lakshmi shah
-
‘తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దు’
సాక్షి, కాకినాడ: జిల్లా వ్యాప్తంగా 271 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అదనంగా మరో 100 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ఎవ్వరూ తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని ఆయన సూచించారు. రైతులు తమ పంటను విక్రయించాలనుకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకే రానవసరం లేదని.. మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో రబీ పంట సాగు అయ్యిందన్నారు. 878 వరి కోత యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా అని.. దాంట్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని లక్ష్మీ షా వివరించారు. -
అర్హులెవరికీ అన్యాయం జరగదు
సాక్షి, రాజమహేంద్రవరం: అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఏ పథకంలోనూ అన్యాయం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జిల్లా వాసులకు సరిపడా బియ్యం అందించడమే కాకుండా మరో రెండు జిల్లాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటంత సామర్థ్యం జిల్లాకు ఉందన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజానగరం ‘సాక్షి’ ప్రచురణ కార్యాలయానికి విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’తో జరిపిన చిట్‌చాట్.. సాక్షి : రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేయడంపై మీ అభిప్రాయం. జేసీ: తూర్పుగోదావరి పెద్ద జిల్లా. అన్ని రంగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సాక్షి :ఈ జిల్లాలో పనిచేసే అధికారులు ఎలా ఫీలవుతుంటారు. జేసీ: ఏ ఉద్యోగి అయినా ఈ జిల్లాలో పని చేస్తే దేశంలో ఏ జిల్లాలోనైనా అత్యంత సమర్థంగా, ఏ రంగంలోనైనా మంచి అనుభవంతో పని చేయవచ్చు. సాక్షి ఎడిటోరియల్ విభాగంలో జరిగే కార్యకలాపాలను జేసీ లక్ష్మీశకు వివరిస్తున్న ఎడిషన్ ఇన్చార్జ్ కృష్ణారావు, బ్యూరో చీఫ్ ఎల్.శీనివాస్ సాక్షి : ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఈ జిల్లాలో పనిచేయాలనుకుంటారు. మీరేమనుకుంటున్నారు. జేసీ: పెద్ద జిల్లా కావడంతో పాటు భౌగోళికంగా అన్ని ప్రాంతాలు ఉండడంతో ఎక్కువ అవగాహన కోసం ఉపయోగపడుతుంది. తీర, గిరిజన ప్రాంతాలు మంచి ఆహ్లాదకరంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేవిగా ఉండడంతో జిల్లాను మంచి అభివృద్ధి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. సాక్షి :ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటి? జేసీ: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, నవరత్న పథకాల అమలుకు జిల్లా నలుమూలల పర్యటించి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కృషి చేస్తున్నాం. సాక్షి :గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ప్రచురణ యంత్రాల వివరాలు జేసీకి వివరిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ రామకృష్ణ, చిత్రంలో బ్రాంచి మేనేజర్ రమేష్ రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: జిల్లాలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. అవనీతికి తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరి కొద్ది రోజులు నడిస్తే అన్నింటికీ వలంటీర్ల వ్య వస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి : రాష్ట్రానికి అన్నపూర్ణగా పిలిచే జిల్లా నుంచి బియ్యం జిల్లా వాసులందరికీ సరిపోతుందంటారా? జేసీ: జిల్లాలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో బియ్యం ఇక్కడి కుటుంబాలందరికీ సరిపోగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రారంభించారు. అక్కడి అవసరానికి తగ్గట్టుగా మన జిల్లా నుంచే బియ్యం సార్టెక్స్ చేసి ప్యాకింగ్‌ల్లో 13 వేల టన్నుల బియ్యాన్ని పంపించే ఏర్పాటు చేశా సాక్షి : నాణ్యమైన బియ్యానికి, ఇప్పుడు ఇస్తున్న బియ్యానికి తేడా ఏమిటి? సాక్షి ముద్రణ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, వివిధ విభాగాల సిబ్బంది జేసీ: ఇప్పుడు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పరిశీలిద్దాం, ఆ బియ్యాన్ని నిల్వ చేయడానికి సాంకేతికంగా చేసే ఏర్పాటుతో కొంత పౌడర్లా బియ్యానికి పట్టి ఉంటుంది. దాని వల్ల ఇప్పుడిస్తున్న బియ్యం వాసన కూడా వస్తుంటాయి.అదే త్వరలో పంపిణీ చేసే బియ్యం పూర్తి నాణ్యతతో కూడుకుని ఉంటుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. సాక్షి : నాణ్యమైన బియ్యం ఎలా వస్తుంది? అందుకు కారణమేమిటి? జేసీ: బియ్యం బజార్లో కిలో రూ.60 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ షాపుల వద్ద నుంచి అందించే బియ్యాన్ని దగ్గర పెట్టి పరిశీలిస్తే బజార్లో దొరికే బియ్యం కన్నా రేషన్ షాపుల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని సార్టెక్స్ చేసి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి ప్రింటింగ్ యూనిట్లో పేపరు నాణ్యతను ఆసక్తిగా గమనిస్తున్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సాక్షి : కొత్తగా రేషన్ కార్డులు ఎన్ని ఇస్తున్నారు. వారికి ఎంత మేరకు బియ్యం అవసరమవుతాయంటారు. జేసీ: జిల్లాలో 16.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి స్థానే త్వరలో బియ్యం కార్డులు అందజేస్తాం. లక్ష కొత్తకార్డులు వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ 25 వేల టన్నులు బియ్యం అవసరమని అంచనా వేస్తున్నాం. రేషన్ కార్డు ఇది వరకు బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడేది. ఇప్పుడు రైస్ కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ కార్డుపై బియ్యం మాత్రమే ఇస్తారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ఒక కార్డు ఇవ్వనున్నారు. కనుక బియ్యం అవసరం ఉంటేనే బియ్యం కార్డు ఇస్తారు. సాక్షి : ఇంటింటా బియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనుకుంటున్నారు. జేసీ: ఏప్రిల్ నుంచి జిల్లాలో ఇంటింటా బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
అన్నదాత ఇంట ఐఏఎస్
సాక్షిప్రతినిధి, విజయనగరం :ఐఏఎస్... దీనిని సాధించాలని ఎంతోమంది కలలు గంటారు. అన్ని అవకాశాలూ... పరిస్థితుల ప్రోత్సాహం... ఆర్థిక స్థితిగతులూ... తోడున్నా... అందుకోవడం కష్టమే. కానీ ఇవన్నింటికీ దూరంగా... కేవలం స్వశక్తితో పోరాడి ఐఏఎస్ అందుకున్నవారు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే డాక్టర్ జి.లక్ష్మీశ. నాలుగొందల మంది జనాభా ఉన్న కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లి పెంపకంలో ఐఏఎస్‌గా ఎదిగారాయన. ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా గిరిజన ప్రాంతంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడున్నర దశాబ్దాల ఐటీడీఏకు 52 మంది పీఓలు పనిచేశారు. వారంతా సగటున ఏడాదికి 20 రోడ్లు కనెక్ట్ చేస్తే లక్ష్మీశ ఒకే ఏడాదిలో 200 రోడ్లతో గిరిజన ప్రాంతాలను కనెక్ట్ చేయగలిగారు. ఇలాంటి విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ నేపథ్యం నుంచి... కర్ణాటక రాష్ట్రంలోని ఆలుగొండనహళ్లి మా గ్రామం. జనాభా కేవలం 400 మంది. ఓటర్ల సంఖ్య అందులో సగం. నాన్న గంగముత్తయ్య రైతు. చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. అమ్మ లక్ష్మమ్మ. నేను, అన్నయ్య, ముగ్గురు అక్కలు. అందరినీ అమ్మ చాలా కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ నాది. ట్రైనింగ్ కర్నూలులో పూర్తిచేసుకుని నూజివీడులో మొదటి అపాయింట్మెంట్. తరువాత పార్వతీపురం ఐటీడీఏ పీఓగా. నాది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. అగ్రికల్చర్లో పీహెచ్‌డీని బెంగళూరులో పూర్తి చేశా. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లా. ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పూర్తి చేశా. ఐఎఫ్ఎస్లో మూడు సంవత్సరాలున్నా. హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేశాను. కుటుంబానికి దగ్గరగాఉండాలని అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేశా. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో లిటరేచర్ చదివిన జ్ఞానేశ్వరిని 2014లో పెళ్లి చేసుకున్నాను. తను నాకు పూర్తి సపోర్ట్. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకొస్తే ఒక్కోసారి రాత్రికి గానీ ఇంటికి చేరం. నా విధినిర్వహణను నా భార్య అర్ధం చేసుకుంటుంది. మా ఇద్దరికీ ప్రాణం మూడేళ్ల మా పాప ఆద్వీ. ఇక్కడే అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది. చిన్నప్పటి నుంచీ విలువలు నేర్పాలనేది నా ఉద్దేశం. నిజాయితీగా పనిచేయాలనే... ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా నిధులు వినియోగించుకోలేకపోతే వెనక్కి వెళ్లిపోతాయి. అందువల్ల కలెక్టర్ అనుమతితో మెటీరియల్ కోసం కొంత నగదు అడ్వాన్స్ గా తీసుకుని ఉంచాం. కానీ పనులు చేయకుండానే డబ్బులు తీసేసుకున్నారంటూ కొందరు నిందలు వేశారు. వారికి వివరించా. నేను వచ్చాక ఐటీడీఏలో కొందరు ఉద్యోగులను సరెండర్ చేశా. మరికొందరిని సస్పెండ్ చేశా. బాగా పనిచేసిన వారికి ప్రమోషన్స్ ఇచ్చి పంపిం చా. మొదట్లో నేను బాగా పనిచేయలేదని చెప్పిన గిరిజన నాయకులే ఇప్పుడు పొగుడుతున్నారు. మలేరియా మరణాల నుంచి ఉపశమనం గిరిజన గ్రామాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. నేను రాకముందు పది మంది పిల్లలు ఒకే ఏడాది చనిపోయారు. మలేరియా వస్తే ఇక్కడి స్కూళ్లల్లో పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. అక్కడ వైద్యం చేయిం చకుండా భూత వైద్యుల్ని ఆశ్రయిస్తారు. అందుకే జ్వరం వస్తే పిల్లల్ని ఇంటికి పంపించవద్దని ఆదేశాలిచ్చా. ఉపాధ్యాయుల్నే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నా. 2007లో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోనే మలేరియా ఎక్కువగా వచ్చింది. కానీ ఒక్కరూ చనిపోలేదు. 2018వ సంవత్సరంలో పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేశాం, దోమతెరలు ఇచ్చాం. ఛాలెంజ్‌గా చేశాం. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు సిక్టర్లు ఇచ్చి దోమ తెరను పంపిణీ చేసినప్పుడు దానిని ఆ ఇంటికి అంటించాలని చెప్పాం. మొన్న జిఎల్‌పురం వెళ్లి చూస్తే ఇంటి ముందు అది కనిపించింది. రాష్ట్రంలో 88 శాతం మలేరియా తగ్గింది మన విజయనగరం జిల్లాలోనే. గతేడాది జిల్లాలో 1230 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 230 కేసులే నమోదయ్యాయి. రహదారులపైనే దృష్టి ఇరవై ఏళ్ల క్రితం పార్వతీపురం ఎలా ఉందో ఈ రోజూ అలానే ఉంది. స్టేడియం ప్రొపోజల్ ఉంది. దానికి ల్యాండ్ చూశాం. ఆరెకరాల స్థలం ఒకేచోట దొరకడం లేదు. తోటపల్లి దగ్గర ఉన్న స్థలం టిట్కో వాళ్లు తీసుకున్నారు. నియోజకవర్గంలోనే ఉండాలి కాబట్టి సీతానగరం, బలిజిపేటలో ల్యాండ్ చూడమని చెప్పాం. గిరిజన ప్రాంతంలో 450 రోడ్లు కనెక్ట్ చేసిస్తే ఐటీడీఏలో మొత్తం గిరిజన గ్రామాలు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం అంబులెన్సు Ðð వెళ్లే విధంగా 200 రోడ్లు కనెక్ట్ అయ్యాయి. ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే రూ.5 కోట్లవుతుంది. అలాగే ఏజెన్సీలో రోడ్డు విషయంలో ఫారెస్టు వారి సమస్య కూడా ఉంది. సుమారు 50 రోడ్లు ఫారెస్టు వారి అండర్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం మీద 773 కిలోమీటర్ల మార్గాన్ని కనెక్ట్ చేశాం. రోడ్డు కోసం అవసరమైతే మెషీన్ కట్టింగ్‌కు ఫర్మిషన్ తీసుకున్నాను. రూ. 219 కోట్లతో పనులు ప్రారంభించాం. మెటల్ ప్రొబ్లమ్ వస్తే అధికారులందరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాం. ఆగస్టు నాటికి అన్ని రోడ్లూ క¯ðనెక్ట్ చేస్తాం. కాఫీ తోటలకు శ్రీకారం చింతపండు, మొవ్వ, నరమామిడి చెక్కలు జీసీసీకే ఇచ్చేవారు. ఇప్పుడు వేరే వారికి ఇస్తున్నారు. దళారి ఎక్కువ రేటు ఇస్తున్నాడు. కానీ రెండు కిలోలను ఒక కిలోగా చూపిస్తాడు. ప్రతీ జీసీసీ డీపోలో డిజిటల్ కాటా ఇచ్చాం. చింతపండు, ఉసిరి కాయల్లో పిక్కలు తీసి ప్యాకింగ్ చేయడంలో తర్ఫీదు ఇస్తున్నాం. జీసీసీ ప్రారంభమై 50 సంవత్సరాలైంది. సరైన మార్కెటింగ్, శ్రద్ధ లేక ఇలా ఉంది. మన ఏజెన్సీలో ఇప్పుడిప్పుడే 200 ఎకరాల్లో గిరిజనులు సొంతంగా కాఫీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి 400 ఎకరాల్లో కాఫీ సాగు చేయడానికి ఐటీడీఏ తరపున ఏర్పాట్లు చేస్తున్నాం. గర్భిణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిరివర గ్రామం నుంచి గర్భిణిని డోలీలో మోసుకుని రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తాం. ఈ లోగా ఏదోఒకటి చేయాలనుకుని బెర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు వైటీసీలో గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేశాం. ఇప్పుడు సాలూరు, కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో విస్తరించాం. డెలివరీకి నెల ముందు గాని రెండు నెలలు ముందుగాని తోడుగా కుటుంబ సభ్యులను తీసుకువచ్చి మరీ గర్భిణులను ఇక్కడ ఉండమన్నాం. వచ్చిన వారికి మూడు పూటల తిండి పెడుతున్నాం. 24 ఫీడర్ అంబులెన్సులు తీసుకువచ్చాం. ఇప్పటి వరకు 2,500 మందికి సేవలందించాం. రోడ్డు, మొబైల్ నెట్వర్క్ ఉంటేనే గిరిజనులకు మేలు జరుగుతుంది. ‘గిరినెట్’ ను ప్రతీ గ్రామానికి ఇవ్వడానికి చూస్తున్నాం. మార్కొండపుట్టి, కోనవలసలో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఫోన్ వెసులుబాటు కల్పిస్తున్నాం. చదువుతోనే చైతన్యం ఐటీడీఏ పరిధిలో 55 స్కూళ్లున్నాయి. 18 హాస్టళ్లున్నాయి. 45 శాతం మంది చెప్పేది మెనూ సరిగ్గా అమలు చేయడం లేదని, అందుకే స్కూల్ లెవెల్ అధికారిని నియమించి ఆ స్కూల్ బాధ్యత అప్పగించాం. అక్కడ మెనూ మార్చాం. కరెక్ట్‌గా అమలు చేయాలని చెప్పాం. ఎవరైతే పనిచేయరో వారిమీద చర్యలు తీసుకుంటున్నాం. -
ఎయిర్‌పోర్ట్‌కి భూములిస్తే రాజధానిలో స్థలాలు
నూజివీడు : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చిన వారికి రాజధాని ప్రాంతంలో ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివేశన స్థలం రెసిడెన్షియల్ ఏరియాలోను, 450 గజాలు కమర్షియల్ ఏరియాలో ఇస్తామని సబ్‌కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 1,229 ఎకరాల భూములను ల్యాండ్ ఫూలింగ్ విధానంలో సేకరిస్తున్నామని, ఇప్పటివరకు 30 ఎకరాలు సేకరించామని అన్నారు. గన్నవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన 11 గ్రామాలలో భూసేకరణ జరుపుతున్నట్లు ఆయన వివరించారు. ముందు ఇచ్చిన వారికి ప్రాధాన్యతాక్రమంలో స్థలాలను కేటాయిస్తామన్నారు. గృహాలు కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అద్దెకు ఉన్న వారికి వడ్డీలేని రుణాలను రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. ఏలూరు కాలువ మళ్లింపులో భూములు కోల్పోతున్న రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకోవాలన్నారు. నావిగేషన్‌కు అనువుగా ఈ కాలువను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 120 మీటర్ల వెడల్పున కాలువ నిర్మాణం ఉంటుందని, లోపలి భాగం 60 నుంచి 70 మీటర్లు ఉంటుందని, రెండు వైపులా కట్టలను నిర్మించి దానిపై రోడ్లు నిర్మిస్తారని చెప్పారు. ప్రగతిని అడ్డుకోవాలని చూస్తే చర్యలు తీసుకుంటామన్నారు.