పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రేషన్ షాపు వద్ద మార్కింగ్ వేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ఆహార ఇబ్బందులు లేకుండా పేదలకు భారీ ఊరట కల్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1.40 కోట్లకు పైగా రేషన్ కార్డులు కల్గిన లబ్ధిదారులకు నేటి నుంచి ఏప్రిల్ నెలాఖరులోగా మూడు సార్లు ఉచితంగా బియ్యం, కందిపప్పును పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. కార్డులో ఒక్కో మనిషికి గతంలో నెలకు 5 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ చివరికి ఒక్కో వ్యక్తికి 15 కిలోల బియ్యం అందుతుంది. అందుకు అదనంగా మూడు కిలోల కందిపప్పును కూడా అందిస్తారు.
నేటి నుంచి సరుకుల పంపిణీ
- ఏప్రిల్ నెల కోటా మొదటి విడత సరుకులను మార్చి 29వ తేదీ నుంచి (ఆదివారం) తీసుకోవచ్చు. రెండో విడత సరుకులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తారు.
- సరుకులను రేషన్ షాపుల్లో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పంపిణీ చేస్తారు.
- ఈ మేరకు రేషన్ షాపుల వద్ద పంపిణీకి సంబంధించిన సమయ పట్టికను డిస్‌ప్లే చేశారు.
- సరుకుల కోసం వచ్చే వారు ఒక్కొక్కరు కనీసం ఒక మీటర్ దూరంలో నిల్చునేలా ప్రత్యేకంగా మార్కింగ్ వేస్తున్నారు.
- వీఆర్వో/సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌తో లబ్ధిదారులకు సరుకుల పంపిణీ చేస్తారు.
- రేషన్ షాపుల వద్ద సబ్బు, శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుతారు.
- సరుకులు ఒకేసారి కాకుండా ప్లానింగ్ ప్రకారం లబ్ధిదారులందరికీ అందేలా చూస్తారు.
- కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్టు ప్రకటించినా, అది ఆహార భద్రతా పథకం ప్రకారం కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని కుటుంబాలకూ ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు అదనపు భారాన్ని భరించడానికి సిద్ధమైంది.
ఆందోళన వద్దు.. లబ్ధిదారులందరికీ సరుకులు..
సరుకులు అందుతాయో లేదో అనే ఆందోళన వద్దు. లబ్ధిదారులందరికీ సకాలంలో అందేలా ఏర్పాటు చేశాం. వీఆర్వో బయోమెట్రిక్ ద్వారానే సరుకులు పంపిణీ చేస్తాం. సరుకులు తీసుకునేందుకు అందరూ ఒక్కసారిగా వెళ్లకుండా రేషన్ షాపు వద్దకు నలుగురు చొప్పున వెళ్లి డీలర్లకు సహకరించాలి.
– కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment