సాక్షి, అమరావతి: చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. 42 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జిల్లాల విభజన జరిగింది. చివరిసారిగా 1979 జూన్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో అప్పట్లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు.
అంతకుముందు 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన జిల్లాలు ప్రకాశం, విజయనగరం మాత్రమే. మిగిలిన 11 జిల్లాలు బ్రిటిష్ హయాంలో ఏర్పాటైనవే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. తెలంగాణ విడిపోయిన అనంతరం.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాలను విభజించింది. ఇప్పుడు కొత్త జిల్లాల్లో పరిపాలన సజావుగా సాగుతోంది. పాలన ప్రజలకు మరింత చేరువైంది.
పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలత, సెంటిమెంట్‌లకు పెద్దపీట
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించి రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చింది. 51 రెవెన్యూ డివిజన్లను 74కి పెంచి పరిపాలనకు మరింత వెసులుబాటు కల్పించింది. పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీగా విభజన ప్రక్రియ చేయడంతో అన్ని వర్గాల ఆమోదం లభించింది. విభజనకు ముందు ప్రభుత్వం విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసి పూర్తి శాస్త్రీయతతో నిర్ణయాలు తీసుకుంది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది.
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా జిల్లాలను విభజించింది. సాధ్యమైనంతవరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు రెవెన్యూ డివిజన్‌గా మార్చలేదు.
జిల్లాల విభజన సమయంలో చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఆ డివిజన్ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేశారు.
సంవత్సరాల ఆకాంక్షల మేరకు..
తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.
పాడేరు కేంద్రంగా ఆ జిల్లాను ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను నెరవేర్చింది. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బతినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది.
దానికి డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించింది. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది.
ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెట్టాలని చాలాకాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నెరవేరుస్తూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాగా కొనసాగించి దాని చారిత్రక ప్రాధాన్యతను నిలబెట్టారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన రాయచోటి ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment