సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో తొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వినియోగిస్తోంది. బియ్యం కాల నిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టు) ద్వారా పౌరసరఫరాల శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గతేడాది రెండు సీజన్లలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. తాజాగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ దేశమంతా ఈ విధానం అనుసరించేందుకు ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలు మిల్లర్లు ఇచ్చే బియ్యానికి తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్టు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
దోపిడీకి అడ్డుకట్ట..
సబ్సిడీ రేషన్ బియ్యాన్ని కొన్నిచోట్ల దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రైస్ మిల్లర్లు సబ్సిడీ బియ్యాన్ని కొనుగోలు చేసి పాలిష్ పట్టి సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు రీసైకిల్ చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటం, మిల్లింగ్ బియ్యం పాతవి కావడంతో గోడౌన్లలో స్టాక్ పురుగులు పట్టి ముక్కిపోతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైస్ ఏజ్ టెస్టు విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా తాజా మిల్లింగ్ బియ్యాన్ని కచ్చితంగా గుర్తిస్తుండటంతో రీసైకిల్ దందాకు తెరపడింది.
మిల్లర్ల సమక్షంలో శాంపిళ్ల పరీక్ష
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలించి కస్టమ్ మిల్లింగ్ చేయిస్తారు. అనంతరం బియ్యాన్ని గోడౌన్‌లలో భద్రపరుస్తారు. అయితే అంతకు ముందే అధికారులు బియ్యం నాణ్యత పరీక్షలను గోడౌన్ ప్లాట్‌ఫామ్‌ల వద్దే చేస్తున్నారు. 580 బస్తాలను (29 టన్నులు) ఒక లాటుగా పరిగణించి మిల్లర్ల సమక్షంలో శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు వస్తే తాజా మిల్లింగ్ బియ్యంగా పరిగణిస్తారు. లేదంటే లోడును మిల్లర్లకు తిప్పి పంపుతున్నారు.
ఎలా చేస్తారు?
మిథైల్ రెడ్, బ్రోయోథైమోల్ బ్లూ, ఇథైల్ ఆల్కహాల్, శుద్ధమైన నీటిని కలిపి ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేస్తారు. టెస్ట్‌ట్యూబ్‌లో 10 ఎంఎల్ మిశ్రమాన్ని తీసుకుని ఐదు గ్రాముల నమూనా బియ్యాన్ని కలపాలి. నిముషం తర్వాత బియ్యం రంగు మారుతుంది. ఆకుపచ్చగా మారితే తాజా మిల్లింగ్ బియ్యం (నెలలోపు మిల్లింగ్ చేసినవి) అని పరిగణిస్తారు. లేత ఆకుపచ్చ రంగులో మారితే ఒకటి నుంచి రెండు నెలలు, పసుపు రంగులో మారితే మూడు నెలలు, నారింజ రంగులోకి మారితే నాలుగు నుంచి ఐదు నెలల క్రితం మిల్లింగ్ చేసినవిగా నిర్ధారిస్తారు. పాత ధాన్యాన్ని మర పట్టిస్తే ఇబ్బంది ఉండదు. పాత బియ్యాన్ని కొత్తగా మిల్లింగ్ చేస్తే మాత్రం తెలిసిపోతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో..
మిల్లింగ్ అనంతరం బియ్యంలో నూకలు, రంగు, తేమ శాతాన్ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఈ యంత్రం విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుంది. సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయంతో పాటు విజయవాడ, ఏలూరు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
దేశంలో తొలిసారిగా..
రేషన్ బియ్యం దోపిడీని అరికట్టేందుకు ‘రైస్ ఏజ్ టెస్టింగ్’ విధానాన్ని దేశంలో మొదటి సారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ప్రయోగాత్మక ఫలితాల అనంతరం దేశమంతా దీన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. బియ్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుండటంతో బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట పడుతుంది. చౌక బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవచ్చు.
– వీరపాండియన్, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment