అంకాపూర్ (ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో కోకిల సింగింగ్,డ్యాన్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థుల వీడియో నృత్యాలను శనివారం చిత్రీకరించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను వివరిస్తూ పూర్ణచంద్ర దర్శకత్వం వహించిన ఈ ఆవిర్భవ పాటకు ప్రముఖ కళాకారుడు కోకిల నాగరాజు నృత్యరీతులు సమకూర్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా సంబురాలు చేసుకునే పాటను చిత్రీకరించారు.
‘మోగెరో డప్పుల దరువూ.. దిగిందిరో మన గుండెలో బరువు.. రంగుల వానా కురిసి, నింగంచున సింగిడి పొడిసి.. నేలంతా తడిసి మురిసేలా.. ఉయ్యాలా.. పల్లెల్లో పండుగ చేయాలా..’ అంటూ తెలంగాణ సంబురాల పాట సాగుతుంది. ఈ పాటను ప్రముఖ జానపద కళాకారుడు మాట్ల తిరుపతి రాసి, పాడారు. గ్రామంలో పొలాల గట్ల వెంట, పచ్చని పంట పొలాలు, పల్లెల అభివృద్ధి, సమైక్యాంధ్ర సంకెళ్లు తెంచుకొని నవ తెలంగాణ ప్రగతి బాటలో పయనించాలని పేర్కొంటూ మారుతి రాసిన పాటను చక్కటి నృత్యాల మధ్య చిత్రీకరించారు. ఈ తెలంగాణ సంబురాల వీడియో పాటను జూన్ 2న కొన్ని టీవీ చానళ్లలో ప్రసారం అవుతుందని నాగరాజు తెలిపారు. కోకిల నాగరాజు, కరుణ, రాజ్యలక్ష్మీ, రిశ్మిత, శంకర్, అశోక్, ప్రవీణ్, జయశ్రీ, భార్గవిలు నృత్యాలు చేశారు.
రాష్ట్రావతరణను పురస్కరించుకొని పాట చిత్రీకరణ
Published Sun, May 25 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement