సాక్షి, అమరావతి: నిత్యం నడిసంద్రంలో బతుకుపోరు సాగించే గంగపుత్రుల బెంగ తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో వారి అభివృద్ధికి బాటలు వేసింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా గంగపుత్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాదు.. మత్స్యరంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బెస్ట్ మెరైన్ స్టేట్–2021 అవార్డుతో పాటు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డులు వరించాయి.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సుడిగుండంలో చిక్కుకున్న నావలా మారిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చుక్కానిలా మారి ఒడ్డుకు చేర్చారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా 2018–19లో 39.92 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2021–22 సీజన్‌లో ఏకంగా 48.13 లక్షల టన్నులకు చేరాయి. ఈ ఉత్పత్తులు మూడేళ్లలో ఎనిమిది లక్షల టన్నుల మేర పెరిగాయి. రాష్ట్రంలో ఆక్వారంగంపై ఆధారపడి 2018–19లో 16.46 లక్షల మంది జీవనోపాధి పొందారు.
వారి సంఖ్య 2021–22 నాటికి 26.50 లక్షలకు పెరిగింది. మత్స్యకారులు, ఆక్వారైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 738 మంది మత్స్యసహాయకులను నియమించింది. మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ యాక్టుతో పాటు ఏపీ ఫిష్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. ఈ–ఫిష్ ద్వారా 4.49 లక్షల ఎకరాల ఆక్వాసాగును క్రమబద్ధీకరిస్తోంది. 6,854 మంది మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ ద్వారా రూ.11.41 కోట్ల రుణసాయం అందించింది. ఆర్బీకేల ద్వారా 13,945 మత్స్యసాగు బడుల నిర్వహణతో నాణ్యమైన దిగుబడులను పెంపొందించేందుకు ఆక్వారైతులకు శిక్షణ ఇచ్చింది.
సంక్షేమ పథకాలతో బాసట
టీడీపీ హయాంలో కుటుంబానికి రూ.2 వేల చొప్పున రెండేళ్లు, ఆ తర్వాత రూ.4 వేల చొప్పున మూడేళ్లు మత్స్య వేట నిషేధ భృతి ఇచ్చారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.104.62 కోట్ల భృతి అందజేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ మూడేళ్లలో రూ.418.08 కోట్లను మత్స్యకారులకు అందించింది. టీడీపీ హయాంలో నిషేధకాలం ముగిసిన తరువాత ఏడాదికిగానీ సొమ్ము అందేదికాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేట నిషేధకాలం ముగియకుండానే వారి ఖాతాల్లో జమచేస్తోంది.
బోట్లకు డీజిల్ లీటర్‌కు రూ.6.03 వంతున సబ్సిడీగా టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 460 బోట్లకు రూ.60.12 కోట్ల లబ్ధిచేకూర్చింది. ఈ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో 17,770 బోట్లకు రూ.89.17 కోట్ల లబ్ధికలిగించింది. గతంలో మాదిరి కాకుండా స్మార్ట్ కార్డుల ద్వారా సబ్సిడీ పోను మిగిలిన మొత్తం చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయే మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో 116 బాధిత కుటుంబాలకు రూ.11.60 కోట్ల సాయం అందించింది.
ఆక్వా చెరువులకు అందించే విద్యుత్ ధరను యూనిట్‌కు రూ.3.86 నుంచి రూ.1.50కు తగ్గించడమేగాక 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రూ.2,290.11 కోట్ల మేర ఆక్వారైతులు విద్యుత్ సబ్సిడీ ద్వారా లబ్ధిపొందారు. ఇక జీఎస్‌పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోయిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన 38,282 కుటుంబాలకు రూ.178.04 కోట్ల సాయం అందించింది.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ఇన్‌పుట్స్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తీరప్రాంతాల్లో రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. వీటికి ఐఎస్‌వో గుర్తింపు తీసుకొచ్చింది.
► పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్ద రూ.332 కోట్లతో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే రూ.100 కోట్లతో తొలిదశ పనులకు టెండర్లు కూడా పిలిచింది.
► రూ.3177కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. రూ.155 కోట్లతో విశాఖపట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్లను ఆధునికీకరిస్తోంది. వీటిద్వారా 76,230 మందికి ప్రత్యక్షంగా, 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
► 40 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను రూ.90.44 కోట్లతో పునరుద్ధరించడమేగాక రూ.86.95 కోట్లతో కొత్తగా 4 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తోంది.
► విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద రూ.36.55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం, గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపుపీత హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది.
► పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడి వద్ద రూ.5.26 కోట్లతో బ్రూడర్ బ్యాంక్, అనంతపురంలో రూ.5 కోట్లతో తలాపియా బ్రీడింగ్ సెంటర్‌తో పాటు రూ.184 కోట్లతో గుంటూరు జిల్లా పరసావారిపాలెం వద్ద 280 ఎకరాల్లో మెగా ఆక్వాపార్క్ ఏర్పాటు చేస్తోంది.
► మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచేందుకు 70 ఆక్వాహబ్స్‌తో పాటు 14 వేలకు పైగా రిటైల్ అవుట్ లెట్స్‌కు శ్రీకారం చుట్టింది. తొలిదశలో రూ.325.15 కోట్లతో 25 ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తోంది. రూ.546.97 కోట్లతో 10 ప్రాసెసింగ్, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment