గుత్తాధిపత్యానికి చెక్‌ | Grain Selling Centers In Nizamabad | Sakshi
Sakshi News home page

గుత్తాధిపత్యానికి చెక్‌

Published Wed, Jun 19 2019 10:53 AM | Last Updated on Wed, Jun 19 2019 10:53 AM

Grain Selling Centers In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలకు మరిగిన కొందరు రైస్‌మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్ణయం ఝలక్‌ ఇచ్చినట్లయింది. ఈ సీజన్‌లో రైతుల వద్ద సేకరించిన ధాన్యంలో కొంత మొత్తాన్ని సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ ) కోసం జగిత్యాల జిల్లా రైస్‌మిల్లర్లకు అప్పగిస్తూ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ జిల్లాలో గుత్తాధిపత్యాన్ని చెలాయించిన రైస్‌మిల్లర్లకు ఈ నిర్ణయం చెక్‌ పెట్టినట్లయింది. ఇప్పటి వరకు ఇతర జిల్లాల నుంచే నిజామాబాద్‌ జిల్లాకు ధాన్యం వచ్చేది. ఈసారి ఇక్కడి ధాన్యం ఇతర జిల్లాలకు వెళ్లడం జిల్లా చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నిర్ణయంతో సర్కారు ధాన్యంతో అక్రమాలకు పాల్పడితే అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందనే సంకేతాలను పంపినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరోవైపు మిల్లర్లను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.

15 వేల మెట్రిక్‌ టన్నులు.. 
రబీ కొనుగోలు సీజనులో జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చింది. మొత్తం 3.64 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో నుంచి సుమారు 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జగిత్యాల జిల్లా పరిధిలోని 18 రైస్‌మిల్లులకు కేటాయిస్తూ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు.  జిల్లాలో ఉన్న అన్ని రైస్‌మిల్లుల మిల్లింగ్‌ సామర్థ్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు. అయితే ఈ కొనుగోలు సీజనులో సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్‌ కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు. దీంతో కమిషనర్‌ సమీపంలోని జగిత్యాల జిల్లాకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సుమారు 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం జగిత్యాలకు వెళ్లింది.

ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇక్కడికి.. 
ఏటా ఇతర జిల్లాల నుంచి నిజామాబాద్‌ మిల్లుల కు ధాన్యం వచ్చేది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా నుంచి ధాన్యం ఇక్కడికి పంపేవారు. ఇలా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మరఆడించి బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఆ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు తమ సొంత వ్యాపారాలకు వాడుకున్నారు. రూ.కోట్లు విలువ చేసే సర్కారు ధాన్యాన్ని బహిరంగమార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ సొమ్మును ఇతర వ్యా పారాలకు వాడుకుని చేతులెత్తేశారు. దీంతో నోటీసులు, కేసులు అంటూ అధికారులు డిఫాల్టర్ల వద్ద బియ్యాన్ని రాబట్టడంలో విఫలమయ్యారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు కావడంతోనే ఇది సా ధ్యమైంది. ఇందుకు భిన్నంగా ఇక్కడి ధాన్యాన్ని ఇప్పుడు ఇతర జిల్లాలకు కేటాయించడంతో మిల్ల ర్లు ఆలోచనలో పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement