పరిగి: తాము పండించిన మక్కలు, ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. రైతులు పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు.. వాళ్ల రాబడికి ఎసరు పెడుతున్నాయి. మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు(అడ్తిదారులు)గా పనిచేస్తున్న వారే వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి రైతులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే క్వింటాలుకు రూ.200 నుంచి రూ. 300 తక్కువైనా అడ్తాదారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతు లు మద్దతు ధర దక్కే పరిస్థితి కన్పిం చడం లేదు. పరిగిలో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి అటు కొనుగోలు కేంద్రాలకు, ఇటు పరిగి వ్యవసాయ మార్కెట్లో అడ్తీదారుల వద్దకు వస్తున్న రైతు ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం.
మార్కెట్‌కు ఒక్కరోజే నాలుగు వేల క్వింటాళ్ల మక్కలు..
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు పరిగిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి 15రోజులైంది. వేల కొలది ఖాళీ సంచులు సైతం అందుబాటులో ఉంచారు. ఐదారుగురు సిబ్బంది, కూలీలను కొనుగోలు కేంద్రం వద్ద ఉంచుతున్నారు. కానీ 15 రోజుల్లో కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చి విక్రయించిన మక్కలు కేవలం 500 క్వింటాళ్లు మాత్రమే.
అదే గత శుక్రవారం ఒక్కరోజే ఆ పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో అడ్తీల వద్దకు 4వేల క్వింటాళ్ల మక్కలు వచ్చాయి. కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.1,310 చెల్లిస్తుండగా.. మార్కెట్లో రూ.1000 నుంచి రూ.1,150 మాత్రమే ఇస్తున్నారు. రైతులు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నారు. ఇప్పటికే రైతులు ఇలా రూ.10 లక్షల వరకు నష్టపోయారు. అధికారికంగా మాత్రమే ఈ లెక్కులు. పరిగిలో జీరో మార్కెట్ నిర్వహిస్తున్నందున.. ఆ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది.
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడమే కారణం
రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా అడ్తీదారులకు విక్రయిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందక పోవడానికి ఈ సారి బ్యాంకులు రుణాలివ్వకపోవటమే ప్రధాణ కారణంగా చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు అడ్తాదారుల వద్ద, ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్ద అప్పులు తీసుకోవాల్సి వచ్చింది.
దీంతో తప్పని పరిస్థితితో పండించిన పంటను అడ్తీదారుల వద్దకు తీసుకు వెళ్లి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అప్పులు ఇచ్చిన అడ్తీదారులు, వ్యాపారులు పండించిన పంటను తమకే విక్రయించాలని ముందే కండీషన్ పెట్టడడంతోపాటు వందకు నెలకు రూ. మూడు.. అంతకంటే ఎక్కువ వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రంలో సవాలక్ష నిబంధనలు..
మొక్కజొన్నలు, ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనేక నిబంధనలు పెట్టింది. తేమశాతం మొక్కజొన్నలకు 14, ధాన్యానికి 17 ఉండాలనే నిబంధన ఉంది. ఏమాత్రం తేమశాతం ఎక్కువగా ఉన్నా కొనడం లేదు. బీ, సీ గ్రేడ్ మక్కులు సైతం కొనుగోలు చేస్తామని ప్రకటించినా వాటిని రెండో, మూడో గ్రేడ్‌లలోకి నెట్టేస్తున్నారు.
ఒక వేళ తేమ శాతం నిర్దేశించిన విధంగా ఉండి కొనుగోలు చేసినా డబ్బులు 15 రోజుల తర్వాత చెల్లిస్తారు. ఒక్కోసారి నెలలు పడుతుంది. పండించిన ఉత్పత్తులు తమవేనని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలి. ఇవన్నీ దాటుకుని కొనుగోలు కేంద్రంలో విక్రయించినా.. డబ్బులు చెక్కురూపంలో ఇస్తారు. ఆ చెక్కును మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే అధికారులు పాత బకాయిల కింద జమచేసుకుంటారనే భయం. ఇవన్నీ రైతులకు మద్దతు ధరను దూరం చేయడంతోపాటు వ్యాపారుల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి.
మాకే అమ్మాలె!
Published Tue, Nov 11 2014 1:18 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement