ఆంధ్రాలో ‘అమ్మ’ వస్తువులు
తాడేపల్లి రూరల్: తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు అందించే ఉచిత వస్తువులు రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దర్శనమిస్తున్నాయి. ఆ వస్తువుల అమ్మకాలతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా ఆదాయ పన్ను శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటింటికీ మిక్సీ, ఫ్యాన్లు, గ్రైండర్లను అందజేస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రజలకు అందకుండానే తమిళనాడు-ఆంధ్రా సరిహద్దు దాటి నెల్లూరుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు చేరుకుంటున్నాయి. రోజువారీ కూలీల తో ఆ వస్తువులను విక్రయింపజేస్తున్నారు.
జాతీయ రహదారుల వెంట ముఖ్యంగా తాడేపల్లి పాత టోల్‌గేట్, మంగళగిరి-తెనాలి, గుంటూరు-పొన్నూరు, విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-ఏలూరు, విజయవాడ-బందరు రహదారుల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ వస్తువులను నెల్లూరుకు చెందిన చందు అనే వ్యక్తి లారీల ద్వారా ఇక్కడికి చేరవేస్తున్నట్లు తెలిసింది. తమకు గ్రైండర్‌ను రూ.1,100కు అందజేస్తే రూ.1,300కు, మిక్సీ రూ.600కు ఇస్తే రూ.700కు విక్రయిస్తున్నట్లు కూలీలు తెలిపారు. బుధవారం సేల్స్ టాక్స్ అధికారులమంటూ కొందరు తమ దగ్గరికి వచ్చారని, చందుకు ఫోన్ చేయగా రూ. 5 వేలు వారికి ఇవ్వమని చెప్పాడన్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా ఆదాయ పన్ను శాఖాధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.