Andhra Pradesh Government Issued Above 16 Lakh New Ration Cards Within 13 Months - Sakshi
Sakshi News home page

Ration Card: రి‘కార్డు’ వేగం

Published Mon, Jul 26 2021 2:22 AM | Last Updated on Mon, Jul 26 2021 5:40 PM

Andhra Pradesh Govt Issued above 16 lakh new ration cards in 13 months - Sakshi

సాక్షి, అమరావతి: వివాహితుడైన వీర వెంకటశివ విడిగా రేషన్‌ కార్డు కావాలని గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా నిరాశే మిగిలింది. ఇప్పుడు 15 రోజుల్లోనే ఆయన చేతికి బియ్యం కార్డు వచ్చింది. రెండేళ్ల పాటు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన స్వరూప వలంటీర్‌ సాయంతో సచివాలయంలో కార్డు అందుకుంది. అర్హులైనప్పటికీ మంజూరు కాక నిస్పృహకు గురైన ఎంతోమంది పేదలు ఇప్పుడు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దే బియ్యం కార్డులు అందుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

సంతృప్త స్థాయిలో..
అర్హులైన ఎందరో పేదలు గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డుకు కూడా నోచుకోలేదు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ముడుపులు చెల్లించినా ఫలితం దక్కలేదు. వివాహం తరువాత విడిగా కాపురాలు ఉంటున్న లక్షల మంది గోడును టీడీపీ సర్కారు ఆలకించలేదు. ఎంతసేపూ కార్డులను ఎలా తగ్గించాలనే అంశంపైనే దృష్టి పెట్టి పేదలకు పట్టెడన్నం పెడదామనే ఆలోచనే చేయలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇలాంటి కష్టాలను స్వయంగా చూశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్‌ నవశకం ద్వారా వలంటీర్లతో ఇంటింటి సర్వేను నిర్వహించారు. బియ్యం కార్డు అర్హత ఆర్ధిక పరిమితి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.పది వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్‌ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేకుండా బియ్యానికి ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేశారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో కొత్త బియ్యం కార్డులను మంజూరు చేశారు. అంతే కాదు.. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా వెంటనే పరిశీలించి బియ్యం కార్డు మంజూరు చేసేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు చేశారు. 


నిర్దిష్ట వ్యవధి నిర్ణయించి అమలు..
సంక్షేమ పథకాల అమల్లో గత ఏడాది జూన్‌ 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా బియ్యం, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి స్థలం మంజూరుకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ధారించి పక్కాగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 13 నెలల వ్యవధిలో గత ఏడాది జూన్‌ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై 15వతేదీ వరకు 16.45 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులను మంజూరు చేశారు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే అర్హులకు బియ్యం కార్డు మంజూరు చేయాలనే నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో పేదలకు కొత్త బియ్యం కార్డులతో పాటు పెళ్లి తరువాత వేరు కాపురం ఉంటున్న దంపతులకు కొత్త కార్డులు సకాలంలో మంజూరవుతున్నాయి. అలాగే వారికి పిల్లలు పుట్టినా లేదా తల్లిదండ్రులు గతంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ ఇప్పుడు వారి వద్దకు వచ్చినా సరే పేర్లను నమోదు చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు కార్డు మంజూరు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల గత రెండేళ్లపైగా ఎక్కడా రేషన్‌ కార్డు లేదని, ఇవ్వడం లేదనే మాటే వినిపించడం లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులకు వారి గ్రామాల్లోనే సచివాలయాల్లో కార్డులు మంజూరు అవుతున్నాయి.

పది రోజుల్లోనే...
వివాహం కావడంతో రేషన్‌ కార్డు కోసం గ్రామ వలంటీరును సంప్రదించా. సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు దరఖాస్తు అందచేసిన పది రోజుల్లోనే కార్డు మంజూరైందని తెలియడంతో ఆశ్చర్యం కలిగింది. రేషన్‌కార్డుతో పాటు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఉపాధిహామీ జాబ్‌ కార్డులు కూడా వారం వ్యవధిలోనే  మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలా కార్డులు అందిన దాఖలాలు లేవని అంతా చెబుతున్నారు.
–తామరి రాధాకృష్ణ, చింతలవీధి, పాడేరు మండలం, విశాఖ జిల్లా

15 రోజుల్లోనే వచ్చింది...
నాకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు అబ్బాయిలు. గత ప్రభుత్వ హయాంలో మా కుటుంబానికి విడిగా రేషన్‌ కార్డు కోసం ఎంతో ప్రయత్నించా. జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగినా పని కాలేదు. ఇప్పుడు వలంటీర్‌ మా ఇంటికి వచ్చి దరఖాస్తు చేయించారు. 15 రోజుల్లోనే రేషన్‌ కార్డు మంజూరు కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. 
– గుర్రాల వీర వెంకట శివ, ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా

రెండుసార్లు రాని కార్డు 27 రోజుల్లోనే..
రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 27 రోజుల్లోనే మంజూరైంది. టీడీపీ హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఏడాది పాటు ప్రదక్షిణలు చేసినా రేషన్‌ కార్డు రాలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్‌ మా ఇంటికే వచ్చి దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసిన 27 రోజుల్లోనే సచివాలయంలో కార్డు అందుకున్నా.
–ఈ. స్వరూప (జోగంపేట, నర్సీపట్నం నియోజకవర్గం, విశాఖ జిల్లా)

అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉండగలం?
గతంలో ఎప్పుడూ వివాహం తరువాత వేరు కాపురం ఉంటున్న వారికి కొత్తగా కార్డులు మంజూరు చేయలేదు. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడుతుందన్న వాదనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విభేదించారు. వివాహం అయిన తరువాత విడిగా ఉంటున్న వారు అర్హులా..  కాదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హులేనని తెలియచేయడంతో వారికి కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భారం పడుతోందనే సాకుతో అర్హులకు ఇవ్వకుండా ఎలా ఉంటామని సీఎం ప్రశ్నించారు. దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. కంప్యూటర్‌ డేటా ప్రకారం పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.     
– కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement