వర్షాభావ పరిస్థితుల్లో పొద్దు తిరుగుడే ముద్దు
తాళ్లూరు : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ పొద్దు తిరుగుడు పంట సాగు ఉత్తమం. ఈ మేరకు రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. పంట సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులను అద్దంకి ఏడీఏ కుప్పయ్య ‘సాక్షి’కి వివరించారు. వాతావరణంలో తేమ తక్కువగా ఉంటే ఏడాది పొడవునా ఈ పంటను పండించుకోవచ్చని చెప్పారు. ఖరీఫ్‌లో అయితే సెప్టెంబర్ చివరి వరకు ఈ పంటను వేసుకోవచ్చన్నారు.
అనుకూలమైన నేలలు
నీరు నిల్వ ఉండని తటస్థ నేలలైన ఎర్ర, రేగడి, ఒండ్రు నెలలు పొద్దుతిరుగుడు పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేల కంటే క్షార లక్షణాలు కలిగిన నేలల్లో దిగుబడి ఎక్కువగా వస్తుంది.
భూమిలో ఆమ్ల లక్షణాలు ఉంటే విత్తనం మొలకెత్తే స్వభావం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణం మొక్కలో పటుత్వాన్ని తగ్గిస్తుంది.
పొద్దు తిరుగుడు మొక్కలు అధిక తేమ శాతాన్ని తట్టుకోలేవు. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేయవద్దు.
సాగు నేల తయారీ
భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి.
మధ్యస్థ బరువు నేలల్లో బ్లేడుతో ఒకటి రెండు సార్లు కలియదున్నాలి.
చదును చేసిన అనంతరం బోదెలు చేసి విత్తనం నాటాలి.
విత్తనశుద్ధి...
ఎకరాకు రెండు కిలోల విత్తనం అవసరం. విత్తనాలను ముందు 14 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తే ముందు కిలో విత్తనాలకు మూడు గ్రాముల కాంప్లాన్, థైరమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఆ తర్వాతే విత్తాలి.
నీటి యాజమాన్యం
ఎర్ర రేగడి నేలల్లో ఉష్ణోగ్రతను బట్టి 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగ డి భూముల్లో 15 నుంచి 20 రోజుల కొకసారి నీటిని అందించవచ్చు.
శీతాకాలంలో తేలిక నేలలకు 4 నుంచి 6 సార్లు, మధ్యస్థ నేలలకు మూడు నుంచి 4 సార్లు, బరువు నేలలకు రెండు నుంచి మూడు సార్లు నీటిని పారించాలి.
ఎరువుల వాడకం
విత్తనం విత్తే మూడు వారాల ముందు ఎకరాకు మూడు టన్నుల పశువుల పేడ వేసి దున్నాలి. ఇది భూమిని సారవంతం చేస్తుంది.
భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజనిని విత్తనం నాటే దశలో, మొగ్గ తొడిగే దశలో, పువ్వు వికసించే దశలో వేసుకోవాలి.
పూత దశలో, ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల బోరాక్స్ మందు(లీటరు నీటికి రెండు గ్రామాల బొరాక్స్ కలపాలి)ను పిచికారీ చేయాలి. దీనివల్ల గింజలు ఎక్కువగా, బలంగా తయారవుతాయి.
గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వస్తాయి.
సస్యరక్షణ చర్యలు
పొద్దు తిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు, లద్దె, గొంగళి, పచ్చ, శనగపచ్చ, తలను తొలిచే పురుగులు లాంటివి ఆశిస్తాయి. ఆకుమచ్చ, పువ్వుకుళ్లు, బూజు లాంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన తగిన నివారణ చర్యలు చేపట్టాలి.
పక్షులు, అడవి పందుల బెడద
పొద్దు తిరుగుడు పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలుకలు ఎక్కువగా పంటపైన వాలి నష్టాన్ని కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లు చేను పైభాగంలో(వీటిపై సూర్యరశ్మి పడే ఎత్తులో) కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించుకోవచ్చు.
విత్తనం పట్టాక అడవి పందులు కూడా దాడి చేసే అవకాశం ఉంది. వాటి నివారణకు పంట చుట్టూ గుంజలు పాతి పట్టలు చుట్టి కాపాడుకోవాలి.