టైంపాస్‌కు ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే గుర్తొచ్చేవి మరమరాలు. గుప్పెడు మరమరాలకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె, కారం, వేయించిన పల్లీలు వేసి కలుపుకుని తింటే ఆ అనుభూతి చెప్పనలవి కాదు. ఇంటికొచ్చే అతిథులకు సైతం కరకరలాడే మరమరాలను స్నాక్స్‌గా అందించవచ్చు.
ఇప్పుడు మరమరాలతో రకరకాల రెసిపీలు తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలోనూ మరమరాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు సైతం వీటిని నేరుగా తినొచ్చు. వీటి తయారీకి కేరాఫ్‌గా నిలుస్తోంది కట్టంగూర్.
కట్టంగూర్‌లో 80 సంవత్సరాల క్రితం కుటీర పరిశ్రమగా మరమరాల తయారీ ప్రారంభమైంది. పద్మశాలీలు ప్రారంభించిన ఈ కుటీర పరిశ్రమను గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు చేపట్టారు. మొదట్లో సుమారు 50 కుటుంబాల వారు బట్టీల ద్వారా మరమరాలు తయారు చేసేవారు. 30 సంవత్సరాల నుంచి బట్టీల స్థానంలో మిషన్లు (రోస్టర్‌లు) వచ్చాయి. అయితే.. రానురాను ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్దగా లాభాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు మరమరాల పరిశ్రమకు దూరమయ్యాయి. బట్టీల విధానం ఉన్నప్పుడు.. అంటే 1995 సంవత్సరం వరకు కట్టంగూర్‌లో సుమారు వంద బట్టీలు ఉండేవి. ఒక్కో ఇంట్లో రెండు బట్టీలను కూడా నడిపారు. అయితే, దుమ్ము, పొగ కారణంగా మరమరాల పరిశ్రమలు గ్రామానికి దూరంగా వచ్చాయి. ప్రస్తుతం పది మిల్లులు ఉన్నాయి. వీటిలో రోస్టర్, ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన మిల్లుల్లో మరమరాలు తయారవుతున్నాయి.
సిద్దిపేటలోనూ మనవారే..
కట్టంగూర్‌కు చెందిన వారే సిద్దిపేటలో మరమరాల పరిశ్రమను విస్తరించారు. ఆ జిల్లాలో మొక్కజొన్న పంట ఎక్కువగా ఉంటుంది. అక్కడ మక్కల అటుకులు, పోహ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. దానికి అనుబంధంగా 15 మరమరాల మిల్లులు కూడా ఏర్పాటు చేశారు.
ఇతర రాష్ట్రాల్లోనూ మార్కెటింగ్
కట్టంగూరులో తయారైన మరమరాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్రలో మార్కెటింగ్ చేస్తున్నారు. కట్టంగూర్ నుంచి నేరుగా వివిధ ప్రాంతాలకు సరఫరా ఉంటుంది. 50 శాతం తెలంగాణలో మార్కెటింగ్ జరిగితే.. మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 50 శాతం విక్రయం ఉంటోంది. వివిధ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతుంటారు. మహారాష్ట్రలో దీపావళి పండుగ సమయంలో మరమరాల వినియోగం అధికంగా ఉంటుంది. అంతటా మరమరాల ధర సమానంగానే ఉంటున్నప్పటికీ ట్రాన్స్‌పోర్ట్ చార్జీలతో కలిసి వాటి ధర నిర్ణయిస్తారు. దూర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నప్పుడు రవాణా చార్జీలు కూడా కలుపుతారు. మరమరాలను కర్నాటక రాష్ట్ర ప్రజలు ఉదయం అల్పాహారంలో ఎక్కువ తీసుకుంటారు. తెలంగాణలో చూస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరమరాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ జిల్లాలోని ప్రతి చిన్న గ్రామంలోనూ మరమరాలు దొరుకుతాయి.
మరింత ప్రోత్సాహం అవసరం
1010 రకం ధాన్యం క్వింటా రూ.2500 ఉందని.. ధాన్యం ధర పెరగడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. రోస్టర్‌లో వాడుతున్న సముద్రపు ఇసుక టన్ను ధర రూ.2500 పలుకుతుంది. ఇసుకను మచిలీపట్నం నుంచి తెప్పించుకుంటున్నారు. క్వింటా మరమరాల ఉత్పత్తికి 10 కిలోల సముద్రపు ఇసుక అవసరం. ఒక క్వింటా మరమరాలు తయారయ్యే ప్రక్రియకు.. వేడి నీళ్ల కోసం మండించే కట్టె పొట్టు, ఇసుక, ఉప్పుకు కలిపి రూ.250 ఖర్చు వస్తుంది. దీనికి ధాన్యం ధర అదనం.
ప్రభుత్వం సహకారం అందించాలి
మరమరాల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కావాలి. ధాన్యం సంవత్సరంలో మూడు నెలలే ఉంటుంది. మా పరిశ్రమకు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు చేయాలంటే ఎంతో ఆర్థిక భారం అవుతుంది. ఐకేపీ కేంద్రాల ద్వారా సబ్సిడీపై ధాన్యం సరఫరా చేయాలి. బ్యాంకుల ద్వారా ఓడీ సౌకర్యం కల్పించాలి. ఈ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటే మరింత అభివృద్ధి చెందుతుంది. మరి కొందరు మరమరాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారు.
– గంజి వెంకన్న, మరమరాల మిల్లు యజమాని, కట్టంగూర్
ధాన్యం కేటాయించాలి
ఐకేసీ ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయిస్తున్న విధంగా.. మాకు కూడా ధాన్యం కేటాయించాలి. మేము అందుకు నగదు చెల్లిస్తాం. పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు చిన్న తరహా పరిశ్రమల కింద సబ్సిడీ రుణాలు ఇస్తున్నా.. వ్యాపారానికి కూడా రుణం ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా ఓడీ ఇవ్వాలి. విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి. మా పరిశ్రమలకు 24 విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
– రాపోలు వెంకటేశ్వర్లు, మరమరాల తయారీదారుడు, కట్టంగూర్
Comments
Please login to add a commentAdd a comment