ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జాయింట్‌ కలెక్టర్‌ | G Lakshmisha Take Charge As East Godavari District Joint Collector | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జాయింట్‌ కలెక్టర్‌

Published Mon, Jul 1 2019 12:29 PM | Last Updated on Mon, Jul 1 2019 12:29 PM

G Lakshmisha Take Charge As East Godavari District Joint Collector - Sakshi

సాక్షి, కాకినాడ సిటీ(తూర్పు గోదావరి) : ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన కర్తవ్యమని జిల్లాకు కొత్త జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి.లక్ష్మీశ అన్నారు. ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. తన అనుభవాలను, మనోభావాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 
మాది కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని హాళుగుండనహాళీ అనే చిన్న పల్లెటూరు. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నా తల్లిదండ్రులు లక్ష్మమ్మ, గంగముత్తయ్య వ్యవసాయం చేస్తుంటారు. ఒక అన్న, ముగ్గురు సిస్టర్స్‌ ఉన్నారు. నా బాల్యం అంతా కర్నాటకలోనే సాగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేసి అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేశాను. అమ్మ కోరిక మేరకు ఐఏఎస్‌ చదివేందుకు ఢిల్లీ వెళ్లాను. అక్కడే ఉండి ఐఏఎస్‌ పరీక్ష కోసం చదివాను. 2010లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యాను. అదే సమయంలో వ్యవసాయశాఖ కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో సైంటిస్టుగా పోస్టింగ్‌ వచ్చింది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలన్నా, అమ్మ ఆశయం నెరవేరాలన్నా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసే కరెక్ట్‌ అని భావించి దానిలో చేరాను. అయితే అమ్మ కోరిక ప్రకారం ఐఏఎస్‌కు ఎంపిక కావాలనే ఆశయంతో మరోమారు ప్రయత్నించాను. ఇలా నాలుగో సారి 2013 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం సాకారమైంది.

జేసీగా తూర్పులోనే తొలి పోస్టింగ్‌ 
2013లో ఐఏఎస్‌గా ఎన్నిక అయిన తరువాత మొట్టమొదటిగా కర్నూలు జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా చేరాను. అనంతరం నూజివీడులో సబ్‌ కలెక్టర్‌గా పని చేశాను. అక్కడ నుంచి 2016లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వెళ్లాను. అక్కడ పని చేస్తుండగా బదిలీ చేయడంతో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చాను. నూజివీడులో సబ్‌ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల భూమిని ఫిల్లింగ్‌ చేశాను. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి 1,400 ఎకరాలు  సేకరించాం. కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఇన్‌చార్జిగా పని చేశాను. జిల్లాను పూర్తి అవగాహన చేసుకుంటాను. మెరుగైన సేవల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అమలు చేస్తున్న నవరత్న పథకాలను పేద వర్గాల ప్రజలకు నేరుగా చేరేందుకు కృషి చేస్తాను. 

భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి 
జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతాను. రైతులు నిత్యం ఎదుర్కొనే భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్, ఒకరి భూమి మరొకరి పేరిట ఆన్‌లైన్‌ చేయడం, భూమి కొలతలు, చుక్కల భూములు తదితర అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకున్న అనంతరం రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ  జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.  సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు చేపడతాం. 

పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా 
కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, తొండంగి తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములను సేకరించారు. ఆ భూములను పరిశీలించి   పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. అదే విధంగా సివిల్‌సప్లైస్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం. రైతులు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యం మేరకు పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం, పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర సరుకులు నేరుగా పేద ప్రజలకు చేరేందుకు చర్యలు తీసుకుంటాం. 


వ్యవసాయ ప్రధానమైన జిల్లాలో పని చేయడం  అదృష్టం 
వ్యవసాయ ప్రధానమైన,  ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాలో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అదే ఉద్దేశంతో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివి పీహెచ్‌డీ చేశాను. రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం బాగుంటుందని నేను నమ్మడంతో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా పేద రైతుకు చేరేలా ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తాను. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో అవినీతిరహిత పాలన సాగిస్తూ, ప్రభుత్వం  అందించే సంక్షేమాన్ని పేదలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. అధికారులు కూడా అందుకు అనుగుణంగానే పనిచేయాలి. ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తా.  ప్రజలకు జవాబుదారీగానే పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రెవెన్యూలో అనేక రకాల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా పని చేస్తాం.

అమ్మ చెప్పింది..
అమ్మ నన్ను ఓ ఉన్నతమైన వ్యక్తిగా, పది మందికి సేవ చేసే వాడిగా చూడాలనుకొంది. బాగా చదువుకుంటేనే అది సాధ్యమవుతుందనుకున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఆదర్శంగా తీసుకుని, అమ్మ ఆశయం నెరవేర్చాలని భావించాను. పేదరికంలో ఉన్నా నేను ఉన్నతస్థాయికి వెళ్లి పేదలకు సేవలు చేయాలన్న అమ్మ కోరికను నెరవేర్చాలని సంకల్పించుకున్నాను. ఒక్క ఐఏఎస్‌తోనే అది సాధ్యమని భావించాను. సాధించాను.
–డి.లక్ష్మీశ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement