మెట్‌పల్లిలోని కొనుగోలు కేంద్రంలో వర్షం నీటిలో ధాన్యం కుప్పలు
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. తూకంవేసిన బస్తాలతోపాటు రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు నీటమునిగాయి. ధాన్యం కుప్పలు పక్కపక్కనే ఉండడంతో వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక అక్కడి నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాలు ఉన్న భూమి తడిగా మారడంతో అందులోకి లారీలు రాలేకపోయాయి. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం 4వేలు క్వింటాళ్లు ఉండగా.. నేరుగా రైస్‌మిల్లులకు తరలించారు. ధాన్యాన్ని ఆరబెడితే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆ పనిలో పడ్డారు.
సగం ధాన్యం కేంద్రాల్లోనే !
జిల్లాలోని 146 ఐకేపీ కేంద్రాల్లో, 144 సింగిల్‌విండో కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాల ద్వారా 7.87లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 7లక్షలు క్వింటాళ్ల వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. సింగిల్‌విండో కేంద్రాల ద్వారా 8లక్షలు క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 6 లక్షలు క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెస్తున్న ధాన్యానికి సరిపోయే స్థాయిలో కవర్లు లేకపోవడంతో వర్షం పడిన ప్రతీసారి తడిసిపోతుంది.
హమాలీలతోనే అసలు సమస్య
మహారాష్ట్ర, బిహార్ నుంచి వేల సంఖ్యలో హమాలీలు వచ్చినప్పటికీ సరిపోవడం లేదు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పగటిపూట 43 డిగ్రీలు వరకు ఉంటుండడంతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడం లేదు. దీంతో తూకం, లోడింగ్ పూర్తవడం లేదు.
పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెట్‌పల్లి, చల్‌గల్‌లో తడిసిన ధాన్యాన్ని జాయింట్ కలెక్టర్ రాజేశంతోపాటు ఐకేపీ, సింగిల్‌విండో అధికారులు పరిశీలించారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
కథలాపూర్/మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం : మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ రాజేశం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం రావడంతో కొనుగోళ్లలో జాప్యమవుతుందన్నారు. కేంద్రాల్లో బార్‌దాన్‌లు, లారీల కొరత లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులో కొనుగోలు చేసిన ధాన్యం 5,500 క్వింటాళ్లు, కొనుగోలు చేయని ధాన్యం 10 వేలు క్వింటాళ్లు నిల్వ ఉంది. మార్కెట్ చైర్మన్ బాల్క సురేష్, సింగిల్‌విండో చైర్మన్ మారు మురళీధర్‌రెడ్డి, తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ ధాన్యాన్ని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 500 బస్తాలు స్వల్పంగా తడిసిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment