కొండలు, గుట్టలు దిగి కాలినడకన వెళుతున్న ఐటీడీఏ పీఓ డాక్టర్ లక్ష్మీశ
సాక్షిప్రతినిధి, విజయనగరం :ఐఏఎస్... దీనిని సాధించాలని ఎంతోమంది కలలు గంటారు. అన్ని అవకాశాలూ... పరిస్థితుల ప్రోత్సాహం... ఆర్థిక స్థితిగతులూ... తోడున్నా... అందుకోవడం కష్టమే. కానీ ఇవన్నింటికీ దూరంగా... కేవలం స్వశక్తితో పోరాడి ఐఏఎస్ అందుకున్నవారు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే డాక్టర్ జి.లక్ష్మీశ. నాలుగొందల మంది జనాభా ఉన్న కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తల్లి పెంపకంలో ఐఏఎస్‌గా ఎదిగారాయన. ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా గిరిజన ప్రాంతంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడున్నర దశాబ్దాల ఐటీడీఏకు 52 మంది పీఓలు పనిచేశారు. వారంతా సగటున ఏడాదికి 20 రోడ్లు కనెక్ట్ చేస్తే లక్ష్మీశ ఒకే ఏడాదిలో 200 రోడ్లతో గిరిజన ప్రాంతాలను కనెక్ట్ చేయగలిగారు. ఇలాంటి విశేషాలు ఆయన మాటల్లోనే..
వ్యవసాయ నేపథ్యం నుంచి...
కర్ణాటక రాష్ట్రంలోని ఆలుగొండనహళ్లి మా గ్రామం. జనాభా కేవలం 400 మంది. ఓటర్ల సంఖ్య అందులో సగం. నాన్న గంగముత్తయ్య రైతు. చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు. అమ్మ లక్ష్మమ్మ. నేను, అన్నయ్య, ముగ్గురు అక్కలు. అందరినీ అమ్మ చాలా కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ నాది. ట్రైనింగ్ కర్నూలులో పూర్తిచేసుకుని నూజివీడులో మొదటి అపాయింట్‌మెంట్. తరువాత పార్వతీపురం ఐటీడీఏ పీఓగా. నాది సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీని బెంగళూరులో పూర్తి చేశా. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లా. ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పూర్తి చేశా. ఐఎఫ్‌ఎస్‌లో మూడు సంవత్సరాలున్నా. హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేశాను. కుటుంబానికి దగ్గరగాఉండాలని అక్కడి నుంచి ఇక్కడకు వచ్చేశా. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో లిటరేచర్ చదివిన జ్ఞానేశ్వరిని 2014లో పెళ్లి చేసుకున్నాను. తను నాకు పూర్తి సపోర్ట్. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకొస్తే ఒక్కోసారి రాత్రికి గానీ ఇంటికి చేరం. నా విధినిర్వహణను నా భార్య అర్ధం చేసుకుంటుంది. మా ఇద్దరికీ ప్రాణం మూడేళ్ల మా పాప ఆద్వీ. ఇక్కడే అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతోంది. చిన్నప్పటి నుంచీ విలువలు నేర్పాలనేది నా ఉద్దేశం.
నిజాయితీగా పనిచేయాలనే...
ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా నిధులు వినియోగించుకోలేకపోతే వెనక్కి వెళ్లిపోతాయి. అందువల్ల కలెక్టర్ అనుమతితో మెటీరియల్ కోసం కొంత నగదు అడ్వాన్స్ గా తీసుకుని ఉంచాం. కానీ పనులు చేయకుండానే డబ్బులు తీసేసుకున్నారంటూ కొందరు నిందలు వేశారు. వారికి వివరించా. నేను వచ్చాక ఐటీడీఏలో కొందరు ఉద్యోగులను సరెండర్ చేశా. మరికొందరిని సస్పెండ్ చేశా. బాగా పనిచేసిన వారికి ప్రమోషన్స్ ఇచ్చి పంపిం చా. మొదట్లో నేను బాగా పనిచేయలేదని చెప్పిన గిరిజన నాయకులే ఇప్పుడు పొగుడుతున్నారు.
మలేరియా మరణాల నుంచి ఉపశమనం
గిరిజన గ్రామాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. నేను రాకముందు పది మంది పిల్లలు ఒకే ఏడాది చనిపోయారు. మలేరియా వస్తే ఇక్కడి స్కూళ్లల్లో పిల్లల్ని ఇంటికి పంపిస్తారు. అక్కడ వైద్యం చేయిం చకుండా భూత వైద్యుల్ని ఆశ్రయిస్తారు. అందుకే జ్వరం వస్తే పిల్లల్ని ఇంటికి పంపించవద్దని ఆదేశాలిచ్చా. ఉపాధ్యాయుల్నే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నా. 2007లో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలోనే మలేరియా ఎక్కువగా వచ్చింది. కానీ ఒక్కరూ చనిపోలేదు. 2018వ సంవత్సరంలో పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేశాం, దోమతెరలు ఇచ్చాం. ఛాలెంజ్‌గా చేశాం. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు సిక్టర్లు ఇచ్చి దోమ తెరను పంపిణీ చేసినప్పుడు దానిని ఆ ఇంటికి అంటించాలని చెప్పాం. మొన్న జిఎల్‌పురం వెళ్లి చూస్తే ఇంటి ముందు అది కనిపించింది. రాష్ట్రంలో 88 శాతం మలేరియా తగ్గింది మన విజయనగరం జిల్లాలోనే. గతేడాది జిల్లాలో 1230 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 230 కేసులే నమోదయ్యాయి.
రహదారులపైనే దృష్టి
ఇరవై ఏళ్ల క్రితం పార్వతీపురం ఎలా ఉందో ఈ రోజూ అలానే ఉంది. స్టేడియం ప్రొపోజల్ ఉంది. దానికి ల్యాండ్ చూశాం. ఆరెకరాల స్థలం ఒకేచోట దొరకడం లేదు. తోటపల్లి దగ్గర ఉన్న స్థలం టిట్కో వాళ్లు తీసుకున్నారు. నియోజకవర్గంలోనే ఉండాలి కాబట్టి సీతానగరం, బలిజిపేటలో ల్యాండ్ చూడమని చెప్పాం. గిరిజన ప్రాంతంలో 450 రోడ్లు కనెక్ట్ చేసిస్తే ఐటీడీఏలో మొత్తం గిరిజన గ్రామాలు కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం అంబులెన్సు Ðð వెళ్లే విధంగా 200 రోడ్లు కనెక్ట్ అయ్యాయి. ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే రూ.5 కోట్లవుతుంది. అలాగే ఏజెన్సీలో రోడ్డు విషయంలో ఫారెస్టు వారి సమస్య కూడా ఉంది. సుమారు 50 రోడ్లు ఫారెస్టు వారి అండర్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం మీద 773 కిలోమీటర్ల మార్గాన్ని కనెక్ట్ చేశాం. రోడ్డు కోసం అవసరమైతే మెషీన్ కట్టింగ్‌కు ఫర్మిషన్ తీసుకున్నాను. రూ. 219 కోట్లతో పనులు ప్రారంభించాం. మెటల్ ప్రొబ్లమ్ వస్తే అధికారులందరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాం. ఆగస్టు నాటికి అన్ని రోడ్లూ క¯ðనెక్ట్ చేస్తాం.
కాఫీ తోటలకు శ్రీకారం
చింతపండు, మొవ్వ, నరమామిడి చెక్కలు జీసీసీకే ఇచ్చేవారు. ఇప్పుడు వేరే వారికి ఇస్తున్నారు. దళారి ఎక్కువ రేటు ఇస్తున్నాడు. కానీ రెండు కిలోలను ఒక కిలోగా చూపిస్తాడు. ప్రతీ జీసీసీ డీపోలో డిజిటల్ కాటా ఇచ్చాం. చింతపండు, ఉసిరి కాయల్లో పిక్కలు తీసి ప్యాకింగ్ చేయడంలో తర్ఫీదు ఇస్తున్నాం. జీసీసీ ప్రారంభమై 50 సంవత్సరాలైంది. సరైన మార్కెటింగ్, శ్రద్ధ లేక ఇలా ఉంది. మన ఏజెన్సీలో ఇప్పుడిప్పుడే 200 ఎకరాల్లో గిరిజనులు సొంతంగా కాఫీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి 400 ఎకరాల్లో కాఫీ సాగు చేయడానికి ఐటీడీఏ తరపున ఏర్పాట్లు చేస్తున్నాం.
గర్భిణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సిరివర గ్రామం నుంచి గర్భిణిని డోలీలో మోసుకుని రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ గ్రామానికి రోడ్డు సమస్య ఉంది. ప్రిన్సిపల్ సెక్రెటరీతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తాం. ఈ లోగా ఏదోఒకటి చేయాలనుకుని బెర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు వైటీసీలో గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేశాం. ఇప్పుడు సాలూరు, కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో విస్తరించాం. డెలివరీకి నెల ముందు గాని రెండు నెలలు ముందుగాని తోడుగా కుటుంబ సభ్యులను తీసుకువచ్చి మరీ గర్భిణులను ఇక్కడ ఉండమన్నాం. వచ్చిన వారికి మూడు పూటల తిండి పెడుతున్నాం. 24 ఫీడర్ అంబులెన్సులు తీసుకువచ్చాం. ఇప్పటి వరకు 2,500 మందికి సేవలందించాం. రోడ్డు, మొబైల్ నెట్‌వర్క్ ఉంటేనే గిరిజనులకు మేలు జరుగుతుంది. ‘గిరినెట్’ ను ప్రతీ గ్రామానికి ఇవ్వడానికి చూస్తున్నాం. మార్కొండపుట్టి, కోనవలసలో ఫైబర్ గ్రిడ్ ద్వారా ఫోన్ వెసులుబాటు కల్పిస్తున్నాం.
చదువుతోనే చైతన్యం
ఐటీడీఏ పరిధిలో 55 స్కూళ్లున్నాయి. 18 హాస్టళ్లున్నాయి. 45 శాతం మంది చెప్పేది మెనూ సరిగ్గా అమలు చేయడం లేదని, అందుకే స్కూల్ లెవెల్ అధికారిని నియమించి ఆ స్కూల్ బాధ్యత అప్పగించాం. అక్కడ మెనూ మార్చాం. కరెక్ట్‌గా అమలు చేయాలని చెప్పాం. ఎవరైతే పనిచేయరో వారిమీద చర్యలు తీసుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment