఉన్న వనరుల్లో ఇవి త్వరగా, బలిష్టంగా పెరుగుతాయి. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మత్స్యశాఖ కొరమీను చేపల పెంపకానికి ఎంపిక చేసింది. దీంతోపాటు ఉండ్రుమట్టి ఎక్కువగా ఉంటే, అందులో ఉన్న నాచు కారణంగా కొరమీనుచేపలు మరింత బలంగా పెరిగే అవకాశముంటుంది. అందుకే ఒండ్రుమట్టి లభ్యత ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో కొరమీను పెంచాలని నిర్ణయించింది.