
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు పెంచేస్తున్నారంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇలాంటివి నాలుగు వందల వరకు వచ్చాయి. వీటితో పాటే రేషన్ బియ్యం సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 సాయం ఎప్పటిలోగా వేస్తారన్న అంశాలపైనా అధికంగా ఫోన్‌లు చేశారు. రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాలశాఖ 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్, 040–23447770 ల్యాండ్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచే ఫోన్‌లు మొదలయ్యాయని వినియోగదారుల ఫోరం డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక ఫిర్యాదులను క్రోడీకరించి జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లా అధికారుల పరిశీలనకు పంపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.