సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు. దేశవిదేశాలకు సైతం ఆంకాపూర్ దేశీ చికెన్ పార్శిళ్లుగా వెళుతున్న విషయం తెలిసిందే. చికెన్‌తో పాటు పశువుల గడ్డిని పెంచేందుకు వినియోగించే ఎర్రజొన్న విత్తనానికి కూడా ఇటీవల ఈ ప్రాంతం ఫేమస్ అయింది.
అంకాపూర్‌లో ఎర్రజొన్న విత్తనాన్ని బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు సైతం ఎగుమతి చేసే కంపెనీలు 40 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఎర్రజొన్న విత్తనంతో పాటు మరో విషయంలోనూ అంకాపూర్ ప్రత్యేకతను సాధిస్తోంది. అదే అంకాపూర్ ‘మక్క వడలు’. ఈ ఒక్క ప్రాంతంలోనే ఆ మక్క వడలు లభ్యమవుతాయి.
ప్రతి ఏటా జూన్ నెల నుంచి జనవరి నెలలోపు ఈ వడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేశీ చికెన్‌తో మక్క వడలను నంజుకుని తింటే.. ఆ రుచే అద్భుతం అంటూ భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. మక్క వడల పార్సిళ్లు సైతం భారీగా తీసుకెళుతున్నారు. ఈ రహదారిలో వెళ్లేవారు కచ్చితంగా మక్క వడల రుచి చూడడం ఆనవాయితీగా మారింది.
రోహిణి కార్తెలోనే...
అంకాపూర్ గ్రామ రైతులు రోహిణి కార్తెలోనే మొక్కజొన్న విత్తడమనేది ప్రత్యేకం. బోర్లలో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మే నెల మొదటి వారంలోనే మొక్కజొన్న వేస్తారు. సుమారు 500 ఎకరాల్లో పంట వేస్తారు. జూలైలో పంట వస్తుంది. ఈ రైతులు నేరుగా పచ్చి కంకులను అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా జూలై నుంచి మక్క వడలు ఇక్కడ తయారు చేస్తారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వానాకాలం పంటను జూన్‌లో నాటడం ప్రారంభిస్తారు. అదేవిధంగా పసుపులో అంతరపంటగానూ మొక్కజొన్న వేస్తారు. ఇలా వేసే పంట ప్రతి ఏటా మొత్తం కలిపి జిల్లాలో 30,800 ఎకరాలు ఉంటోంది. అంకాపూర్ మక్క మార్కెట్ నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ వరకు మొక్కజొన్న ఎగుమతి చేస్తున్నారు. మధ్యవర్తులు ఎకరం లెక్కన పంట కొనుగోలు చేస్తారు. లేనిపక్షంలో ట్రాలీ ఆటోల లెక్కన కొనుగోలు చేస్తారు. మొక్కజొన్న సీజన్ జనవరి వరకు ఉంటుంది. దీంతో అంకాపూర్‌లో 7 కుటుంబాల వారు ప్రత్యేకంగా మక్క వడలను ఈ సీజన్‌లో తయారు చేస్తున్నారు.
సీజన్‌లో మక్క వడలు మాత్రమే..
15 ఏళ్ల క్రితం నుంచే మా ఊళ్లో మక్క వడలు చేసి అమ్మడం ప్రారంభమైంది. గతంలో మేము టిఫిన్ సెంటర్ నడిపేవాళ్లం. మక్క వడలు చేయడం ప్రారంభించాక వీటికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. దీంతో సీజన్‌లో 7 నెలల (జూన్ నుంచి జనవరి వరకు) పాటు పూర్తిగా మక్క వడలు మాత్రమే చేసి అమ్ముతున్నాం.
–రెగుల్వార్ సిద్ధు, కపిల దంపతులు
Comments
Please login to add a commentAdd a comment