సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణ స్థాయిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, కమీషన్ మీద అమ్ముకునే చిరుదందా సాగించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను శాసించే బియ్యం లీడర్‌గా మారితే, రైస్ మిల్లులో పార్టనర్‌గా చేరి, ఆ రైస్ మిల్లుతో పాటు పలు ఇతర మిల్లులకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలించే లీడర్‌గా మరో వ్యక్తి మారి దందా సాగిస్తున్నారు.
హైదరాబాద్ పక్కనున్న ఓ పారిశ్రామిక జిల్లాలో రేషన్ డీలర్ స్థాయి నుంచి డీలర్ల సంఘానికే నాయకుడిగా ఎదిగిన మరో వ్యక్తి.. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నాడు. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరు చొప్పున రేషన్ బియ్యం దందా సాగించే ‘లీడర్లు’రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న పేదల బియ్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రతి నెలా రూ. వందల కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ ఈ దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పాత 10 జిల్లాల్లో కనీసంగా 20 మంది వ్యక్తులు ఈ బియ్యం దందాతో రూ. కోట్లు కూడబెట్టారని తెలుస్తోంది.
లక్షల్లో మామూళ్లు ..
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోని వివిధ హోదాల్లో ఉన్న వారి వరకు బియ్యం దందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, మామూళ్లు ఇవ్వలేని గ్రామ, మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
రెవెన్యూ అధికారులతోపాటు బియ్యం వాహనాలు రాష్ట్ర సరిహద్దులు దాటే మార్గంలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్లను ఈ వ్యాపారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బియ్యం వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేసే మరికొందరికి కూడా ఏనెలకు ఆనెల ఠంచన్‌గా మామూళ్లు ముడతాయని తెలుస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి మొదలైన జిల్లాల నుంచి సిరోంచకు బియ్యం రవాణా చేసే ఓ ‘వీరుడు’మామూళ్ల కిందనే నెలకు రూ.10 లక్షలకు పైగా ముట్ట చెపుతాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతనిపై 12 కేసుల వరకు ఉన్నాయి.
ఈ వ్యక్తి కాళేశ్వరం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఆస్తులు సంపాదించే స్థాయిలో బియ్యం దందా సాగిస్తున్నాడు. ఆసిఫాబాద్ రెబ్బెనకు చెందిన మరో ‘కిరణం’మీద 22 కేసులు ఉన్నప్పటికీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుంచి బియ్యం సేకరించి బల్లార్షా ప్రాంతంలోని వీరూర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు భాగస్వాములు పీడీఎస్ బియ్యం దందాలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటకకు..
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రేషన్ దుకాణం యజమాని సంఘం నాయకుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దందా సాగిస్తూ ‘రాజు’గా వెలిగిపోతున్నాడు. ఈ నాయకుడు తను దందా చేయడమే గాక, బియ్యం దందా సాగించే కొందరు రేషన్ డీలర్లకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ జిల్లాల నుంచి సేకరించిన బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులు దాటిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాకు మిల్లర్లతో పాటు అధికార పార్టీ నాయకుల అండ ఉన్నట్లు చెపుతున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మక్తల్, నారాయణపేట మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రీసైక్లింగ్‌కే ఎక్కువ
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా సాగించడంలో రైస్‌మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్లతోపాటు కొంతమంది ఏజెంట్లు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు కొంత మేర తరలిస్తుండగా భారీ ఎత్తున రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు కీలకమైన ఓ రైస్‌మిల్లర్ హస్తముందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పండిస్తున్న సన్నరకాలను రైస్‌మిల్లర్లు ఏ గ్రేడ్ రకం కింద సేకరిస్తూ, బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో ఏజెంట్లు, రేషన్‌డీలర్ల ద్వారా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యాన్ని లెవీ కింద తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి, అక్కడి నుంచి రేషన్‌షాపులకు, లబ్ధిదారులకు చేరుతుండగా, తిరిగి వారి నుంచి ఏజెంట్ల ద్వారా మళ్లీ రైస్‌మిల్లులకే చేరుతుండడం గమనార్హం.
మహబూబాబాద్‌లో ప్రజా ప్రతినిధి అండతో..
మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిల్లు, మరిపెడ మండలంలోని మరో రైస్ మిల్‌తో పాటు తొర్రూరు, కొత్తగూడ, కేసముద్రం కేంద్రాలుగా రేషన్ బియ్యం దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వాటాలు నిర్ణయించి.. దందా సాఫీగా సాగేలా చూస్తున్నాడని తెలుస్తోంది.
పీడీఎస్ డీలర్ల ద్వారా పేదల నుంచి కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనుగోలు చేసి మామిడి తోటలు, రైస్ మిల్లులు, గోదాముల్లో దాచిపెడుతూ ఆ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఈ దందాలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
పేదల బియ్యంతో కోట్లకు పడగ
Published Thu, Dec 1 2022 3:04 AM | Last Updated on Thu, Dec 1 2022 2:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment