చెత్త లేని 'కొత్త నగరాలు' | 3 Years Of YS Jagan Government Swachh Survekshan Awards | Sakshi
Sakshi News home page

చెత్త లేని 'కొత్త నగరాలు'

Published Mon, May 30 2022 4:11 AM | Last Updated on Mon, May 30 2022 10:13 AM

3 Years Of YS Jagan Government Swachh Survekshan Awards - Sakshi

సాక్షి, అమరావతి: ఎక్కడపడితే అక్కడ చెత్త.. పూడుకుపోయిన కాల్వలు.. రోడ్లపై పారే మురుగు నీరు.. దుర్గంధంతో ముక్కు మూసుకు నడవాల్సిందే.. వీధుల్లో నివాసముండే వారికి చెత్త, మురుగు వాసనతో నిత్యం నరకం.. రెండున్నరేళ్ల క్రితం వరకు పట్టణాలు, నగర వాసుల దుస్థితి ఇది. ఇప్పుడు ఈ నగరాలు కొత్తగా కనిపిస్తున్నాయి. చెత్త, మురుగు, దుర్గంధం నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రజలు మంచి ఆరోగ్యకర వాతావరణంలో జీవించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనే దీనికి నాంది పలికింది.

ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌ 2న ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలబెట్టేందుకు పట్టణాలు, నగరాలను బిన్‌ ఫ్రీ, లిట్టర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీగా మార్చే చర్యలు చేపట్టింది. ఇందుకోసం చెత్తను ఇంట్లోనే సేకరించేందుకు ప్రతి ఇంటికీ చెత్త డబ్బాలు పంపిణీ చేసింది.

ఇలా 1.20 కోట్ల చెత్త డబ్బాలను అందించి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గార్బేజ్‌ స్టేషన్లకు తరలించేందుకు 4,220 వాహనాలను సమకూర్చింది. ఒకప్పుడు మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను పరిశుభ్ర ప్రాంతాలుగా మార్చింది. మురుగు నీటి శుద్ధికి ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. డంపింగ్‌ యార్డ్‌ల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త కుప్పలను తరలిస్తోంది. చెత్త ద్వారా సంపదను సృష్టిస్తోంది.

ఇందులో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేపట్టగా, మరికొన్నింటిని పబ్లిక్‌– ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానంలో చేపట్టింది. ఏడాది కాలంలోనే సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి పట్టణాలు, నగరాలకు కొత్త రూపును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో పలు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పలు నగరాలు జాతీయ స్థాయి అవార్డులను సైతం దక్కించుకున్నాయి.

ఇంటింటికీ చెత్త డబ్బాలు
గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్‌కిన్స్, సిరంజిలు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్‌ వ్యర్ధాలు) చెత్త వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్‌లను క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసింది. 124 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని సుమారు 40 లక్షల గృహాలకు రూ.80.17 కోట్లతో 1.20 కోట్ల చెత్త డబ్బాలు అందించింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తరలింపునకు మరింత శ్రద్ధ తీసుకుంటోంది.

ఇందుకోసం పీపీపీ విధానంలో 3,097 డీజిల్‌ ఆటో టిప్పర్లను పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చింది. రూ. 60 కోట్లతో మరో 1,123 ఎలక్ట్రిక్‌ ఆటోలను కొనుగోలు చేసింది. సేకరించిన చెత్తను శుద్ధి చేసేందుకు 124 మున్సిపాలిటీల్లో 243 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల (జీటీఎస్‌)ను రూ.227.89 కోట్లతో నిర్మిస్తోంది. వీటిలో కొన్ని పూర్తవగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ ఏజెన్సీల ద్వారా 72 మునిసిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌డబ్లూఎం) ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది.

పట్టణాలకు జాతీయ స్థాయిలో అవార్డులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా చర్యలతో నగరాలు చెత్త రహితంగా మారుతున్నాయి. 2021లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలు పోటీపడగా విజయవాడ అత్యుత్తమ పరిశుభ్రమైన నగరంగా మూడో స్థానంలో నిలిచింది. తిరుపతి, విశాఖపట్నం నగరాలు బెస్ట్‌ సిటీస్‌ ఇన్‌ పబ్లిక్‌ ఫీడ్‌బ్యాక్‌గా నిలిచాయి. దక్షణాదిలో పుంగనూరు సైతం బెస్ట్‌ సిటీగా అవార్డు దక్కించుకుంది.

నెల్లూరు పట్టణం సైతం సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బెస్ట్‌ గార్వేజ్‌ ఫ్రీ సిటీలుగా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలను ఎంపిక చేయగా విజయవాడ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించడం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. 2020లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 4,242 నగరాలు పోటీపడగా విజయవాడ, విశాఖ, తిరుపతి ఉత్తమ నగరాలుగా అవార్డులు సాధించాయి. 

చెత్త నుంచి సంపద తయారీ
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ నగరాల నుంచి నిత్యం 6,900 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. గతంలో నగరాలు, పట్టణాల్లో సేకరించిన ఘన వ్యర్థాలను డంపింగ్‌ యార్డుల్లో వేయడంతో ఆ ప్రాంతాల్లో  కొండలను తలపిం చేలా చెత్త గుట్టలు తయారయ్యాయి. పట్టణాల విస్తరణతో ఈ చెత్త గుట్టల చుట్టూ జనావాసాలు పెరిగాయి. చెత్త, దాని నుంచి వచ్చే దుర్వాసన ఆ ప్రాంతాలను కలుషితం చేస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మెరుగైన చర్యలు చేపట్టింది. మొత్తం 124 పట్టణ సంస్థల్లో పేరుకుపోయిన దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలిస్తోంది. అంతే కాకుండా ఇళ్ల నుంచి తెచ్చిన చెత్త నగరంలో ఎక్కడా పోగుపడకుండా 243 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను (జీటీఎస్‌) ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలోనే వివిధ రకాల చెత్తను వేరుచేసి ఎరువు, విద్యుత్‌ కోసం వినియోగిస్తున్నారు.

గుంటూరు, విశాఖపట్నం వద్ద చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్లు నిర్మించింది. వీటిలో ప్రతిరోజు 2,,335 మెట్రిక్‌ టన్నుల చెత్తను విద్యుత్‌ తయారీకి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్‌ రన్‌లో ఉన్న ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి 22 మెగావాట్ల విద్యుత్‌ అందుతుంది. మరో 2,650 మెట్రిక్‌ టన్నుల చెత్త నుంచి బయోగ్యాస్, ఎరువు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ద్రవ వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు 71 ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల (ఎఫ్‌ఎస్‌టీపీ)ను ఏర్పాటు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement