డబ్బులు ఊరికే వస్తాయి!
డబ్బులు ఊరకే రావు... బాగా పాపులర్ అయిన ఓ వాణిజ్య ప్రకటన. కానీ ప్రస్తుతం డబ్బులు ఊరకే వస్తున్నాయి! ప్రతి ఊరికీ వెళ్తున్నాయి!!రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాదాపు రెండు వారాల్లోనే కట్టలకు కట్టలు డబ్బు పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. ఇంకా నామినేషన్లు కూడా మొదలు కాకముందే ఓట్ల కొనుగోలు కోసం ప్రజలకు పంపిణీ చేయడానికి డబ్బు పంపిణీ మొదలైంది. డబ్బుతోపాటు ఫ్రీబీస్ (ఉచిత బహుమతులు) సైతం పంపిణీ అవుతున్నాయి. దీంతో వాటిని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది.
డబ్బు మాదిరిగా ఇవి భారీ మొత్తాల్లో పట్టుబడకపోవడానికి ఏవి ఫ్రీబీస్.. ఏవి కావు అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏవి ఉచితాలో పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ 26 అంశాలతో కూడిన జాబితాను జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఎన్నికల అధికారులకు పంపింది. తనిఖీల్లో పట్టుబడే ఉచితాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా వస్తువులు రవాణా అవుతున్నా లేదా భారీ స్థాయిలో గోదాముల్లో నిల్వ ఉన్నా తమకు తెలియజేయాలని పేర్కొంది.
యూపీఐ పేమెంట్లపైనా నిఘా..
డబ్బు పంపిణీ సైతం గతంలోలా నగదు రూపేణానే కాకుండా యూపీఐ (గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం) చెల్లింపుల ద్వారా కూడా భారీగా జరుగుతుండటంతో వాటిపైనా ఎన్నికల అధికారులు నిఘా వేశారు. ఆయా వివరాల కోసం ఆర్బీఐ, బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకే ఖాతా నుంచి ఎక్కువ లావాదేవీలు జరిగితే వివరాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు.
ఇప్పటివరకు రూ.307 కోట్లు స్వాదీనం
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 21వ తేదీ వరకు పట్టుకున్న నగదు, మద్యం, సరుకులు, ఫ్రీబీస్, తదితరాల మొత్తం విలువ రూ. 307 కోట్లు కాగా, వీటిల్లో ఫ్రీబీస్ విలువ రూ.26.93 కోట్లు.
వివిధ మార్గాల ద్వారా నిఘా..
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ చేపట్టినా అడ్డుకొనేందుకు నిఘా పెట్టాం. ఒకే ఖాతా నుంచి వందల మందికి ఒకే మొత్తంలో (ఉదాహరణకు రూ.500, 2,000, 5,000,10,000 చొç³్పున) గూగుల్‌పే/ఫోన్‌పే/పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతోందో లేదో పరిశీలిస్తాం. ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా నగదు జమ చేసినా పరిశీలిస్తాం. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపడతాం. – రోనాల్డ్‌రాస్, హైదరాబాద్ ఎన్నికల అధికారి
జాబితాలోని ఫ్రీబీస్ ఇవే..
1.సీలింగ్ ఫ్యాన్లు
2.ప్రెషర్ కుక్కర్లు
3. మిక్సర్లు, గ్రైండర్లు
4.చీరలు
5.కుట్టు మిషన్లు
6.స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు
7.ఎల్రక్టానిక్ వస్తువులు/టీవీ సెట్స్
8. గోడ గడియారాలు
9.క్రికెట్ కిట్స్
10. జ్యువెలరీ ఐటమ్స్
11.ఇతర క్రీడాపరికరాలు
12.బెడ్‌షీట్స్/టవల్స్
13.గడియారాలు
14.సైకిళ్లు, బైక్‌లు
15.కాస్మెటిక్స్
16. జిమ్ పరికరాలు
17. బంగారం లేదా వెండి పూత వస్తువులు (ఇమిటేషన్ జ్యువెలరీ)
18. కుంకుమ భరిణెలు
19. మొబైల్ ఫోన్లు
20. రెడీమేడ్ గార్మెంట్స్
21.స్కూల్ బ్యాగ్స్
22. టీషర్ట్స్
23. టార్చిలైట్లు
24. టాయ్స్
25. ట్రావెల్ బ్యాగ్స్/సూట్‌కేస్‌లు
26. గొడుగులు
- చెరుపల్లి వెంకటేశ్