సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరించి రైస్‌మిల్లులకు తరలించిందన్నారు. ఆలస్యంగా వరి నాట్లేయడం వల్ల ఎక్కడైనా రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 24 వరకూ సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
శనివారం ఇక్కడ మంత్రి గంగుల ఆ శాఖ అధికారులతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడి ఏయేటికాయేడు పెరుగుతోందన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అక్టోబర్ 21 నుంచి మొదలైన వానాకాలం పంట సేకరణ మూడునెలలకు పైగా నిరంతరాయంగా సాగిందని తెలిపారు.
మారుమూల ప్రాంతాల రైతులకు అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 7,024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.13,570 కోట్ల విలువైన 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9.76 లక్షలమంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఓపీఎంఎస్‌లో నమోదైన రైతులకు రూ.12,700 కోట్లు చెల్లించామని చెప్పారు.
పంజాబ్ తరువాత తెలంగాణనే..
దేశంలో పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే అత్యధిక ధాన్యం సేకరణ జరుగుతోందని మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రంలో 2014–15లో 11.04 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ గతేడాది 70.44 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ ఏడు బహిరంగ మార్కెట్లలో అత్యధిక ధర లభించడంతో రైతులు లాభసాటిగా ప్రైవేటుగా ధాన్యం విక్రయించుకోవడం సంతోషకర పరిణామమని అన్నారు.
ఈ సీజన్‌లో అత్యధికంగా నిజామాబాద్‌లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్లగొండలో 4.13, మెదక్‌లో 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2,264 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. కాగా, ఈ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment