మొబైల్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే | AP Govt has directed district officials to ensure that mobile vehicles go door-to-door and distribute Ration goods | Sakshi
Sakshi News home page

మొబైల్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే

Published Thu, Feb 11 2021 5:16 AM | Last Updated on Thu, Feb 11 2021 8:46 AM

AP Govt has directed district officials to ensure that mobile vehicles go door-to-door and distribute Ration goods - Sakshi

సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’ పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. వాహనదారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విదితమే. ప్రస్తుతం పట్టణాల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవడంతోపాటు సరుకుల పంపిణీ స్పీడును మరింత పెంచాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. లోపాలను వెంటనే సరిదిద్దుకునేలా వాహనదారులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 29,783 రేషన్‌ షాపులుండగా.. వీటిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 7,426 షాపుల పరిధిలోనే ప్రస్తుతం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 13.08 లక్షల కుటుంబాలకు 2.14 కోట్ల కిలోల నాణ్యమైన బియ్యం, 12.09 లక్షల కిలోల చక్కెర, 7.09 లక్షల కిలోల కందిపప్పు పంపిణీ చేశారు.

‘ఇంటింటికీ రేషన్‌’పై తీర్పు వాయిదా 
‘ఇంటింటికీ రేషన్‌’ పథకం అమలుకు బ్రేక్‌ వేస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తన తీర్పును వాయిదా వేశారు. అంతకుముందు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని పట్టణ ప్రాంతంలో అడ్డుకోలేదని తెలిపారు. ఈ పథకం కింద నిత్యవసరాల పంపిణీ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాల రంగులపై ఫిర్యాదు అందాయని, వాటిని పరిశీలించి, తటస్థ రంగులను వేయాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌ చెప్పిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ స్పందిస్తూ.. పేదలకు నిత్యావసర సరుకులను అందించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనిని కమిషన్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. పేదలకు నిత్యావసరాలు అందించడం చాలా ముఖ్యమని సింగిల్‌ జడ్జి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement