సాక్షి, అమరావతి: ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ ధర పెంపుపై రైతులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీ ఏర్పాటు చేశారు. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సరే రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశు సంవర్ధక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్‌లతో సాధికారత కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ కమిషనర్ కమిటీ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆక్వా ఫీడ్ సరఫరా, ఆక్వా ఫీడ్ ధర, ఆక్వా కొనుగోలు ధర.. సంబంధిత అంశాలను అధ్యయనం చేయడంతో పాటు రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.
నాణ్యత, ధరల పర్యవేక్షణకూ చట్టం
► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కొత్తగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఆక్వాకల్చర్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవల ఏకీకృత డెలివరీ మెకానిజం ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చింది.
► ఆక్వాకల్చర్ ఇన్‌పుట్‌ల (విత్తనం, మేత) నాణ్యత, ధర, ఉత్పత్తుల ధరల పర్యవేక్షణ, నియంత్రణను ఈ అథారిటీ చూస్తుంది. ఆక్వాకల్చర్ వాటాదారులకు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా లైసెన్స్‌లు, ఎండార్స్‌మెంట్‌ల జారీని సులభతరం చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతి కోసం అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రత్యేకంగా యూనివర్సిటీ
► మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా రంగ
అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుంది.
► కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల్లో నిషేధం కారణంగా.. ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతల గిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు తగిన ధరలను నిర్ణయించింది.
బ్యాంకుల ద్వారా భరోసా
► ప్రైవేట్ రంగంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా.. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ. మత్స్య శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి రుణాలు. ఈ– మత్స్యకార పోర్టల్‌లో అందుబాటులో జిల్లాలు, సెక్టార్, బ్యాంకుల వారీగా రుణాలు పొందిన వారి వివరాలు. ఇప్పటి వరకు 19,059 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ. రూ.2,673 కోట్ల రుణం మంజూరు.
► కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా కల్చర్ ల్యాబ్‌లు. ఇప్పటికే ఉన్న మరో 8 ల్యాబ్‌ల ఆధునికీకరణ. తద్వారా అన్ని కోస్తా జిల్లాల్లోని 35 ప్రాంతాల్లో ల్యాబ్‌లు. నీరు, మట్టి విశ్లేషణ చేయడంతోపాటు వివిధ రకాల పరీక్షల కోసం రూ.50 కోట్లు కేటాయింపు. ఈ ల్యాబ్‌ల్లో 14 ఆక్వా ల్యాబ్‌లు కాగా, 3 మొబైల్.. మిగతావి ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు. 2022 ఆఖరుకు అందుబాటులోకి ఆక్వా ల్యాబ్‌లు.
ఆక్వా రైతుల కోసం, ఫిష్ ఫీడ్ కోసం ప్రత్యేక చట్టం
► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం–2020ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఆక్వా సీడ్‌లో నకిలీకి ఆస్కారం లేకుండా నాణ్యమైన సీడ్‌ను మాత్రమే రైతులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. నకిలీ, అక్రమ పద్ధతుల్లో సాగుతున్న సీడ్ వ్యాపారాలను నిరోధించేందుకు చట్టం ద్వారా చర్యలు తీసుకుంది.
► ఫిష్ ఫీడ్ నాణ్యతకు ప్రత్యేక చట్టం చేసింది. ఆక్వా కల్చర్ నిర్వహణ వ్యయంలో 60 శాతం ఫీడ్‌కు ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద ఫిష్ ఫీడ్‌లో క్వాలిటీ కంట్రోల్ కోసం ఎలాంటి నియంత్రణ యంత్రాంగం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫిష్ ఫీడ్‌కు సంబంధించి.. అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్య పరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా చేపల మేత పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నిరోధించడానికి, చేపల మేత వ్యాపారంలో నాణ్యత నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దేశంలోనే తొలిసారిగా ఫిష్ ఫీడ్ (క్వాలిటీ, కంట్రోల్ ) చట్టం–2020 తీసుకువచ్చింది.
ఆక్వా రైతుల సంక్షేమ కోసం ఎన్నో నిర్ణయాలు
► ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు యూనిట్ రూ.1.50 చొప్పున సరఫరా చేస్తోంది.
► 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 చొప్పున సరఫరా చేశారు. 2108 జూన్ నుంచి 2019 జూన్ వరకు రూ.2కే యూనిట్ సరఫరా చేయగా, జూలైలో ప్రస్తుత ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.50కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 నుంచి 2021–22 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,377.52 కోట్లు ఇచ్చింది.
► గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలుస్తోంది. రాయితీతో కూడిన ఫీడ్ వంటి ఇన్‌పుట్స్ అందించడంతో పాటు, ఆక్వా సాగులో అత్యాధునిక, వినూత్న విధానాల్లో శిక్షణ. దీనికోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 732 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను నియామకం.
► ఆక్వా రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధర కల్పించేందుకు ఈ–క్రాప్ (ఇ–ఫిష్) బుకింగ్ సౌకర్యం. ఈ–ఫిష్ యాప్ సహకారంతో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో మత్స్య, రొయ్యల సాగు విస్తీర్ణం నమోదు.
► ఇ–మత్స్యకార పోర్టల్ సహాయంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ఏర్పాటు. తద్వారా ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాల వినియోగంపైన శిక్షణ. ఆర్బీకేల ద్వారా రూ.13.27 కోట్ల విలువైన 2,473 మెట్రిక్ టన్నుల ఫీడ్ సరఫరా.
Comments
Please login to add a commentAdd a comment