ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు  | Rythu Bharosa centers itself Grain collection centers | Sakshi
Sakshi News home page

ఆర్బీకేలే ధాన్యం సేకరణ కేంద్రాలు 

Published Wed, Nov 10 2021 4:35 AM | Last Updated on Wed, Nov 10 2021 4:35 AM

Rythu Bharosa centers itself Grain collection centers - Sakshi

సాక్షి, అమరావతి: ఈసారి ఆర్బీకేలు కేంద్రంగా నూరుశాతం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.  ఈ ప్రక్రియలో పౌర సరఫరాల సంస్థతో పాటు మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిని చేసింది. గ్రేడ్‌ ‘ఏ‘ రకం ధాన్యాన్ని క్వింటాల్‌  రూ.1,960, సాధారణ రకం క్వింటాల్‌ రూ.1,940లకు  కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

సేకరణ లక్ష్యం 50 లక్షల టన్నులు..
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 39.35 లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసం 80 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో రూ.8,868 కోట్లతో 47.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఈసారి పలు సంస్కరణలు తీసుకొచ్చింది. 

ఇలా అయితేనే .. 
► తొలిసారి ఆర్బీకేలు వేదికగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ–క్రాప్‌తో పాటు రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) ప్రామాణికం  
► వరి సాగవుతున్న ప్రాంతాల్లో 6,884 ఆర్బీకేల్లో సేకరణ కేంద్రాలు  
► మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తొలిసారి వికేంద్రీకృత విధానం అమలు 
► ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏపీ మార్క్‌ఫెడ్, మిగిలిన పది జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థకు బాధ్యతలు  
► గతంలో మాదిరిగా ప్రత్యేక పోర్టల్‌లో రైతులు వివరాలను నమోదు చేసుకోనవసరం లేదు. 
► ఆర్బీకేల్లో ఉండే టెక్నికల్‌ సిబ్బంది కూపన్‌ ద్వారా ఎప్పుడు తీసుకురావాలో తెలియజేస్తారు. 
► కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉండేలా సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం 17 శాతానికి మించి ఉండకూడదు. 
► రైతులు విక్రయించిన ధాన్యం, వాటి విలువ తదితర వివరాలతో రసీదు తీసుకోవాలి. 
► రైతులకు 21 రోజుల్లో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. 
► ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మదలచిన రైతులు  సైతం తమ పంట వివరాలను ఆర్బీకేలో తప్పనిసరిగా నమోదు చేయాలి.  
► రోజువారీ పర్యవేక్షణకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా–రెవెన్యూ) చైర్మన్‌గా జిల్లా స్థాయిలో సేకరణ కమిటీ ఏర్పాటు. కమిటీలో మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్‌డీఏ, ఐటీడీఎలతో పాటు వేర్‌హౌసింగ్‌ ఏజెన్సీలు (సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ), ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీలు (ఎఫ్‌సీఐ, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌), సబ్‌– కలెక్టర్లు / ఆర్డీవోలు  సభ్యులు. 

కస్టమ్‌ మిల్లింగ్‌పై నిరంతర నిఘా  
ఆర్బీకేల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ సామర్థ్యం ప్రకారం కస్టమ్‌ మిల్లింగ్, సీఎంఆర్‌ డెలివరీ కోసం రైస్‌ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకోసం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించి రైసుమిల్లులు సంబంధిత ప్రొక్యూర్‌మెంట్‌ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతారు. కస్టమ్‌ మిల్లింగ్‌ కార్యకలాపాల ప్రక్రియను జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయడంలో కానీ, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడంలో కానీ విఫలమైన రైస్‌ మిల్లర్లను బ్లాక్‌లిస్ట్‌ పెట్టడంతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement