సాక్షి, అమరావతి: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏప్రిల్ నెల కోటా నుంచి నెలకు రెండుసార్లు చొప్పున బియ్యంతో పాటు శనగలు లేదా కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా ఇప్పటికి 15 విడతలు పంపిణీ చేసింది. ఇక చివరిసారిగా ఈ నెల 19 నుంచి సరుకుల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్రస్థాయి అధికారులు ఆదేశించారు. అయితే ఈసారి పేదలకు మరింత పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గోధుమలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు నెలకు రెండుసార్లు చొప్పున ప్రతి బియ్యం కార్డుదారుడికి కేజీ శనగలు లేదా కందిపప్పు, కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడతలో కుటుంబానికి కిలో బియ్యం తగ్గించి ఆ మేరకు గోధుమలు ఇవ్వనున్నారు.
శ్రీకాకుళం మినహా..
శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో కార్డుకు కిలో చొప్పున గోధుమలు ఇస్తారు. ఇప్పటికే 10 వేల టన్నులను జిల్లాలకు తరలించారు. ఆహారపు అలవాట్లలో భాగంగా కొందరు చపాతీ తింటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గోధుమలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,70,217 కార్డులున్నాయి. వీటిలో ఆహార భద్రతా చట్టం కింద 89,40,407 కార్డులు, ఆ చట్టం పరిధిలోకి రానివి 63,29,810 కార్డులు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం మోస్తూ పేదలకు ఉచితంగా సరుకులు ఇస్తోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క బియ్యంపైనే దాదాపు రూ.1,700 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీసం 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నెలకు రెండుసార్లు చొప్పున పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయడం రికార్డు.
గోధుమల పంపిణీతో పేదలకు ప్రయోజనం...
గోధుమలు ఉచితంగా పంపిణీ చేయడం వల్ల పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం. 16వ విడత పంపిణీ తర్వాత ఇక ఉచితం ఉండదు. డిసెంబర్ నెల నుంచి బియ్యం, ఇతర సరుకులు సబ్సిడీపైనే ఇస్తాం. జనవరి నుండి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసే ప్రక్రియ వేగవంతం చేస్తాం.
– కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment