సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ బుధవారం ఒక్కరోజే రైతులకు రూ.922.19 కోట్లను చెల్లించింది. దీంతో రబీలో సేకరించిన రూ.6,634.63 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,344.93 కోట్లను చెల్లించినట్లయింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను పౌరసరఫరాల సంస్థ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసిన వెంటనే మిగతా రూ.289.7 కోట్లను చెల్లించేందుకు వీలుగా ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో చెల్లింపులు జరిపి దళారీలు, మిల్లర్ల మాయాజాలానికి తెరదించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ కళ్లాల వద్దే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల అటు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు ఇటు రవాణా ఖర్చుల రూపంలో రైతన్నలకు క్వింటాలుకు రూ.వంద వరకూ ఆదా అవుతోంది. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడకూదనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే చెల్లింపులు జరపాలన్న నిర్ణయాన్ని ధృఢ సంకల్పంతో మనసా వాచా కర్మణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
35.43 లక్షల టన్నుల కొనుగోలు..
రబీలో 21.75 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ధాన్యాన్ని సాధారణ రకం టన్ను రూ.1,868, ఏ–గ్రేడ్ రకం రూ.1,888 చొప్పున కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం ద్వారా మిల్లర్లు, వ్యాపారులు అదే ధరకు కొనాల్సిన పరిస్థితి కల్పించింది. బుధవారం వరకూ 35,43,909 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా దీని విలువ రూ.6,634.63 కోట్లు ఉంటుంది. ఇందులో మంగళవారం వరకూ రూ.5,422.74 కోట్లను చెల్లించగా బుధవారం ఒక్క రోజే రూ.922.19 కోట్లను చెల్లించింది. మిగతా రూ.289.7 కోట్లను కూడా వివరాలు అందిన వెంటనే రైతులకు చెల్లించేలా నిధులు విడుదల చేసింది.
రాష్ట్ర చరిత్రలో రికార్డు..
గత ఖరీఫ్‌లో రూ.8,868.05 కోట్ల విలువైన 47,32,852 టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రబీలో రూ.6,634.63 కోట్ల విలువైన 35,43,909 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే ఏడాదిలో రూ.15,502.68 కోట్ల విలువైన 82,76,761 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇక 2019–20లో రూ.15,036.67 కోట్ల విలువైన 82,56,761 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. అంటే గత రెండేళ్లలో ఏడాదికి సగటున రూ.15,269.67 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
నాడు దళారీలు చెప్పిందే ధర..
టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఏనాడూ సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అరకొర కొనుగోళ్లకూ చెల్లింపులు చేయకుండా మూడు నుంచి ఆర్నెళ్ల పాటు జాప్యం చేయడం ద్వారా దోపిడీకి బాటలు పరిచింది. దళారులు, మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల శ్రమను దోపిడీ చేశారు. ఐదేళ్లలో రూ.42,536.8 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే టీడీపీ సర్కార్ కొనుగోలు చేసింది. అంటే ఏడాదికి సగటున రూ.8,507.36 కోట్ల ధాన్యాన్ని మాత్రమే కొన్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సకాలంలో చెల్లించకుండా మిల్లర్లు, దళారీలు రైతులను దోచుకున్నారు. 2018–19 రబీలో కొనుగోలు చేసిన 27.52 లక్షల టన్నుల ధాన్యానికి చెల్లించాల్సిన రూ.4,838.03 కోట్లను నాడు చంద్రబాబు ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించి రైతులను ముంచేశారు. ఆ బకాయిలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రైతులకు చెల్లించారు.
ధాన్యం రైతులందరికీ సకాలంలో చెల్లించాం...
– కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ.
రబీలో కళ్లాల వద్దే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు రూ.6,344.93 కోట్లను చెల్లించాం. మిగతా రైతుల వివరాలను వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసిన వెంటనే చెల్లించేందుకు వీలుగా రూ.289.7 కోట్లను విడుదల చేశాం. కొన్న ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేశాం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో దళారీలు, మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతులకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది.
Andhra Pradesh : ధాన్యం రైతుకు దన్ను
Published Thu, Jul 29 2021 2:44 AM | Last Updated on Thu, Jul 29 2021 2:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment