సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ఉచితంగా ఇస్తున్న సరుకులు అర్హులందరికీ అందాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వర్ పని చేయలేదనే సాకు చెబుతూ షాపులు మూసేసి తప్పించుకునేందుకు వీల్లేదని హెచ్చరించింది. ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా రేషన్ డీలర్లు షాపుల వద్దే వేచి ఉండాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో చాలావరకు డీలర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు, పట్టణ ప్రాంతాల్లో 6 గంటలకే ఈ–పాస్ మిషన్ ఆన్ చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఉచిత సరుకులు పంపిణీ చేస్తున్నారు.
మోసాలకు చెక్ పెట్టడంతో షాపులకు తాళం
లాక్‌డౌన్ పరిస్థితుల్లో నెలకు రెండుసార్లు చొప్పున రాష్ట్రంలో పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలతో ఒక్కో కార్డుదారుడికి ప్రతిసారీ కేజీ శనగలు/కందిపప్పు, కార్డులోని ఒక్కో సభ్యుడికి 5 కేజీల బియ్యం అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 16వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. అయితే చాలామంది డీలర్లు కందిపప్పు/శనగలు పంపిణీ చేయకుండా పేదలను మోసం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మోసాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో లబ్ధిదారుల నుండి బియ్యం ఇచ్చినప్పుడు ఒకసారి, కందిపప్పు/శనగలకు మరోసారి బయోమెట్రిక్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో కొందరు డీలర్లు షాపులను సరిగా ఓపెన్ చేయకుండా.. ఈ–పాస్ యంత్రాలు పని చేయడం లేదని, నెట్‌వర్క్ సమస్య ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
లబ్ధిపొందిన కుటుంబాల వివరాలు..
సర్కారు హెచ్చరికలతో దారికి..
ఈ–పాస్ మిషన్లు ఉదయం 5.30 గంటలకే ఆన్ చేయాలని, ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించడంతో డీలర్లు దారికొచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన హెచ్చరికల కారణంగా.. పంపిణీ ప్రారంభించిన రెండురోజుల్లోనే 30.38 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు అందాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4,07,857 కుటుంబాలకు పంపిణీ చేశారు.
రేషన్ డీలర్లు సహకరించాలి
ఉచితంగా పంపిణీ చేస్తున్న సరుకులు కార్డున్న ప్రతి ఒక్కరికీ అందాల్సిందే. రెండుసార్లు బయోమెట్రిక్‌తో కొంత ఇబ్బంది ఉన్నా.. సరుకులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పేద ప్రజల ప్రయోజనం దృష్ట్యా రేషన్ డీలర్లు కూడా సహకరించాలి.
–కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment