Ankapur
-
అంకాపూర్ జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు
-
అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు. దేశవిదేశాలకు సైతం ఆంకాపూర్ దేశీ చికెన్ పార్శిళ్లుగా వెళుతున్న విషయం తెలిసిందే. చికెన్‌తో పాటు పశువుల గడ్డిని పెంచేందుకు వినియోగించే ఎర్రజొన్న విత్తనానికి కూడా ఇటీవల ఈ ప్రాంతం ఫేమస్ అయింది. అంకాపూర్‌లో ఎర్రజొన్న విత్తనాన్ని బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు సైతం ఎగుమతి చేసే కంపెనీలు 40 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఎర్రజొన్న విత్తనంతో పాటు మరో విషయంలోనూ అంకాపూర్ ప్రత్యేకతను సాధిస్తోంది. అదే అంకాపూర్ ‘మక్క వడలు’. ఈ ఒక్క ప్రాంతంలోనే ఆ మక్క వడలు లభ్యమవుతాయి. ప్రతి ఏటా జూన్ నెల నుంచి జనవరి నెలలోపు ఈ వడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేశీ చికెన్‌తో మక్క వడలను నంజుకుని తింటే.. ఆ రుచే అద్భుతం అంటూ భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. మక్క వడల పార్సిళ్లు సైతం భారీగా తీసుకెళుతున్నారు. ఈ రహదారిలో వెళ్లేవారు కచ్చితంగా మక్క వడల రుచి చూడడం ఆనవాయితీగా మారింది. రోహిణి కార్తెలోనే... అంకాపూర్ గ్రామ రైతులు రోహిణి కార్తెలోనే మొక్కజొన్న విత్తడమనేది ప్రత్యేకం. బోర్లలో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మే నెల మొదటి వారంలోనే మొక్కజొన్న వేస్తారు. సుమారు 500 ఎకరాల్లో పంట వేస్తారు. జూలైలో పంట వస్తుంది. ఈ రైతులు నేరుగా పచ్చి కంకులను అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా జూలై నుంచి మక్క వడలు ఇక్కడ తయారు చేస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వానాకాలం పంటను జూన్‌లో నాటడం ప్రారంభిస్తారు. అదేవిధంగా పసుపులో అంతరపంటగానూ మొక్కజొన్న వేస్తారు. ఇలా వేసే పంట ప్రతి ఏటా మొత్తం కలిపి జిల్లాలో 30,800 ఎకరాలు ఉంటోంది. అంకాపూర్ మక్క మార్కెట్ నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ వరకు మొక్కజొన్న ఎగుమతి చేస్తున్నారు. మధ్యవర్తులు ఎకరం లెక్కన పంట కొనుగోలు చేస్తారు. లేనిపక్షంలో ట్రాలీ ఆటోల లెక్కన కొనుగోలు చేస్తారు. మొక్కజొన్న సీజన్ జనవరి వరకు ఉంటుంది. దీంతో అంకాపూర్‌లో 7 కుటుంబాల వారు ప్రత్యేకంగా మక్క వడలను ఈ సీజన్లో తయారు చేస్తున్నారు. సీజన్లో మక్క వడలు మాత్రమే.. 15 ఏళ్ల క్రితం నుంచే మా ఊళ్లో మక్క వడలు చేసి అమ్మడం ప్రారంభమైంది. గతంలో మేము టిఫిన్ సెంటర్ నడిపేవాళ్లం. మక్క వడలు చేయడం ప్రారంభించాక వీటికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. దీంతో సీజన్లో 7 నెలల (జూన్ నుంచి జనవరి వరకు) పాటు పూర్తిగా మక్క వడలు మాత్రమే చేసి అమ్ముతున్నాం. –రెగుల్వార్ సిద్ధు, కపిల దంపతులు -
రాజకీయ అరంగేట్రం చేయనున్న అంకాపూర్ రాకేష్ రెడ్డి
-
ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘అంకాపూర్ దేశీ చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఈ దేశీ (నాటు) కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు. నాన్‌వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అంకాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులకు వచ్చిన ఆలోచన.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరి పేరును మార్మోగిస్తోంది. ఈ పేరుతో అనేకచోట్ల హోటళ్లు, ఆర్డర్ మెస్‌లు ఏర్పాటు కావడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ అంకాపూర్ దేశీ కోడి కూరను రుచి చూసి మెచ్చుకున్న వారే కావడం గమనార్హం. కల్లు తాగే వారి కోసం.. గీత కార్మికుడైన బుర్ర దుబ్బగౌడ్ కల్లు తాగేందుకు తన వద్దకు వచ్చే వారికి.. నాటు కోడి కూర వండి విక్రయించేవాడు. క్రమంగా దుబ్బగౌడ్ దగ్గరికి కల్లు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో దుబ్బ గౌడ్, అతని భార్య లక్ష్మి దేశీ కోడి కూరతో పాటు బాతు కూర, ఆమ్లెట్లు వేసివ్వడం ప్రారంభించారు. ఇందుకోసం గ్రామంలోని తమ ఇంటి వద్దనే దేశీ కోళ్లు, బాతులు పెంచడం ప్రారంభించారు. గిరాకీ పెరగడంతో మునిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు ఒక కోడిని కొనుగోలు చేసి నలుగురు వ్యక్తులు తినడానికి సరిపడా కిలో బియ్యంతో అన్నం వండి రూ.5కు అందించడంతో క్రమంగా వారి వ్యాపారం పుంజుకుంది. లాభాల బాటలోకి వచ్చిన ఈ దంపతులను చూసి అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి రామగౌడ్, తాళ్లపల్లి మల్లాగౌడ్, బోండ్ల భాజన్న కూడా దేశీ కోడి కూర వంటకం ప్రారంభించారు. పదేళ్ల పాటు గ్రామంలోని గాంధీ చౌరస్తాలో నాటు కోడి కూర వ్యాపారం చేసిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులు పోటీ అధికం కావడంతో విరమించుకుని జీవనోపాధి కోసం హోటల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కాలం చేశారు. ఈ దంపతులు ప్రారంభించిన దేశీ కోడి కూర రుచి, అంకాపూర్ పేరు క్రమంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. డెలివరీ @ ‘డోర్ స్టెప్’ ఒక కోడి ఆర్డర్ చేసిన వారు తమ గ్రామ శివారులో ఎక్కడ కూర్చున్నా తోటలు, పంట పొలాలు, ఇళ్లకు నేరుగా వెళ్లి అందిస్తున్నారు. భోజనం తరువాత గిన్నెలను సైతం వారే తీసుకెళుతున్నారు. వండి నేరుగా తెచ్చి ఇస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పంట పొలాల్లో, మామిడి తోటల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిజామాబాద్, ఇతర గ్రామాల్లో కూడా ఆర్డర్ మెస్‌లు ప్రారంభించారు. అంకాపూర్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎర్రజొన్న సీడ్ వ్యాపారం అభివృద్ధి చెందింది. సుమారు 40 సీడ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తరచూ అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. దేశీ కోడి కూరను రుచి చూసి వివిధ ప్రాంతాల్లో దీని గురించి చెప్పడంతో ప్రాచుర్యం పొందింది. అంకాపూర్ దేశీ కోడి ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దేశీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్ కోడి అయితే ఎక్కువ ధర.. అంకాపూర్ దేశీ కోడి (క్రాస్ బ్రీడ్) కూరను సొంతంగా తయారు చేసిన ప్రత్యేకమైన మసాలాలు దట్టించి వండటంతో దానికి మంచి రుచి వస్తుంది. కోరిన వారికి ఎల్లిగడ్డ కారం సైతం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు. భోజన ప్రియులు, ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు ఈ కూరను ఇష్టంగా తింటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం కిలోకు రూ.5తో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర, అన్నం ధర ప్రస్తుతం రూ.1,000 వరకు ఉంటోంది. గ్రామంలో సుమారు పది మంది ఆర్డర్ మెస్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం రూ.700కు నలుగురికి సరిపడా ఫారంలో పెంచిన దేశీ కోడి కూర, అన్నం చేసి ఇస్తున్నారు. ఆర్డర్ మెస్‌లోనే తినేవారికి రూ.130కు ప్లేట్ చొప్పున వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో పెరిగిన ఒరిజినల్ దేశీ కోడికి మాత్రం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరణ.. పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్‌లు ప్రస్తుతం విస్తరించాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అంకాపూర్ దేశీ కోడి కూర పేరుతో ఆర్డర్ మెస్‌లు వెలిసాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్, పెర్కిట్, మామిడిపల్లి కేంద్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు వందకు పైగా అంకాపూర్ దేశీ కోడి కూర అందించే ఆర్డర్ మెస్‌లు ఉండగా.. ఒక్క ఆర్మూర్ మండలంలోనే 50కి పైగా ఆర్డర్ మెస్‌లు ఉన్నాయి. అయితే ఈ దేశీ కూర మెస్‌లను అంకాపూర్ వాసులే కాకుండా వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. విదేశాలకూ పార్శిల్స్.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ప్రత్యేక మసాలాలతో ప్రత్యేక రుచి.. ఇంట్లో వండే చికెన్‌లా కాకుండా మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని మసాలాలు దట్టించి దేశీ కోడి కూరను వండుతాం. చాలా రుచికరంగా ఉంటుండటంతో భోజన ప్రియులు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. –కుంట నారాయణ గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంతర్జాతీయ గుర్తింపుతో ఆనందం అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు వస్తున్నారు. కోరిన విధంగా వారికి వండి పెడుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో అంకాపూర్‌కు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. – తాళ్లపల్లి శ్రీకాంత్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంకాపూర్‌ను మించి పెర్కిట్‌లో వ్యాపారం.. దేశీ కోడి తినాలనుకున్న భోజన ప్రియులు కోరిన విధంగా వండి ఇస్తున్నాము. అంకాపూర్ కంటే పెర్కిట్, మామిడిపల్లిలో దేశీ కోడి ఆర్డర్ మెస్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. – జీవన్‌గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, పెర్కిట్, ఆర్మూర్ -
రెండేళ్ల ప్రేమ.. ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటాను అనడంతో...
