
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే కొన్ని పత్రికలు ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వారిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఖరీఫ్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కమిషనర్ చెప్పారు.
ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో..
ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించినట్లు గిరిజాశంకర్ తెలిపారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడపలో కూడా ఈ బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జనవరి 18 నుంచి రెండు నెలల (డిసెంబర్, జనవరి) ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు.
1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్
ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్‌లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వీరపాండియన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment