బూర్గంపాడు: రబీ ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో నిరీక్షిస్తున్నారు. రబీ పంట చేతికంది 20 రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించనే లేదు. మార్కెట్‌కు, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పంట దిగుబడి పెరిగింది. గత ఇరవై రోజులుగా జిల్లా వ్యాప్తంగా వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. రైతులు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవటంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
సరైన వసతులు లేక ఇక్కట్లు..
పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో చాలా ప్రాంతాలలో రబీ వరికోతలు ప్రారంభమయ్యాయి. ఒక్క బూర్గంపాడు మార్కెట్ యార్డులోనే సుమారు 70 లారీల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆరు రోజుల క్రితం ప్రారంభించారు. అయితే జియో ట్యాంగింగ్ ప్రక్రియ పూర్తికాలేదని ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇరవై రోజులుగా ధాన్యం అమ్మకాలు కాకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత తొందరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల హడావిడిలో జిల్లా అధికార యంత్రాంగం తలమునకలైంది. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులకు కూడా ఎన్నికల విధులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినందున ఇకనైనా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
20 రోజులైనా కొనుగోళ్లు లేవు
మార్కెట్‌యార్డుకు వడ్లు తీసుకొచ్చి 20 రోజులైంది. ఎప్పుడు కొంటారో తెలియటం లేదు. రేయింబవళ్లు యార్డులో కాపలా కాస్తున్నాం. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం పాడవుతుందేమోనని భయమేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – కైపు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం
అడిగేవారే లేరు
యాసంగి వడ్లు అడిగే వారే లేరు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొదలు కాలేదు. పది రోజులు నుంచి వడ్ల అమ్మకాలకు ఎదురుచూస్తున్నాం. అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి నాలుగు రోజులైన ఇప్పటి వరకు కేజీ వడ్లు కొనలేదు. – పేరం రామాంజిరెడ్డి
ధాన్యం కొనుగోళ్లకు చర్యలు
ఈ రబీలో సుమారు 30 వేల టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్నికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం కొంత ఆలస్యమైంది. ఒకట్రెండురోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. పీఏసీఎస్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తాం. – లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి
Comments
Please login to add a commentAdd a comment