సాక్షి, ఆదిలాబాద్: మండలంలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోల గంగుబాయి (18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాలు.. జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్ రవీందర్, గంగుబాయి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వేరే యువతిని వివాహం చేసుకుంటానని రవీందర్ తెలపడంతో గంగుబాయి మనస్తాపం చెంది ఈనెల 24న పురుగుల మందు తాగింది. చదవండి: మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: మరొకరితో పెళ్లి.. హైదరాబాద్‌కు వెళ్తూ ప్రియున్ని రమ్మని.. -
హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకే కాదు సరుకులకు సైతం రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. ఒక ఊరు నుంచి మరో ఊరుకు ప్రయాణికులను చేరవేసినట్లుగానే సరుకులను చేరవేస్తున్నాయి. ఇంటికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు మొదలుకొని అత్యవసరమైన మందులు, ఆహార పదార్థాలు, పిండివంటల వరకు కార్గో బస్సుల్లో పరుగులు తీస్తున్నాయి. టికెట్టేతర ఆదాయ సముపార్జనలో భాగంగా కార్గో, పార్శిల్ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేక హస్తకళా వస్తువులు, ఆహార పదార్థాలు, పిండి వంటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఇప్పటి వరకు గ్రేటర్లో 5.2 లక్షలకుపైగా పార్శిళ్లను వినియోగదారులకు అందజేసింది. జూన్ నుంచి రూ.2కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి సంస్థల తరహాలో నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే వస్తువులను చేరవేసేందుకు సన్నద్ధమవుతోంది. కొద్దిరోజుల్లో ఆర్టీసీ పార్శిల్, కార్గో సేవలు ఆన్లైన్లోనే లభించనున్నాయి. అంకాపూర్ టు హైదరాబాద్... నిజామాబాద్‌లోని అంకాపూర్‌లో లభించే చికెన్‌కు హైదరాబాద్‌లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆ ఊళ్లో చికెన్ కర్రీను తయారు చేసి విక్రయించే వ్యక్తులకు ఇటీవల కాలంలో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా డిమాండ్ పెరిగింది. ప్రత్యేకమైన మసాలాలతో, ఎంతో రుచిగా వండడం వల్ల అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు వందలాది పార్శిళ్లు రవాణా అవుతున్నాయి. పార్శిల్ చార్జీలతో సహా కిలోకు రూ.650 చొప్పున తీసుకుంటున్నారు. “వీకెండ్స్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఒకటి, రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా పార్విళ్లు జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్‌లకు చేరుతాయి. ప్రతిరోజూ 30 నుంచి 50 కిలోల చికెన్ హైదరాబాద్‌కు పార్శిల్ చేస్తున్నారు. పిండివంటల నుంచి.. హస్తకళల దాకా.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో లభించే పిండివంటలను కూడా ఆర్టీసీ వినియోగదారులకు చేరువ చేస్తోంది. సిద్దిపేట సకినాలు, అప్పచ్చులు, కరీంనగర్లో ప్రత్యేకంగా వండే సర్వపిండి వంటివి ఇప్పుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ పార్శిళ్ల ద్వారా పొందవచ్చు. “ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తే తయారీ సంస్థల నుంచి సేకరించి వినియోగదారులకు అందజేస్తాం’ అని చెప్పారు ఆర్టీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్. నిర్మల్ బొమ్మలు, పెంబర్తి హస్తకళా వస్తువులు, పోచంపల్లి, గద్వాల్ చీరలు, చేనేత వస్త్రాలను వినియోగదారులకు చేరవేసేందుకు ఆర్టీసీ పార్శిల్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 150 కార్గో బస్సుల ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. నేరుగా ఇంటి వద్దకే సేవలు.. ఇటు వినియోగదారుల నుంచి అటు తయారీదారులు, వ్యాపార సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించడంతో నేరుగా వినియోగదారులకు ఇంటి వద్దే పార్శిళ్లను అందజేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకొంటే చాలు. ఆయా సంస్థల నుంచి అందిన వెంటనే పార్శిల్ సర్వీసుల ద్వారా ఆర్టీసీ ఏజెంట్లకు, అక్కడి నుంచి వినియోగదారుల ఇంటికి చేరుస్తారు. చార్జీలు చాలా తక్కువ.. సిరిసిల్లకు కొన్ని వస్తువులను పంపిస్తున్నాను. బయట కంటే చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.150తోనే పని అయిపోయింది. చాలా బాగుంది. – శ్రీపతిరావు, వినియోగదారు ఇదే మొదటిసారి.. కార్గో సేవలను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి. ఇంటి నుంచి కొన్ని వస్తువులను నిర్మల్‌కు పంపిస్తున్నా. మిగతా సంస్థల కంటే ఆర్టీసీని నమ్ముకోవడం మంచిది కదా. – బూదయ్య, వినియోగదారు ఆర్టీసీ వల్లే పార్శిల్ ఆలోచన.. అంకాపూర్ నుంచి హైదరాబాద్‌కు చికెన్ పంపించవచ్చనే ఆలోచన ఆర్టీసీ పార్శిల్ సేవల వల్లే వచ్చింది. అప్పటి వరకు లోకల్‌గానే విక్రయించేవాళ్లం. ఇప్పుడు చాలా బాగుంది. – చంద్రమోహన్, చికెన్ తయారీదారు, అంకాపూర్ స్పందన బాగుంది.. పార్శిల్ సేవలకు స్పందన చాలా బాగుంది. జేబీఎస్ నుంచి ప్రతిరోజూ రూ.85 వేలకు పైగా ఆదాయం లభిస్తోంది. వందలాది పార్శిళ్లను వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నాం, – ప్రణీత్, డిపో మేనేజర్, పికెట్ -
మస్త్ మజా.. మక్క వడ
సాక్షి, నిజామాబాద్: ‘అన్నా రోజు హోటళ్ల చాయి తాగుడేనా.. వర్షాకాలం షురూ అయింది అంకాపూర్‌కు పోయి నోరూరించే మక్క వడలు తిందాము నడు..’ అంటూ ఆర్మూర్ ప్రాంతానికి చెందిన యువతతో పాటు జిల్లావాసులు మక్కవడలు తినడానికి అంకాపూర్‌కు దారి పడుతున్నారు. నోరూరిస్తున్న మక్కవడలకు అంకాపూర్ దేశి చికెన్ తోడు కావడంతో భోజన ప్రియులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చుకొని మరీ మక్కవడలు, దేశీ చికెన్ తినడానికి ఇక్కడికి వస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో మొక్కజొన్న కంకుల (మక్కల) అమ్మకాలు జోరుందుకున్నాయి. ఒకవైపు కొందరు వ్యవసాయ కూలీలు రోడ్లకు ఇరువైపులా షెడ్లు వేసుకొని మక్కెన్లను బొగ్గులపై కాలుస్తూ అమ్మకాలు సాగిస్తుండగా మరొకవైపు అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ హోటళ్లలో మక్క వడలను స్పెషల్‌గా వేసి ఇస్తున్నారు. దీంతో నోరూరించే మక్క వడలను తినడానికి ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. మక్కలలో పౌష్టికాహారాలు సైతం అధికంగా ఉండటంతో సీజనల్‌గా లభించే మక్కలను తింటే మంచిదని వైద్యులు సైతం పేర్కొంటుండటంతో ఈ మక్కవడల హోటళ్లు మూడు మక్కెన్లు, ఆరు వడలుగా కొనసాగుతున్నాయి. అంకాపూర్ గ్రామానికి చెందిన మంజుల, సిద్దు, శివానంద్, మారుతి అనే హోటళ్ల యజమానులు భోజన ప్రియుల నాడిని పట్టుకొని మక్క వడలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. స్థానికంగా మార్కెట్లో అమ్మకానికి వచ్చిన మక్క పచ్చిబుట్టలను కొనుగోలు చేసి మక్కలను వలిచి అల్లంవెల్లుల్లి పేస్టు, మిరపకాయలు, ధనియాలపొడి, కరివేపాకు, పసుపు, ఉల్లిగడ్డ తదితరాలు వేసి గ్రైండర్లో పేస్ట్‌గా తయారు చేసి నూనెలో గోలించి నోరూరించే మక్కవడలను తయారు చేస్తున్నారు. 20 రూపాయలకు నాలుగు మక్కవడలను చిన్నగా కోసిన ఉల్లిగడ్డలు, నూనెలో గోలించిన మిరపకాయలతో నంజుకొని తినడానికి ఇస్తున్నారు. మరో హోటల్లో ప్రత్యేకంగా చట్నీని సైతం ఇస్తున్నారు. దీంతో అంకాపూర్‌లో మక్కవడలకు ప్రత్యేకంగా డిమాండ్ ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సైతం వచ్చే వారే కాకుండా 63వ నెంబర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ వైపు వెల్లి వచ్చే ప్రయాణీకులు సైతం ఇక్కడ ప్రత్యేకంగా ఆగి మరీ మక్క వడలు తింటూ అంకాపూర్ వడల రుచిని అభినందిస్తున్నారు. మరో వైపు ఇక్కడ మక్క వడలు తిన్న వారు తమ కుటుంబ సభ్యుల కోసం పార్సిల్‌ను సైతం ఖచ్చితంగా తీసుకొని వెల్తారు. హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల వారు ఆర్డర్‌పై ప్రత్యేకంగా మక్క వడలు వేయించుకొని పార్సిల్లను తమతో తీసుకొని వెల్తుంటారు. దేశీ కోడి కూరలో నంజుకుంటూ.. అంకాపూర్ మక్కవడల రుచి తెలిసిన భోజన ప్రియులు ఇక్కడ ప్రత్యేకంగా లభించే దేశీ కోడిని ఆర్డర్ చెప్పుకొని మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరలో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో దేశీ కోడి వండి ఇచ్చే ఆర్డర్ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. సీజన్లో దొరికే ఈ మక్కవడలకు అంకాపూర్‌లో ఎక్కడాలేని డిమాండ్ ఉంది. సీజనల్‌గా మంచి గిరాకీ.. మక్కల సీజన్లోనే మక్క వడలను వేస్తుంటాము కాబట్టి సీజనల్‌గా మా హోటళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మక్క వడలు వేస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వారు తాము తినడంతో పాటు తమ ఇంటివాళ్లకోసం కూడా తీసుకెళ్తున్నారు. – సిద్ధు, మక్క గారెలు వేస్తున్న హోటల్ యజమాని, అంకాపూర్ -
రాష్ట్రావతరణను పురస్కరించుకొని పాట చిత్రీకరణ
అంకాపూర్ (ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కోకిల సింగింగ్,డ్యాన్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల వీడియో నృత్యాలను శనివారం చిత్రీకరించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను వివరిస్తూ పూర్ణచంద్ర దర్శకత్వం వహించిన ఈ ఆవిర్భవ పాటకు ప్రముఖ కళాకారుడు కోకిల నాగరాజు నృత్యరీతులు సమకూర్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా సంబురాలు చేసుకునే పాటను చిత్రీకరించారు. ‘మోగెరో డప్పుల దరువూ.. దిగిందిరో మన గుండెలో బరువు.. రంగుల వానా కురిసి, నింగంచున సింగిడి పొడిసి.. నేలంతా తడిసి మురిసేలా.. ఉయ్యాలా.. పల్లెల్లో పండుగ చేయాలా..’ అంటూ తెలంగాణ సంబురాల పాట సాగుతుంది. ఈ పాటను ప్రముఖ జానపద కళాకారుడు మాట్ల తిరుపతి రాసి, పాడారు. గ్రామంలో పొలాల గట్ల వెంట, పచ్చని పంట పొలాలు, పల్లెల అభివృద్ధి, సమైక్యాంధ్ర సంకెళ్లు తెంచుకొని నవ తెలంగాణ ప్రగతి బాటలో పయనించాలని పేర్కొంటూ మారుతి రాసిన పాటను చక్కటి నృత్యాల మధ్య చిత్రీకరించారు. ఈ తెలంగాణ సంబురాల వీడియో పాటను జూన్ 2న కొన్ని టీవీ చానళ్లలో ప్రసారం అవుతుందని నాగరాజు తెలిపారు. కోకిల నాగరాజు, కరుణ, రాజ్యలక్ష్మీ, రిశ్మిత, శంకర్, అశోక్, ప్రవీణ్, జయశ్రీ, భార్గవిలు నృత్యాలు చేశారు.