అర్హులెవరికీ అన్యాయం జరగదు  | Joint Collector Lakshmi shah Special Interview In Sakshi | Sakshi
Sakshi News home page

అర్హులెవరికీ అన్యాయం జరగదు 

Published Wed, Feb 12 2020 8:32 AM | Last Updated on Wed, Feb 12 2020 8:32 AM

Joint Collector Lakshmi shah Special Interview In Sakshi

జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ

సాక్షి, రాజమహేంద్రవరం: అర్హత ఉన్న ఏ ఒక్కరికీ ఏ పథకంలోనూ అన్యాయం జరగదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం అంతే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జిల్లా వాసులకు సరిపడా బియ్యం అందించడమే కాకుండా మరో రెండు జిల్లాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటంత సామర్థ్యం జిల్లాకు ఉందన్నారు. ‘కాఫీ విత్‌ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజానగరం ‘సాక్షి’ ప్రచురణ కార్యాలయానికి విచ్చేసిన ఆయనతో ‘సాక్షి’తో జరిపిన చిట్‌చాట్‌..  

సాక్షి : రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాలో పనిచేయడంపై మీ అభిప్రాయం. 
జేసీ: తూర్పుగోదావరి పెద్ద జిల్లా. అన్ని రంగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.  
సాక్షి :ఈ జిల్లాలో పనిచేసే అధికారులు ఎలా ఫీలవుతుంటారు. 
జేసీ: ఏ ఉద్యోగి అయినా ఈ జిల్లాలో పని చేస్తే దేశంలో ఏ జిల్లాలోనైనా అత్యంత సమర్థంగా, ఏ రంగంలోనైనా మంచి అనుభవంతో పని చేయవచ్చు.

సాక్షి ఎడిటోరియల్‌ విభాగంలో జరిగే కార్యకలాపాలను జేసీ లక్ష్మీశకు వివరిస్తున్న ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ కృష్ణారావు, బ్యూరో చీఫ్‌ ఎల్‌.శీనివాస్‌
సాక్షి : ఐఏఎస్‌ అధికారులు ఎవరైనా ఈ జిల్లాలో పనిచేయాలనుకుంటారు. మీరేమనుకుంటున్నారు. 
జేసీ: పెద్ద జిల్లా కావడంతో పాటు భౌగోళికంగా అన్ని ప్రాంతాలు ఉండడంతో ఎక్కువ అవగాహన కోసం ఉపయోగపడుతుంది. తీర, గిరిజన ప్రాంతాలు మంచి ఆహ్లాదకరంతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చేవిగా ఉండడంతో జిల్లాను మంచి అభివృద్ధి చేసే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. 
సాక్షి :ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటి? 
జేసీ: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, నవరత్న పథకాల అమలుకు జిల్లా నలుమూలల పర్యటించి ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా కృషి చేస్తున్నాం. 
సాక్షి :గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? 

ప్రచురణ యంత్రాల వివరాలు జేసీకి వివరిస్తున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌ రామకృష్ణ, చిత్రంలో బ్రాంచి మేనేజర్‌ రమేష్‌ రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది ​​​​​​​
జేసీ: జిల్లాలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తోంది. అవనీతికి తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరి కొద్ది రోజులు నడిస్తే అన్నింటికీ వలంటీర్ల వ్య వస్థ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.  
సాక్షి : రాష్ట్రానికి అన్నపూర్ణగా పిలిచే జిల్లా నుంచి బియ్యం జిల్లా వాసులందరికీ సరిపోతుందంటారా? 
జేసీ: జిల్లాలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో బియ్యం ఇక్కడి కుటుంబాలందరికీ సరిపోగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రారంభించారు. అక్కడి అవసరానికి తగ్గట్టుగా మన జిల్లా నుంచే బియ్యం సార్టెక్స్‌ చేసి ప్యాకింగ్‌ల్లో 13 వేల టన్నుల బియ్యాన్ని పంపించే ఏర్పాటు చేశా
సాక్షి : నాణ్యమైన బియ్యానికి, ఇప్పుడు ఇస్తున్న బియ్యానికి తేడా ఏమిటి? 

సాక్షి ముద్రణ  కార్యాలయ ఆవరణలో జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, వివిధ విభాగాల సిబ్బంది​​​​​​​
జేసీ: ఇప్పుడు ప్రభుత్వం అందించే బియ్యాన్ని పరిశీలిద్దాం, ఆ బియ్యాన్ని నిల్వ చేయడానికి సాంకేతికంగా చేసే ఏర్పాటుతో కొంత పౌడర్‌లా బియ్యానికి పట్టి ఉంటుంది. దాని వల్ల ఇప్పుడిస్తున్న బియ్యం వాసన కూడా వస్తుంటాయి.అదే త్వరలో పంపిణీ చేసే బియ్యం పూర్తి నాణ్యతతో కూడుకుని ఉంటుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నా. 
సాక్షి : నాణ్యమైన బియ్యం ఎలా వస్తుంది? అందుకు కారణమేమిటి? 
జేసీ: బియ్యం బజార్‌లో కిలో రూ.60 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేషన్‌ షాపుల వద్ద నుంచి అందించే బియ్యాన్ని దగ్గర పెట్టి పరిశీలిస్తే బజార్‌లో దొరికే బియ్యం కన్నా రేషన్‌ షాపుల నుంచి ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని సార్టెక్స్‌ చేసి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం.

సాక్షి ప్రింటింగ్‌ యూనిట్‌లో పేపరు నాణ్యతను ఆసక్తిగా గమనిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ  ​​​​​​​
సాక్షి : కొత్తగా రేషన్‌ కార్డులు ఎన్ని ఇస్తున్నారు. వారికి ఎంత మేరకు బియ్యం అవసరమవుతాయంటారు. 
జేసీ: జిల్లాలో 16.50 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటి స్థానే త్వరలో  బియ్యం కార్డులు అందజేస్తాం. లక్ష కొత్తకార్డులు వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ 25 వేల టన్నులు బియ్యం అవసరమని అంచనా వేస్తున్నాం. రేషన్‌ కార్డు ఇది వరకు బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడేది. ఇప్పుడు రైస్‌ కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ కార్డుపై బియ్యం మాత్రమే ఇస్తారు. ప్రతి ప్రభుత్వ పథకానికి ఒక కార్డు ఇవ్వనున్నారు. కనుక బియ్యం అవసరం ఉంటేనే బియ్యం కార్డు ఇస్తారు.  
సాక్షి : ఇంటింటా బియ్యం ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనుకుంటున్నారు. 
జేసీ: ఏప్రిల్‌ నుంచి జిల్లాలో ఇంటింటా బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement