
సాక్షి, అమరావతి: 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఉచిత సరుకుల పంపిణీ అక్టోబర్ 31 వరకు 14 విడతల్లో కార్డులో పేరు నమోదైన ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం, కార్డుకు కిలో కందిపప్పు/కిలో శనగలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది.
బియ్యానికి ఒకసారి పప్పుకు మరోసారి బయోమెట్రిక్ వేస్తే మోసాలను అరికట్టవచ్చని భావించి అక్టోబర్‌లో రెండవ విడత పంపిణీ నుంచి అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు. దీంతో పక్కాగా లబ్ధిదారులకు సరుకులు అందాయి. 2సార్లు బయోమెట్రిక్ వేయడం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 14వ విడతలో 1.19 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ఆయా కుటుంబాలకు 18.80 కోట్ల కిలోల బియ్యం, 1.19 కోట్ల కిలోల శనగలు పంపిణీ చేశారు.