
సాక్షి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అదనంగా మరో 100 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ఎవ్వరూ తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని ఆయన సూచించారు.
రైతులు తమ పంటను విక్రయించాలనుకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకే రానవసరం లేదని.. మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో రబీ పంట సాగు అయ్యిందన్నారు. 878 వరి కోత యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా అని.. దాంట్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని లక్ష్మీ షా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment