అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జంగంపుట్టు గ్రామంలో రేషన్ బియ్యం తీసుకుంటున్న ప్రజలు
► ఈ ఫొటోలోని అవ్వ పేరు.. తెర్లి మహాలక్ష్మి. వయసు 75 ఏళ్లకు పైమాటే. ఈమెది పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం పెద్దూరు. 15 ఏళ్ల కిందట భర్త మరణించాడు. కుమార్తె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోవడం, కొడుకు ఉపాధి వెతుక్కుంటూ కుటుంబంతో కలిసి విశాఖపట్నానికి వలస పోవడంతో ఒంటరిగా చిన్నగదిలో కాలం వెళ్లదీస్తోంది. ఒంటిలో పని చేసే సత్తువ లేని తరుణంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన, ఫోర్టిఫైడ్ చౌక బియ్యమే అవ్వ ఆకలి తీరుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చే బియ్యం దొడ్డుగా, రాళ్లు, నూకలు ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం బాగుంటున్నాయని అవ్వ చెబుతోంది. తనకు నెలకు 20 కిలోల బియ్యంతోపాటు వృద్ధాప్య పింఛన్ కూడా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది.
► ప్రజలందరూ రేషన్ పంపిణీ వాహనం చుట్టూ చేరి రేషన్ తీసుకుంటున్న ఈ చిత్రం.. విశాఖ ఏజెన్సీలోని జంగంపుట్టులోనిది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీ 12 గ్రామాల్లోని ఓ పల్లె.. జంగంపుట్టు. గ్రామస్తులు ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే 9 కిలోమీటర్ల దూరంలోని రాయిమామిడికి వెళ్లాల్సి వచ్చేది. రేషన్ బియ్యం కోసం రోజు కూలి పోగొట్టుకుని కాలినడకన బయలుదేరి గుర్రాలపై బియ్యం మూటలను వేసుకొచ్చేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్డు వేయడంతో గుల్లేలు పంచాయతీలో రేషన్ డిపో వచ్చింది. ఇప్పుడు అన్ని గ్రామాలకు వాహనాల్లో రేషన్ సరుకులు వెళ్తున్నాయి. ప్రజలు వారి ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ తీసుకుంటున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి చెరగని బాటలు వేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో చేపట్టిన రేషన్ సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం చౌక డిపోల ద్వారా నాణ్యమైన రేషన్ బియ్యాన్ని.. అది కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందిస్తూ వారి ఆకలిని తీరుస్తోంది. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే పేదల పాలిట పరమాన్నమైంది.
వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో.. వాటినే రేషన్ దుకాణాల్లో అందించాలని సీఎం వైఎస్ జగన్‌ఆదేశించారు. దానికి అనుగుణంగా 2019 సెప్టెంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం 2021 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడంతోపాటు రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని కూడా ప్రారంభించారు.
ఇప్పుడది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌సింగ్ ప్రకటించారు. మరో 8 రాష్ట్రాలు సైతం ఈ విధానంపై అధ్యయనం చేస్తుండటం విశేషం.
రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు
రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యం అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేవలం 90 లక్షల కార్డులకు 1.54 లక్షల టన్నుల బియ్యాన్ని.. అది కూడా సాధారణ బియ్యాన్ని మాత్రమే అందిస్తోంది. మిగిలిన కార్డులకు అవసరమైన 77 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో కొనుగోలు చేసి పంపిణీ చేస్తోంది.
ఇందుకు ప్రభుత్వంపై నెలకు రూ.344 కోట్ల భారం పడుతోంది. ఇందులో నాణ్యమైన బియ్యాన్ని (సార్టెక్స్ చేసి) ఇచ్చేందుకు రూ.23.08 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,400 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. ఈ ఏడాది మరో రూ.4300 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం ఇస్తున్నప్పటికీ వాటి రవాణా, డీలర్ కమీషన్ తదితర ఖర్చుల కింద ఏడాదికి రూ.500 కోట్లకు పైనే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
ప్రజలకు దగ్గరై.. కష్టాలను దూరం చేసి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల ఇంటి వద్దే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రేషన్ దుకాణాల్లో గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది.
ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ యువతకు ఉపాధిని కల్పించారు. రేషన్ డోర్ డెలివరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితోపాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.
నెలలో 18 రోజులపాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా.. ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌరసరఫరాల శాఖ నెలకు ఆపరేటర్లకు సుమారు రూ.25 కోట్లు చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు ఇస్తున్నారు. దీంతో కొలతలపై ఫిర్యాదులు తగ్గడంతోపాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.
కష్టాలు తీరాయి..
గతంలో రేషన్ బియ్యం కావాలంటే మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన మసిమండ పంచాయతీలోని ఎండభద్రకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వచ్చేది. పైగా అక్కడ రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ లైన్లో నిల్చునేవాళ్లం. మా ఊరు గిరిశిఖరం కావడంతో బియ్యం మూటతో నడవడానికి చాలా అవస్థలు పడేవాళ్లం. జగనన్న వచ్చాక ఇంటి ముందుకే రేషన్ బండిని తెచ్చి బియ్యం ఇస్తున్నారు. ఒకప్పుడు రాళ్లు, పురుగులు ఉండే బియ్యాన్ని తినడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చక్కటి నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు.
– చోడి చింతమ్మ, కొమరాడ మండలం, లంజి గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా
తొలిసారిగా ఏపీలోనే రైస్ ఏజ్ టెస్టు
గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండటంతోపాటు ప్రజలు వాటిని వండుకోవడానికి, తినడానికి వీలుండేది కాదు. దీంతో చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి వెళ్లి తిరిగి రేషన్ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా బియ్యం కాలనిర్ధారణ పరీక్ష (రైస్ ఏజ్ టెస్టింగ్)ను ప్రవేశపెట్టింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద తప్పనిసరిగా రైస్ ఏజ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment