సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోంది. రేషన్ కార్డులు కలిగిన పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్వర్ణ, మేలురకం ధాన్యం సేకరణకు పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో కలిసి వీరు నేరుగా కల్లాల వద్దకు వెళ్లి మంచి రకాలను గుర్తించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరిపారు.
2,000 కొనుగోలు కేంద్రాలు
రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు విక్రయించేందుకు వీలుగా 13 జిల్లాల్లో ప్రభుత్వం రెండు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యవర్తులు, దళారీల కారణంగా ధాన్యానికి ధర దక్కలేదనే పరిస్థితి ఎదురు కాకుండా ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2019–20 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 1,451 కేంద్రాల ద్వారా 15,02,869 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,59,751 మంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకున్నారు.
మద్దతు ధరపై విస్తృత ప్రచారం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు మద్దతు ధరపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ–పంటలో నమోదు కాని రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారిని అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో నిబంధనల్లో మార్పులు చేశారు. గతంలో 1:1గా ఉన్న బ్యాంకు గ్యారెంటీని 1:2కి సవరించారు.
రైతులకు 72 గంటల్లో చెల్లింపులు
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ధాన్యం విక్రయించిన రైతులకు కేవలం 72 గంటల్లోనే చెల్లింపులు జరుపుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.2,368 కోట్ల మేర చెల్లింపులు జరిపారు. దాదాపుగా 70 శాతం మేర ధాన్యం కొనుగోళ్లకు చెల్లింపులు చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నేరుగా 1902 నెంబర్ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చే అవకాశం కల్పించారు. తేమ శాతం పేరుతో జరిగే మోసాలను అరికట్టేందుకు తూనికలు కొలతల శాఖ అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మిల్లర్ల ద్వారా సిద్ధం చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి 1,600 టన్నులు, పౌరసరఫరాలశాఖకు 2.15 లక్షల టన్నులు అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment